టయోటా భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ కారు 'అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా'ను అధికారికంగా ఆవిష్కరించింది. దీనిని ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న మారుతి సుజుకి ఈవిటారా ఆధారంగా రూపొందించారు. కాబట్టి డిజైన్, ఫీచర్స్, ఇంజిన్ వంటివన్నీ కూడా.. దాదాపు విటారాలో ఉన్నట్లుగానే ఉన్నాయి.
టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా బాడీ షెల్ ఈవిటారా మాదిరిగా ఉన్నప్పటికీ.. ఒక ప్రత్యేకమైన ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంది, ఎల్ఈడీ డీఆర్ఎల్‌లతో సొగసైన హెడ్‌ల్యాంప్‌లు, విభిన్నమైన ఫ్రంట్ బంపర్‌ను కలిగి ఉంది. ఇది ఈవిటారా లాగా లైట్ బార్ ద్వారా కనెక్టెడ్ ఎల్ షేప్ టెయిల్‌లైట్‌లను పొందుతుంది.
లోపల భాగంలో అర్బన్ క్రూయిజర్ ఈవీ.. ఈవిటారాలో మాదిరిగానే అదే డాష్‌బోర్డ్‌ను పొందుతుంది. ఇది డ్యూయల్ స్క్రీన్ లేఅవుట్‌ను కలిగి ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, పవర్డ్ డ్రైవర్ సీటు, సన్‌రూఫ్, జేబీఎల్ ఆడియో సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, 360 డిగ్రీ కెమెరా, లెవల్ 2 ఏడీఏఎస్ వంటి అనేక లేటెస్ట్ ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయి.
భారతదేశంలో, అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా రెండు బ్యాటరీ ఎంపికలతో (49 kWh & 61 kWh) లభిస్తుంది. 49 కిలోవాట్ బ్యాటరీ కలిగిన వేరియంట్ 142 bhp & 189 Nm శక్తిని అందించే ఎలక్ట్రిక్ మోటారును.. 61 కిలోవాట్ బ్యాటరీ 172 bhp & 189 Nm టార్క్ అందించే మరింత శక్తివంతమైన మోటారుతో వస్తుంది. పెద్ద బ్యాటరీ 543 కిమీ వరకు ప్రయాణించగలదని సమాచారం.
ఇదీ చదవండి: భారత్ నుంచి 100 దేశాలకు.. ఈ కారు గురించి తెలుసా?
టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా 5 మోనోటోన్ (కేఫ్ వైట్, బ్లూయిష్ బ్లాక్, గేమింగ్ గ్రే, స్పోర్టిన్ రెడ్, ఎంటైసింగ్ సిల్వర్) కలర్స్, 4 డ్యూయల్-టోన్ కలర్ (కేఫ్ వైట్/బ్లాక్ రూఫ్, ల్యాండ్ బ్రీజ్ గ్రీన్/బ్లాక్ రూఫ్, స్పోర్టిన్ రెడ్/బ్లాక్ రూఫ్ & ఎంటైసింగ్ సిల్వర్/బ్లాక్ రూఫ్) ఎంపికలలో లభిస్తుంది. కాగా కంపెనీ ఈ కారు ధరలను లాంచ్ సమయంలో వెల్లడించనుంది.


