లీటర్‌ పెట్రోల్‌తో ఎక్కువ దూరం ప్రయాణం! | Top high mileage cars in India for 2026, check list | Sakshi
Sakshi News home page

లీటర్‌ పెట్రోల్‌తో ఎక్కువ దూరం ప్రయాణం!

Feb 11 2026 2:47 PM | Updated on Feb 11 2026 2:53 PM

Top high mileage cars in India for 2026, check list

భారతీయులకు కారు లగ్జరీ కంటే కూడా అది ఇచ్చే మైలేజీనే ముఖ్యమని చెప్పడానికి ఓ ఆటోమొబైల్‌ సంస్థ గతంలో ఇచ్చిన యాడ్ నిదర్శనంగా నిలుస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరల దృష్ట్యా కొత్త కారు కొనాలనుకునే వారు నేటికీ మైలేజీకే పెద్ద పీట వేస్తున్నారు. వివిధ కంపెనీలు అందించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం మార్కెట్లో అత్యధిక మైలేజీనిచ్చే టాప్-5 కార్లు కింద చూద్దాం.

టాప్ 5: మారుతీ సుజుకీ స్విఫ్ట్ (కొత్త మోడల్‌)

కంపెనీ ఇటీవల విడుదల చేసిన ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ తన మైలేజీతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దీని పెట్రోల్‌ మాన్యువల్ మోడల్ లీటర్‌కు 24.8 కి.మీ., ఆటో గేర్ వెర్షన్ 25.75 కి.మీ మైలేజీ అందిస్తుంది. పాత మోడల్‌తో పోలిస్తే ఇది 3 కిలోమీటర్ల మైలేజీని అదనంగా ఇస్తుంది. అయితే మైలేజీ కోసం ఇంజన్ పవర్‌లో స్వల్పంగా 8 బీహెచ్‌పీ శక్తిని తగ్గించడం గమనార్హం.

టాప్ 4: మారుతీ సుజుకీ సెలెరియో

అధిక ఇంధన సామర్థ్యం కలిగిన నాన్-హైబ్రిడ్ పెట్రోల్ కారుగా సెలెరియో గుర్తింపు పొందింది. ఏఆర్‌ఏఐ సర్టిఫికేషన్ ప్రకారం మాన్యువల్ వెర్షన్ 25.24 కి.మీ, ఆటో గేర్ వెర్షన్ ఏకంగా 26.68 కి.మీ/లీటర్ మైలేజీని ఇస్తుంది.

టాప్ 3: హోండా సిటీ (హైబ్రిడ్)

సెడాన్ కార్ల విభాగంలో మైలేజీకి రారాజుగా హోండా సిటీ హైబ్రిడ్ నిలుస్తోంది. 1.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ వ్యవస్థ ఇందులో ఉంటుంది. ఈ కారు లీటరుకు 27.26 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని ఏఆర్‌ఏఐ ధ్రువీకరించింది. ఇది 100 బీహెచ్‌పీ శక్తిని, 131 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టాప్ 2: టయోటా హైరైడర్ / మారుతి గ్రాండ్ విటారా

మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ఈ రెండు కార్లు మైలేజీ విషయంలో రాణిస్తున్నాయి. కంపెనీల లెక్కల ప్రకారం ఇవి లీటరుకు 27.97 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయి. వాస్తవానికి హైవేలపై అద్భుతమైన మైలేజీ ఇచ్చినప్పటికీ, సిటీ డ్రైవింగ్‌లో మాత్రం సుమారు 20 కి.మీ మైలేజీ వస్తోందని వినియోగదారులు చెబుతుంటారు.

టాప్ 1: మారుతీ సుజుకీ విక్టోరిస్ (హైబ్రిడ్)

అత్యధిక మైలేజీనిచ్చే ప్రీమియం ఎంపీవీ/ఎస్‌యూవీగా మారుతీ సుజుకీ విక్టోరిస్ నిలుస్తోంది. ఇది లీటరుకు 28 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇది భారీ సైజు ఉన్నప్పటికీ హైబ్రిడ్ టెక్నాలజీ కారణంగా ఇది మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ మోడల్‌కు మంచి డిమాండ్ ఉంది.

ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట

Advertisement
 
Advertisement
Advertisement