భారతీయులకు రక్షణ కల్పించాలని వినతి
పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటున్నట్లు వెల్లడి
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగుతుండడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన మంగళవారం ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిఖ్, కువైట్ యువరాజు షేక్ సబా అల్–ఖలీద్ అల్–హమద్ అల్–ముబారక్ అల్–సబా, ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో ఫోన్‌లో మాట్లాడారు. తాజా పరిస్థితిపై వారితో చర్చించారు. మూడు దేశాలపై దాడులతోపాటు సార్వబౌమత్వం, ప్రాదేశిక సమగ్రతల ఉల్లంఘన జరుగుతుండడాన్ని మోదీ తీవ్రంగా ఖండించారు.
ఆయా దేశాల్లో నివసిస్తున్న భారతీయుల సంక్షేమం, భద్రతపై చర్చించారు. భారతీయులకు తగిన రక్షణ కల్పించడానికి చర్యలు చేపట్టాలని కోరారు. ప్రధాని మోదీ గత రెండు దేశాల్లో పశ్చిమాసియాలో ఎనిమిది దేశాల అధినేతలతో మాట్లాడారు. ప్రధానంగా భారతీయుల భద్రతని వారి దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం ఒమన్, కువైట్, ఖతార్ దేశాల పెద్దలతో మాట్లాడినట్లు మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు.
పశ్చిమాసియాలో సాధ్యమైనంత త్వరగా శాంతి, స్థిరత్వం నెలకొనాలని తాము కోరుకుంటున్నట్లు వెల్లడించారు. వివాదాలను దౌత్య మార్గాల్లో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని స్పష్టంచేశారు. భారతీయుల రక్షణ విషయంలో మద్దతు ఇస్తున్నందుకు మూడు దేశాల అధినేతలకు కృతజ్ఞతలు తెలియజేసినట్లు పేర్కొన్నారు.


