ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కూటమి సర్కారు నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీల్ని అమలు చేయకపోగా... ఉద్యోగాలను పెద్ద ఎత్తున కల్పించినట్లు పచ్చి అబద్ధాలను ప్రచారం చేసుకుంటోంది. ఏపీ శాసన సభలో ఫిబ్రవరి 25న విద్యాశాఖ మంత్రి లోకేష్ తప్పుడు ఉద్యోగ కల్పన గణాంకాలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,587 జాబ్ మేళాలు జరిపి, 1,08,747 ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి, సీడాప్ ద్వారా 74 వేల మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అందులో 40 వేల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పుకొచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా 22 క్లస్టర్లను గుర్తించినట్లు సభలో ప్రకటించారు. అనేక సదస్సులు జరిపి 770 ప్రాజెక్టులతో ఒప్పందాలు (ఎంవోయూలు) జరిగినట్లు గొప్పగా తెలిపారు. ఐదు లక్షల మంది నిరుద్యోగులకు పారా మెడికల్ శిక్షణ ఇచ్చి వారందర్నీ విదేశా లకు పంపాలని ప్రభుత్వం భావిస్తుందని అసెంబ్లీలో చెప్పు కొచ్చారు. నిజానికి లోకేష్ ప్రకటించిన గణాంకాలన్నీ వాస్తవ విరుద్ధ మైనవే! 1,587 జాబ్ మేళాలు నిర్వహించి 1,08,747 ఉద్యోగాలు కల్పిస్తే వాటికి సంబంధించిన ఆధారాలను, బహిర్గతం చేయాలి కదా! ఆ పని చేయలేదు. నిరుద్యోగుల్ని వంచించే కుట్ర ఇది.
అధికారం చేపట్టక ముందు రాష్ట్రంలో 2.50 లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నాయని లోకేష్ నెత్తీ, నోరు బాదుకున్నారు. అధికారం చేపట్టగానే ఇంటికో ఉద్యోగం ఇస్తామనీ, సంవత్సరానికి నాలుగు లక్షల చొప్పున ఐదేళ్ళలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనీ ‘యువగళం’ పాదయాత్రలో హామీ ఇచ్చారు. ప్రతీ జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇది జరగకుంటే తన చొక్కా కాలర్ పట్టుకుని నిలదీసి అడగండని నిరుద్యోగ యువతకి మాటిచ్చారు. అధికారం చేపట్టి ఇరవై నెలల సమయం అవుతున్నా ఈ హామీ ఏమయ్యింది?
ఉద్యోగాలిచ్చేంత వరకూ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు భృతి చెల్లిస్తామని చంద్రబాబు ఎన్నికల్లో వాగ్దానం చేశారు. ప్రతీ నెల మూడువేల రూపాయల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని అన్నారు. కానీ చిల్లిగవ్వ కుడా చెల్లించలేదు. రాష్ట్రంలో 1.75 లక్షల కుటుంబాలున్నాయి. ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు దాదాపు రెండేళ్లకి కలిపి రూ. 14,400 కోట్లు నిరుద్యోగ భృతికి బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలి. 2026 బడ్జెట్ కూడా కలుపుకొంటే మొత్తం రూ. 21,600 కోట్లు చెల్లించాలి. అంటే రాష్ట్రంలో ప్రతీ నిరుద్యోగికీ ప్రభుత్వం డెబ్భై రెండువేల రూపాయల నిరుద్యోగ భృతి బాకీ ఉందన్నమాట.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో నిరుద్యోగ యువతకి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విరివిగా కల్పించారు. సుమారు 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఒకేసారి 1.30 లక్షల శాశ్వత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు కల్పించారు. 2.66 లక్షల వాలంటీర్ల నియామకాలు చేపట్టారు. ఆప్కాస్ ద్వారా 96 వేల ఉద్యోగాలిచ్చారు. ఆర్టీసీ విలీనం ద్వారా 58 వేల మంది ఉద్యోగుల్ని జగన్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. భారీ పరిశ్రమలలో లక్ష మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) రంగంలో 32 లక్షల 79 వేల 970 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం 40 లక్షల 13 వేల 552 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించింది. ఇప్పటికైనా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. నిరుద్యోగ భృతి చెల్లించాలి. లేకపోతే యువత ఉద్యమిస్తుంది.
– ఎ. రవిచంద్ర ‘ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ


