అజిత్‌ పవార్‌ ‘దుర్ఘటన’.. జై పవార్ సంచలన వీడియో విడుదల | Ajit Pawar's son shares video VSR Ventures owner slept in pilots seat | Sakshi
Sakshi News home page

అజిత్‌ పవార్‌ ‘దుర్ఘటన’.. జై పవార్ సంచలన వీడియో విడుదల

Mar 2 2026 1:55 PM | Updated on Mar 2 2026 2:12 PM

Ajit Pawar's son shares video VSR Ventures owner slept in pilots seat

ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దివంగత నేత అజిత్ పవార్ మృతికి కారణమైన విమాన ప్రమాద ఘటనలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఇదే విమాన ప్రయాణంలో వీఎస్ఆర్ వెంచర్స్ సంస్థ యజమాని రోహిత్ సింగ్ చీఫ్ పైలట్ సీటులో నిద్రపోతున్నట్లు కనిపిస్తున్న ఒక వీడియోను అజిత్ పవార్ కుమారుడు జై పవార్ సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ఇప్పుడిది సంచలనంగా మారింది. ఈ స్థాయి బాధ్యతారాహిత్యం క్షమించరానిదని  ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన రోహిత్ సింగ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

జనవరి 28న పూణే జిల్లా బారామతి వద్ద జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్‌తో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ విమానాన్ని వీఎస్ఆర్ వెంచర్స్ సంస్థ నడుపుతున్నది. ఈ  ఘటనపై తీవ్రంగా స్పందించిన జై పవార్.. తన తండ్రిని కోల్పోయిన వేదన వర్ణనాతీతమని, ఆ బాధ జీవితాంతం తమను వెంటాడుతూనే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. విమానం గాలిలో ప్రయాణిస్తున్న సమయంలో పైలట్ స్థానంలో కూర్చుని నిద్రపోవడం ప్రయాణికుల భద్రతను పణంగా పెట్టడమేనని, ఇది అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయమని జై పవార్  అన్నారు.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ వ్యవహారంపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని, ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ ముగిసేవరకు వీఎస్ఆర్ వెంచర్స్ సంస్థకు చెందిన అన్ని విమానాలను తక్షణమే నిలిపివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా ఈ ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) శనివారం విడుదల చేసిన ప్రాథమిక నివేదికపై కూడా జై పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రమాద సమయంలో విజిబిలిటీ నిర్ణీత స్థాయి కంటే తక్కువగా ఉండటం, రన్‌వేపై గుర్తులు వెలిసిపోవడం, రన్‌వే ఉపరితలంపై చిన్నపాటి రాళ్లు ఉండటం ప్రమాదానికి కారణాలు కావచ్చని నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక అసంపూర్తిగా ఉందని, దీనివల్ల తమకు న్యాయం జరగదని జై పవార్ అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర ప్రజలకు, బాధిత కుటుంబాలకు ఈ ప్రమాదం వెనుక ఉన్న అసలు కారణాలు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. విమాన ప్రమాదానికి సంబంధించిన విచారణలో భాగంగా ఈ తాజా వీడియోను కూడా పరిగణనలోకి తీసుకోవాలని జై పవార్ డిమాండ్‌ చేశారు.

ఇది కూడా చదవండి: చపాతీలు చేస్తూ చెత్త బుట్ట.. వంట మనిషిని పట్టుకున్న ఏఐ బాట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement