మోదీజీ.. మీ కోసం వెయిటింగ్‌ ఇక్కడ.. | One Vande Bharat and two Amrit Bharat services ready to take off | Sakshi
Sakshi News home page

మోదీజీ.. మీ కోసం వెయిటింగ్‌ ఇక్కడ..

Mar 4 2026 1:12 AM | Updated on Mar 4 2026 1:12 AM

One Vande Bharat and two Amrit Bharat services ready to take off

పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉన్న ఒక వందేభారత్, రెండు అమృత్‌ భారత్‌ సర్వీసులు

ఈ నెల 6నే ప్రారంభం కావాల్సి ఉన్నా... ఖరారుకాని ప్రధాని షెడ్యూల్‌

పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో వర్చువల్‌గా ప్రారంభించాలనే యోచన

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుంచి త్వరలో కొత్తగా ఒక వందేభారత్, రెండు అమృత్‌భారత్‌ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వాటిని పట్టాలెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన రైల్వే అధికారులు, ప్రధానమంత్రి మోదీతో ప్రారంభోత్సవం చేయించేందుకు ఎదురు చూస్తున్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆయన అపాయింట్‌మెంట్‌లో స్పష్టత రాకపోవటంతో తాత్కాలికంగా వాటి ప్రారంభోత్సవాన్ని పెండింగులో ఉంచారు. ఈనెల 6న ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని ఓ దఫా రైల్వే శాఖ అధికారులకు సమాచారం అందినా, అది వాయిదా వేస్తున్నట్టు మరో సమాచారం అందింది. దీంతో కార్యక్రమం ఎప్పుడుంటుందో స్పష్టత లేనప్పటికీ, ప్రధానికి సమయం కేటాయించే వీలు లేని పక్షంలో వర్చువల్‌గానైనా త్వరలో ప్రారంభిస్తారని సమాచారం.

సికింద్రాబాద్‌/చర్లపల్లి–నాందేడ్‌ వందేభారత్‌
హైదరాబాద్‌–నాందేడ్‌ మధ్య వందేభారత్‌ రైలు ప్రారంభానికి సిద్ధమైంది. రెండు నగరాల మధ్య 280 కి.మీ. దూరం ఉండగా... ప్రస్తుతం నడుస్తున్న సాధారణ రైళ్లు గమ్యం చేరేందుకు 7 గంటల సమయం తీసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ దూరాన్ని మూడు గంటల్లో చేరుకునేలా వందేభారత్‌ రైలు పట్టాలెక్కబోతోంది. నాందేడ్‌ మహారాష్ట్రలో ఉన్నప్పటికీ, అక్కడి వ్యాపారులు సరుకుల కోసం హైదరాబాద్‌కే వస్తుంటారు. సాధారణ ప్రజలు కూడా శుభకార్యాల షాపింగ్‌కు హైదరాబాద్‌కే వస్తుంటారు. దీంతో రెండు నగరాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపరిచేందుకు వందేభారత్‌ రైలు ఉపయోకకరంగా ఉండనుంది. ఈ డిమాండ్‌ ఆధారంగానే రైల్వే బోర్డు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను మంజూరు చేసింది. ఇది సికింద్రాబాద్‌ లేదా చర్లపల్లి నుంచి నడుస్తుంది.

అమృత్‌భారత్‌ రైళ్లు...
ఇటీవలే హైదరాబాద్‌కు రెండు అమృత్‌భారత్‌ రైళ్లను కేటాయించిన రైల్వే బోర్డు తాజాగా మరో రెండింటిని మంజూరు చేసింది. ఇవి చర్లపల్లి నుంచి కోల్‌కతాలోని షాలిమార్‌కు, యూపీలోని గోరక్‌పూర్‌కు నడుస్తాయి. హైదరాబాద్‌–కోల్‌కతా మధ్య ప్రయాణికుల సంఖ్య భారీగానే ఉన్నప్పటికీ, సరిపడా రైళ్లు లేవు. ఇక యూపీలోని గోరక్‌పూర్‌కు నడిచే అమృత్‌భారత్‌.. కాన్పూర్, నాగ్‌పూర్, లక్నో, భోపాల్‌ను అనుసంధానిస్తుంది. గోరక్‌పూర్‌కు ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి రెగ్యులర్‌ రైళ్లు లేవు. వారానికి ఒక రోజు చొప్పున నడిచే నాలుగు సర్వీసులున్నాయి. ఈ రూట్‌లోనూ ప్రయాణికుల డిమాండ్‌ అధికంగా ఉంది.  

Advertisement
 
Advertisement
Advertisement