న్యూఢిల్లీ: అత్యంత గౌరవప్రదమైనదిగా భావించే వైద్య వృత్తిలో నివురుగప్పిన నిప్పులా నిరాశ నిస్పృహలు అలుముకుంటున్నాయి. తెల్లకోటు వెనుక దాగి ఉన్న డాక్టర్ల జీవితాల్లో పెరుగుతున్న పని ఒత్తిడి, అభద్రతాభావం ఇప్పుడు వారిని కీలక నిర్ణయాల దిశగా పురికొల్పుతున్నాయి. ‘డెబబ్రత మిథాలి ఆరో ఫౌండేషన్’ ఆరు నెలల పాటు దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాలు, పట్టణాల్లోని 1,200 మందికి పైగా వైద్యులపై నిర్వహించిన సర్వేలో విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి.
సుమారు 91 శాతం మంది వైద్యులు తమ సంతానాన్ని వైద్య వృత్తిలోనికి పంపేందుకు ససేమిరా అంటున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. ఒకప్పుడు సమాజంలో అపారమైన గౌరవం, ఆర్థిక స్థిరత్వానికి చిరునామాగా నిలిచిన ఈ వృత్తిలో నేడు నెలకొన్న దుర్భర పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణమని సర్వే వెల్లడించింది. భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో వైద్యులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి , సుదీర్ఘ పని వేళలు, పని ప్రదేశాల్లో పెరుగుతున్న దాడులు ఈ ఆందోళనకర ధోరణికి బీజం వేస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రులు, రద్దీగా ఉండే పట్టణ కేంద్రాల్లో వైద్యులు రోజుకు 12 నుంచి 18 గంటల పాటు అవిశ్రాంతంగా శ్రమించాల్సి వస్తోంది.
సీనియర్ ఆర్థోపెడిక్స్ కన్సల్టెంట్ డాక్టర్ దీపక్ గౌతమ్ అభిప్రాయం ప్రకారం ఈ విముఖత వృత్తిపై ద్వేషంతో కాకుండా, తమ పిల్లలకు కనీస ప్రశాంతత ఉన్న జీవితాన్ని అందించాలనే ఆకాంక్షతోనే వ్యక్తమవుతోంది. వైద్య విద్య పూర్తి చేసి, ఆర్థికంగా స్థిరపడటానికి పట్టే సుదీర్ఘ కాలం, ఇంజినీరింగ్ లేదా మేనేజ్‌మెంట్ వంటి ఇతర రంగాలతో పోలిస్తే ఎదుగుదలలో ఉండే జాప్యం వైద్యులను అసంతృప్తికి గురిచేస్తోంది. ఎంబీబీఎస్ నుంచి సూపర్ స్పెషలైజేషన్ వరకు సాగే సుదీర్ఘ విద్యా ప్రయాణం యువ వైద్యులను తీవ్ర అలసటకు గురిచేస్తోంది.
వీటన్నింటికీ మించి రోగుల బంధువుల నుంచి ఎదురవుతున్న శారీరక దాడులు, ఆస్పత్రులపై విధ్వంసకర ఘటనలు వైద్యులను అభద్రతాభావంలోకి నెడుతున్నాయి. రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యుల సంఖ్య లేకపోవడం, మౌలిక సదుపాయాల కొరత వంటివి వైద్యులలో ఆందోళన, నిద్రలేమి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు దారితీస్తున్నాయి. వైద్య రంగంలో నెలకొన్న ఈ నిశ్శబ్ద సంక్షోభం భవిష్యత్తులో భారత ఆరోగ్య వ్యవస్థను కుదిపేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: వైమానిక దాడి.. ఇరాన్ మాజీ అధ్యక్షుడు నెజాద్ మృతి


