వ్యాపార నిర్వహణ సులువుగా సాగే అవకాశాన్ని కల్పించే విధంగా 2026–27 బడ్జెట్ రూపొందాలి. అలాగే ఎగుమతులపై ఆధారపడిన పరిశ్రమలకు బడ్జెట్ కొంత ఆసరా కల్పించవలసి ఉంది.
సందర్భం
ఒకపక్క భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మరోపక్క అమెరికా ఇష్టం వచ్చినట్లు సుంకాలు విధిస్తోంది. ఈ నేపథ్యంలో దేశ 2026–27 బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందుతున్నాయి. ఈ కీలక ఘట్టంలో 2025–26 ఆర్థిక సంవత్సరపు మొదటి ముందస్తు అంచనాలు కొన్ని శుభ వార్తలను మోసుకొచ్చాయి. స్థూల జాతీ యోత్పత్తి (జీడీపీ)లో వృద్ధి రిజర్వ్‌బ్యాంక్ తొలుత అంచనా వేసినట్లు 6.5 శాతం కాక, 7.4 శాతం ఉండగలదనే అంచనాకు రావడం పరిస్థితులలో వచ్చిన మార్పును సూచిస్తోంది.
సంస్కరణలు మార్పు తెచ్చాయనీ, వృద్ధి ఇదే స్థాయిలో నిలకడగా కొనసాగేందుకు వాటిని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందనీ కూడా ఇది సూచిస్తోంది. వస్తువు – సేవల పన్ను (జీఎస్టీ)లో శ్లాబులను మార్చడం, చాలా వాటిపై పన్నుల శాతాలు తగ్గించడం వల్ల ఆర్థిక వ్యవస్థ తేటపడింది. జీఎస్టీలోని నియంత్రణ సంక్లిష్టతను దృష్టిలో పెట్టుకుని ఆ మార్పుచేర్పులు ఎప్పుడో చేసి ఉండ వలసింది.
కాలం చెల్లిన చట్టాలకు గుడ్‌బై!
అలాగే, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొన్ని చర్యలను ఇటీవలి కాలంలో తీసుకున్నారు. పార్లమెంట్ ఐదేళ్ళ క్రితమే ఆమోదించిన నాలుగు కార్మిక స్మృతులను అమలులోకి తెచ్చారు. పారిశ్రామిక వ్యవహారాలకు సంబంధించిన దాదాపు 29 వేర్వేరు చట్టాల స్థానంలో ఆ స్మృతులు వచ్చి చేరాయి. వలస పాలన కాలంనాటి ఆ చట్టాలను కూడా ఎన్నడో మార్చి ఉండాల్సింది. చట్టాల సంఖ్య ఎక్కువ కావడంతో కార్మిక సమస్యలు ఏళ్ళ తరబడి చిక్కుముడులకు లోనవుతూ వచ్చాయి. ఫలితంగా, వ్యాపార సంస్థలు ఆ చట్టాలను అనుసరించడంలో గందరగోళం నెలకొంటూ వచ్చింది.
కొత్త లేబర్ కోడ్స్ ఆర్థిక వృద్ధికి తక్షణం తోడ్పడగల సంస్కరణ కాకపోవచ్చు. కానీ, పెట్టుబడులు పెట్టదలచుకున్నవారికి తీవ్ర సందేహాలను రేకెత్తిస్తున్న అంశాల్లో అవి స్పష్టతను, సరళతను తెచ్చాయి. ఉదాహరణకు, ఇంటి నుంచి పని చేసే విషయంలో అవి మరింత వెసులుబాటుకు అవకాశం కల్పించాయి. పర్మనెంట్ ఉద్యోగాలకు బదులు స్వల్పకాలిక కాంట్రాక్టులు, ఫ్రీలాన్సర్ ఉద్యోగాలు పెరుగుతున్న ‘గిగ్’ ఆర్థిక వ్యవస్థలో వర్కర్లకు మరింత సామాజిక భద్రతను కల్పించేందుకు తోడ్పడనున్నాయి. ఆ స్మృతుల్లో ఇప్పటికీ లోపాలు ఉంటే ఉండవచ్చు; వాటిని భవిష్యత్తులో పరిష్కరించు కోవచ్చు. మొత్తానికి, కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయడం వల్ల దేశంలో వ్యాపార నిర్వహణ సులభతరం అయింది.
వృద్ధి సానుకూలమే!
ఇతర రంగాలలో కూడా సంస్కరణల అవసరం ఉంది. మొదటి ముందస్తు అంచనాలలో అన్నీ సానుకూలంగా ఏమీ లేకపోవడం ఆ వాస్తవాన్ని మరింత వెల్లడిస్తోంది. ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో అంటే అక్టోబర్ నుంచి మార్చి మధ్య కాలంలో వృద్ధి రేటు మందగించింది. మొదటి రెండు త్రైమాసికాలలో వరుసగా 7.8 శాతం, 8.2 శాతం వృద్ధి రేటు నమోదైంది. తర్వాత, రెండు త్రైమాసి కాలలో ఇది 6.9 శాతం స్థాయిలో ఉండవచ్చని భావిస్తున్నారు.
