యువతలో మానసిక అనారోగ్యం | Mental illness in young people with Ultra Processed Food | Sakshi
Sakshi News home page

యువతలో మానసిక అనారోగ్యం

Mar 1 2026 4:30 AM | Updated on Mar 1 2026 4:30 AM

Mental illness in young people with Ultra Processed Food

అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌తో దెబ్బ 

మేధోపరమైన పనితీరు సైతం తగ్గుతోంది 

అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడి

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌: కూల్‌ డ్రింక్స్, ప్యాక్డ్‌ స్నాక్స్, ఇన్‌స్టంట్‌ నూడుల్స్, రెడీ టు ఈట్‌.. ఇలా చెప్పుకూంటూ పోతే ఈ అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్‌ జాబితా పెద్దగానే ఉంటుంది. యువతలో ఉత్పాదకత, భావోద్వేగ స్థిరత్వం తగ్గడానికి వీటి వినియోగం ప్రధాన కారణమని ఒక అధ్యయనంలో తేలింది. పని చేసే జనాభా ఎక్కువగా ఉన్న భారత్‌ వంటి దేశాలకు ఇది ఆందోళన కలిగించే విషయం. 

గ్లోబల్‌ మైండ్‌ ప్రాజెక్ట్‌ కింద వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేసే సేపియన్‌ ల్యాబ్స్‌ విడుదల చేసిన గ్లోబల్‌ మైండ్‌ హెల్త్‌ 2025 నివేదిక ప్రకారం.. అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ ప్రభావం కేవలం ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులకే పరిమితం కాలేదు. మానసిక, మేధోపరమైన పనితీరు తగ్గడానికి కూడా కారణమవుతున్నాయని కొత్త ఆధారాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా 18–34 ఏళ్ల వయస్సు వారిలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.  

యువతపైనే ప్రభావం.. 
ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ వినియోగిస్తున్న 18–34 ఏళ్ల మధ్య వయస్సు గల యువతలో 41% మంది వైద్యపరంగా నిర్ధారించదగిన తీవ్రమైన మానసిక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నారు. 55 ఏళ్లు పైబడిన వారితో పోలిస్తే రోజువారీ జీవితంలో ఉత్పాదకతతో పనిచేయడంలో తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయని నివేదించిన యువత దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. 

2024–25 మధ్య 85 దేశాల్లో నిర్వహించిన ఈ అధ్యయనం ప్రజల అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్‌ వినియోగ తీరుతెన్నులను పరిశీలించింది. 18–34 ఏళ్ల వయస్సు గలవారు 2,21,190 మంది, 55 ఏళ్లు పైబడిన వారు 3,00,522 మంది ఇందులో పాల్గొన్నారు.  

ప్రతికూలత పెంచుతోంది.. 
యువతలో ఎదురవుతున్న మొత్తం మానసిక అనారోగ్య సమస్యల్లో 15–30% వరకు కేవలం అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ను తరచుగా తీసుకోవడం వల్లేనని అధ్యయనం అంచనా వేస్తోంది. ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రధానంగా కుంగుబాటు లక్షణాలతోపాటు, భావోద్వేగ, మేధోపరమైన నియంత్రణ కోల్పోయే సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించారు. 

వీటి వినియోగాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం వల్ల మెరుగైన మానసిక ఆరోగ్య ఫలితాలు కనిపిస్తున్నట్లు తేలింది. ప్రాసెస్‌ చేసిన ఆహారంలో వాడే రసాయన మిశ్రమాల సంఖ్య, క్లిష్టత దశాబ్ద కాలంలో గణనీయంగా పెరిగాయని, ఇది మన శరీరంపై చూపే ప్రతికూల ప్రభావాన్ని మరింత పెంచుతోందని పరిశోధకులు పేర్కొంటున్నారు.  

అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ అంటే.. 
తయారీ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఉత్పత్తి అయిన ఆహార పదార్థాలు. వీటిలో కొవ్వు, చక్కెర, ఉప్పు పరిమాణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సహజ ఆహార పోషకాలు చాలా తక్కువ. ఇవి సాధారణంగా ఐదు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల మిశ్రమంతో తయారవుతాయి. వీటిలో ఆహారాన్ని ఎక్కువ కాలం మన్నికగా ఉంచే ప్రిజర్వేటివ్స్‌; నూనె; నీటిని చిక్కటి, సమాన మిశ్రమంగా ఉంచే ఎమల్సిఫైయర్స్‌; తీపిని ఇచ్చే స్వీట్‌నర్స్‌; కృత్రిమ రంగులు, రుచులు ఉంటాయి.  

ఎవరెవరు ఎంత తింటున్నారు? 
» ప్రపంచవ్యాప్తంగా: ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్న జనాభాలో 18–34 ఏళ్ల మధ్య ఉన్న వారిలో 54% మంది వారంలో ఎక్కువ రోజులు లేదా ప్రతిరోజూ అల్ట్రా ప్రాసెస్డ్‌ ఆహారాలను తీసుకుంటున్నారు. 55 ఏళ్లు పైబడిన వారిలో ఇటువంటివారు కేవలం 26% ఉన్నారు.  

» భారత్‌: యువతలో 44% మంది క్రమం తప్పకుండా ఈ ఫుడ్‌ను ఆస్వాదిస్తున్నారు. 55 ఏళ్లు పైబడిన వారిలో ఈ ఫుడ్‌ను ఆరగించేవారు 11% మాత్రమే.   

అలవాట్లను మార్చుకోగలిగితే.. 
భావోద్వేగ, మేధోపరమైన నియంత్రణ, మానసిక పటిమ.. ఇవి కేవలం వ్యక్తిగత శ్రేయస్సుకే కాకుండా పని ప్రదేశంలో ఉత్పాదకత, విస్తృత సామాజిక స్థిరత్వానికి పునాది వంటిది. ఇలాంటి సామర్థ్యాలను ఈ పుడ్‌ దెబ్బతీస్తోందని తాజా ఆధారాలు వెల్లడిస్తున్నాయి. అయితే యువతలో మానసిక ఆరోగ్యం క్షీణించడానికి దారితీస్తున్న పలు అంశాలను ఈ నివేదిక గుర్తించింది. 

వీటిలో చిన్న వయస్సులోనే స్మార్ట్‌ఫోన్ల వాడకం, బలహీనపడిన కుటుంబ బంధాలు, తగ్గుతున్న ఆధ్యాత్మికత, అల్ట్రా ప్రాసెస్డ్‌ ఆహార వినియోగం ప్రధానమైనవి. వీటన్నింటిలో ఆహారపు అలవాట్లను మార్చుకోగలిగిన, ప్రభుత్వ విధానాల ద్వారా నియంత్రించగలిగే అంశంగా అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ ప్రత్యేకంగా నిలుస్తాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement