'సేవా' కుటుంబం | Service activities with children | Sakshi
Sakshi News home page

'సేవా' కుటుంబం

Feb 6 2026 4:38 AM | Updated on Feb 6 2026 4:53 AM

Service activities with children

 పిల్లలతో కలిసి సేవా కార్యక్రమాలు

కుటుంబ బంధాలకు సూపర్‌ పవర్‌

పేరెంటింగ్‌తో పాటు వాలంటీరింగ్‌

బాలల వ్యక్తిత్వ నిర్మాణానికి పునాది

సామాజిక సేవకూ ఇదే ఆరంభం 

వెల్లడిస్తున్న తాజా అధ్యయనాలు

కుటుంబం అంతా కలిసి పాల్గొనే సేవా కార్యక్రమాలు పిల్లల వ్యక్తిత్వాన్ని చక్కగా రూపుదిద్దటమే కాకుండా, వారిని బాధ్యత గల పౌరులుగా తీర్చి దిద్దుతాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు, ఒక మంచి పని కోసం కుటుంబం అంతా కలిసికట్టుగా శ్రమించటం వల్ల, పిల్లలు పెరిగి పెద్దయ్యాక అవి తీపి జ్ఞాపకాలుగామిగిలిపోతాయని మనోవికాస నిపుణలు చెబుతున్నారు. – సాక్షి, స్పెషల్‌ డెస్క్

ఇతరులకు సహాయం చేయడంలోని గొప్పతనం, ఔన్నత్యం ‘వాలంటీరింగ్‌’ ద్వారా పిల్లలకు అర్థం అవుతుంది. దీనివల్ల వారిలో జాలి, దయ, కరుణ, ఓర్పు, కృతజ్ఞతా భావం వంటి మంచి గుణాలు ఏర్పడతాయి. మనం చేసే చిన్న సాయమైనా ఒకరి జీవితంలో ఎంత పెద్ద మార్పును తీసుకురాగలదో పిల్లలు స్వయంగా తెలుసుకుంటారు.

ఆత్మ విశ్వాసం పెరుగుతుంది
తల్లిదండ్రులు పిల్లల్ని తరచూ సేవా కార్యక్రమాలలో పాలుపంచుకోవటానికి తీసుకెళ్లటం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇతరుల పట్ల ప్రేమతో మెలుగుతారు. నలుగురితో కలిసి పని చేయటం నేర్చుకుంటారు. సమస్యలను ఎదుర్కొనే నైపుణ్యాలను అలవరచుకుంటారు. 

కుటుంబ బంధం బలపడుతుంది
ఇంట్లో అందరూ కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల, రోజూవారీ పనుల ఒత్తిడి లేకుండా కుటుంబ సభ్యులందరూ ఆహ్లాదకరమైన సమయాన్ని గడపవచ్చు. ఫోన్లకు, టీవీలకు లేదా ఇంటి పనులకే పరిమితం అయిపోకుండా.. ఒక మంచి లక్ష్యం కోసం అందరూ కలిసి పనిచేసినట్లవుతుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలను బలపరుస్తుంది.

ఎలాంటి సేవల్ని ఎంచుకోవాలి?
పిల్లల వయసును బట్టి, వారికి ఆసక్తి ఉన్న పనులు ఎంచుకోవడం ముఖ్యం. చిన్న పిల్లలైతే చేతులతో చేసే చిన్న చిన్న పనులను ఇష్టపడతారు, అదే కొంచెం పెద్ద పిల్లలైతే బాధ్యత తీసుకునే పనులను లేదా నాయకత్వం వహించే పనులకు చొరవ చూపుతారు. ఏమైనా, అది వారికి సరదాగా అనిపించాలి. ఆ పని తప్పక చేయాలనే ఉత్సాహం వారిలో కలగాలి. పనుల ఎంపికకు ఇవే గీటురాళ్లు. నెలకు ఒక్కసారి.. కుదరకపోతే రెండునెలలకు ఒక్కసారైనా వాలంటీరింగ్‌ చేసినా చాలు, అది పిల్లల జీవితాల్లో గొప్ప మార్పు తెస్తుంది. 

నివేదికలు..అధ్యయనాలు
‘పాయింట్స్‌ ఆఫ్‌ లైట్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ఏటా ‘ఫ్యామిలీ వాలంటీర్‌ డే’ ని  నిర్వహిస్తుంది. కుటుంబంతో కలిసి సేవ చేయడం వల్ల పిల్లల్లో సహానుభూతి పెరుగుతుందని, సామాజిక బాధ్యత అలవడుతుందని వారి అధ్యయనాలు చెబుతున్నాయి.

యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ సర్వే ప్రకారం, స్వచ్ఛంద సేవల్లో పాల్గొనే పిల్లల్లో ఆందోళన, డిప్రెషన్‌ వంటి సమస్యలు 18 నుంచి 35 శాతం వరకు తక్కువగా ఉంటున్నాయి. 

ఇండియానా యూనివర్సిటీ జరిపిన సర్వేలో టీనేజర్లు, బాలలు సేవా కార్యక్రమాలలో పాల్గొనటం ద్వారా సమాజం తీరును గ్రహిస్తున్నారు. సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకుంటున్నారు. 

చిన్నప్పటి నుండి సేవ చేసే అలవాటు ఉన్న పిల్లలు, పెద్దయ్యాక కూడా సమాజానికి సేవ చేసే అవకాశం 50 శాతం ఎక్కువగా ఉంటుందని ‘కార్పొరేషన్‌ ఫర్‌ నేషనల్‌ అండ్‌ కమ్యూనిటీ సర్వీస్‌’ గణాంకాలు చెబుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement