న్యూఢిల్లీ: దేశంలో స్టార్టప్ కంపెనీలు, ఆవి చేసే నవీన ఆవిష్కరణలపై సంపూర్ణ విశ్వాసం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ ట్రెండ్స్, టెక్నాలజీలో భారత్ నాయకత్వం వహించాలని ఆకాంక్షించారు. కృత్రిమ మేధ(ఏఐ)లో మనం ముందంజలో ఉండాలని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో ‘స్టార్టప్ ఇండియా’ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు.
రాబోయే పదేళ్లలో నూతన స్టార్టప్ ఆవిష్కరణలు, సాంకేతికతకు మనమే సారథ్యం వహించేలా ఎదగాలని పేర్కొన్నారు. నూతన ఆలోచనలు, సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, అదే సమయంలో నాణ్యమైన ఉత్పత్తులను ప్రజలకు అందించాలని స్టార్టప్ కంపెనీలను కోరారు. ముఖ్యంగా తయారీ, పరిశోధనలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈనాటి పరిశోధనే రేపటి మేధో సంపత్తి అవుతుందన్నారు. స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఇవ్వడానికి, నిధులు అందజేయడానికి తమ ప్రభుత్వం పలు పథకాలు తీసుకొచి్చనట్లు ప్రధానమంత్రి గుర్తుచేశారు. కాలం చెల్లించిన నిబంధనలు తొలగించామని అన్నారు.
స్టార్టప్‌ల ప్రతినిధులతో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్టార్టప్ ఇండియా మిషన్ ఒక విప్లవాత్మకమైన ముందడుగుగా అభివరి్ణంచారు. మన దేశంలో 2014లో కేవలం నాలుగు స్టార్టప్‌లు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 2 లక్షలకు చేరిందని హర్షం వ్యక్తంచేశారు. 125 యాక్టివ్ యూనికార్న్ కంపెనీలు ఉన్నాయని తెలియజేశారు. ప్రపంచంలో మూడోఅతిపెద్ద స్టార్టప్‌ల వ్యవస్థ మన దేశంలోనే ఉందన్నారు. ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇలాంటి కంపెనీలు ఏర్పాటవుతున్నాయని పేర్కొన్నారు. 45 శాతం స్టార్టప్ కంపెనీల్లో కనీసం ఒక మహిళా డైరెక్టర్ లేదా భాగస్వామి ఉండడం సంతోషం కలిగిస్తోందని ఉద్ఘాటించారు.