తిరిగి సానుకూలంగా ఉన్న అంశాల వైపు దృష్టి సారిద్దాం. వస్తూత్పత్తి 4.5 శాతం నుంచి 7.4 శాతానికి విజృంభించినట్లు ముందస్తు అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఇది 2025–26 ఆర్థిక సంవ త్సరంలో అధిక వృద్ధి సాధించేందుకు ఊతం ఇచ్చింది. సగటున దాదాపు 8 శాతం చొప్పున, గత మూడేళ్లలో వృద్ధిలో కనిపించిన వేగం కూడా గణనీయమైన విషయమే.
ఇప్పటికి కొద్ది ఏళ్ళ నుంచి భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేరు తెచ్చుకుంటున్నప్పటికీ, మధ్య–ఆదాయ ట్రాప్ నుంచి తప్పించుకునేందుకూ, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకూ, ఇంకా వేగంగా వృద్ధి చెందవలసిన అవసరం ఉంది. బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించేటపుడు, ఆర్థిక మంత్రి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది.
దృష్టి పెట్టాల్సినవి!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాల వల్ల మారిపోతున్న ప్రపంచంలో వాణిజ్యమే పెద్ద అంశంగా కనిపిస్తోంది. అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తువులు 50 శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై మరికొంత సుంకాలు విధిస్తామని ఆయన బెదిరిస్తున్నారు. భారత –అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం అనేక కారణాల రీత్యా, ముఖ్యంగా ట్రంప్ అహంకారం వల్ల, ఇప్పటికీ తుదిరూపు దిద్దు కోలేక పోతోంది. మన దేశానికి కొత్త అమెరికా రాయబారిగా వచ్చిన సెర్జియో గోర్ కనబరుస్తున్న సానుకూలత వల్ల, ఈ ఒప్పందం కుదరవచ్చని ఆశలు పొటమరిస్తున్నాయి. దానిమాటెలా ఉన్నా... ఎగుమతులపై ఆధార పడిన, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న పరిశ్రమలకు బడ్జెట్ కొంత ఆసరా కల్పించవలసి ఉంది.
రత్నాలు, ఆభరణాలు వంటి పరిశ్రమలు, రెడీమేడ్ దుస్తుల కంపెనీలు అమెరికా సుంకాలతో బాగా దెబ్బతినిపోతాయని భయ పడిన మాట వాస్తవం. కానీ, అవి వేగంగా ఇతర మార్కెట్లకు విస్తరించడం వల్ల కనీసం తాత్కాలికంగానైనా ఆ ప్రభావాన్ని తట్టుకో గలుగుతున్నాయి. నవంబర్ (2025)కు సంబంధించిన డేటా, ఈ విభాగాల ఎగుమతుల్లో ఆశ్చర్యకరంగా పెరుగుదలను కనబరచింది. ఆ విభాగాల ఎగుమతులు 2025 నవంబర్‌లో దాదాపు 19 శాతం పెరిగాయి.
ఎగుమతులలో వృద్ధికి ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్ వస్తువులు, ఫార్మాస్యూటికల్స్, పెట్రోలియం ఉత్పత్తులు, రెడీమేడ్ దుస్తుల విభాగాలు ప్రధాన ఆలంబనగా నిలిచాయి. ఇంకా ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే, భారీ సుంకాల ప్రతిబంధకాలు ఉన్న ప్పటికీ, అమెరికాకు ఎగుమతులు 22 శాతం పెరిగాయి. మొబైల్ ఫోన్లు, ఎగుమతుల్లో ప్రధాన వస్తువుగా నిలుస్తున్నాయి. ఒక్క ఏడాది కాలంలోనే వాటి ఎగుమతులు మూడు రెట్ల పెరుగుదలను చవిచూశాయి.
నిరుద్యోగిత రేటు మూడునెలల కాలంలో అత్యల్ప స్థాయికి అంటే 8.6 శాతానికి తగ్గిందని ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండి యన్ ఎకానమీ’ వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం తగ్గుముఖం పట్టడం దానికి కారణంగా పేర్కొంది. అయితే, వ్యవసాయమే ఇప్పటికీ 45 శాతం మందికి ఉపాధి కల్పిస్తోంది. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న నైపుణ్యం లేని, నైపుణ్యం ఉన్న వారిని తగినంతగా ఇముడ్చుకోగలిగినంతగా వస్తూత్పత్తి రంగం వ్యాకోచించలేదు.
ఈ రంగం విషయంలోనే, భారత్, ఇతర ఆసియా ఆర్థిక వ్యవస్థల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. వీలైనంత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే విధంగా ఇతర దేశాల్లో చిన్న, మధ్య తరహా వస్తూత్పత్తి సంస్థలు తగినంతగా విస్తరించగలిగాయి. వ్యాపార నిర్వహణ సులువుగా సాగే అవకాశాన్ని కల్పించే విధంగా బడ్జెట్ రూపొందాలి. అప్పుడే, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు అవసరమైన స్థాయిల్లో వృద్ధి రేటును తీసుకెళ్ళడం సాధ్యమవుతుంది.
సుష్మా రామచంద్రన్
వ్యాసకర్త సీనియర్ ఫైనాన్సియల్ జర్నలిస్ట్
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)


