ఎలక్ట్రిక్ వాహన రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన పాపులర్ మోడల్ ‘పంచ్ ఈవీ’లో సరికొత్త 2026 ఎడిషన్‌ను ఆవిష్కరించింది. అత్యాధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో రూపొందిన ఈ మోడల్ ఈ నెల 20వ తేదీన అధికారికంగా మార్కెట్లోకి విడుదల కానుంది.
కొత్తదనంతో..
కొత్త పంచ్ ఈవీ ఔటర్ బాడీలో టాటా మోటార్స్ కీలక మార్పులు చేసింది. మునుపటి మోడల్‌లో హెడ్ ల్యాంప్‌లను కలుపుతూ ఉండే బ్లాక్ స్ట్రిప్‌ను ఈ కొత్త మోడల్‌లో తొలగించారు. ఇది కారుకు మరింత క్లీన్, ప్రీమియం లుక్‌ను ఇస్తుందని కంపెనీ తెలిపింది. కొత్తగా తీసుకొచ్చిన సన్ లిట్ యెల్లో షేడ్ వాహనాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. దీనికి తోడు కొత్త డిజైన్ కలిగిన అల్లాయ్ వీల్స్ చూపరులను ఆకట్టుకుంటున్నాయని చెప్పింది.
హైటెక్ ఫీచర్లు
కారు లోపలి భాగంలో మరింత టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. 12.3 ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఇందులో ప్రత్యేకంగా నిలువనున్నాయి. యాంబియంట్ లైటింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
బ్యాటరీ రేంజ్ వివరాలు
ఈ కారును రెండు వేరియంట్లలో తీసుకొచ్చారు. 25 కిలోవాట్‌హవర్ (స్టాండర్డ్) వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే 265 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ తెలిపింది. 35 కిలోవాట్‌హవర్ (లాంగ్ రేంజ్) వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే 365 కిలోమీటర్లు రేంజ్ ఇస్తుందని పేర్కొంది.
ధర ఎంతంటే..
ఈ సరికొత్త మోడల్ ధర మధ్యతరగతి వినియోగదారులకు అందుబాటులో ఉండేలా టాటా మోటార్స్ ప్లాన్ చేస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర వేరియంట్‌ను అనుసరించి సుమారుగా రూ.9,99,000 నుంచి రూ.14,44,000 వరకు ఉండవచ్చని అంచనా.
మార్కెట్‌లో ఇంకా విభిన్న కంపెనీలకు చెందిన వివిధ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటితో పోల్చుకొని, ఆటోమొబైల్ నిపుణుల సలహా తీసుకొని వాహనదారులు కార్ల కొనుగోలు విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని గమనించాలి.
ఇదీ చదవండి: రిస్క్ లేకుంటే రాబడి లేదు!


