సాధారణంగా చాలామందికి ‘కాఫీ’తోనే రోజు మొదలవుతుంది. ఈ వేడివేడి పానీయం సమయానికి అందకపోతే విలవిలలాడిపోతుంటారు. అయితే తరచూ ‘కాఫీ’ తాగడంతో వచ్చే సమస్యలపై ఒక వైద్య నిపుణుడు చెప్పిన వివరాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఇవి కాఫీ ప్రియులకు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. మనం కొత్త ఉత్సాహం కోసం కాఫీని తాగుతుంటాం. అయితే ఇది మన మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని బెంగళూరులోని సాక్రా వరల్డ్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఎం రవికుమార్ హెచ్చరించారు. ఆయన ‘హిందుస్తాన్ టైమ్స్’తో మాట్లాడుతూ ‘కాఫీ’తో వచ్చే సైడ్ ఎఫక్ట్స్‌కు సంబంధించిన వివరాలను తెలియజేశారు.
తరచుగా కాఫీ తాగితే, అది మెదడులోని ‘గ్రే మ్యాటర్’ పరిమాణాన్ని తగ్గించే అవకాశం ఉందని, ఫలితంగా ఒత్తిడి నుండి మెదడు కోలుకోవడం కష్టమవుతుందని, అంతేకాకుండా, కెఫీన్ ప్రభావం సుమారు 12 గంటల వరకు ఉండి, గాఢ నిద్రకు ఆటంకం కలిగిస్తుందని డాక్టర్ రవికుమార్ హెచ్చరించారు. ఇటువంటి స్థితిలో మెదడుకు కావాల్సిన విశ్రాంతి దొరకక క్రమంగా ‘బ్రెయిన్ ఫాగ్’ వంటి సమస్యలకు దారితీస్తుందన్నారు.
మనం తీసుకునే ఆహారంలోని కాల్షియం, ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలు శరీరానికి అందకుండా చేయడంలో కాఫీ ‘పోషకాల దొంగ’గా మారుతుందని డాక్టర్ రవికుమార్ పేర్కొన్నారు. కాఫీలోని కెఫీన్, టానిన్లు పేగుల్లో పోషకాల శోషణను అడ్డుకుంటాయని, ఫలితంగా ఎముకల సాంద్రత తగ్గిపోవడం, రక్తహీనత వంటి సమస్యలు తలెత్తుతాయన్నారు. అలాగే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగి, కడుపు లోపలి పొరలు దెబ్బతినే అవకాశం ఉందని, ఇది జీర్ణక్రియపై దీర్ఘకాలికంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన వివరించారు.
అతిగా కాఫీ తాగడం వల్ల శరీరంలో ‘కార్టిసాల్’ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మానసిక ఒత్తిడికే కాకుండా, చర్మ సమస్యలకు కూడా దారితీస్తుంది. ముఖ్యంగా మొటిమలు రావడం, చర్మం తన బిగుతును కోల్పోయి, త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపించడం లాంటివి జరుగుతాయని డాక్టర్ రవికుమార్ తెలిపారు. మహిళల విషయంలో ఇది మరింత ఆందోళనకరంగా మారుతుందని, అధిక కెఫీన్ వినియోగం వల్ల నెలసరి క్రమం తప్పడమే కాకుండా, హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల ఆందోళన, గుండె దడ లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయన్నారు.
సాధారణంగా చాలామంది బరువు తగ్గడానికి కాఫీ సహాయపడుతుందని అనుకుంటారు. కానీ రోజుకు నాలుగు కప్పుల కంటే ఎక్కువ తాగితే అందుకు విరుద్ధమైన ఫలితాలు వస్తాయని డాక్టర్ కుమార్ తెలిపారు. అతిగా కాఫీ తాగడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు చేరడం, జీవక్రియ సంబంధిత సమస్యలు తలెత్తుతాయన్నారు. అంతేకాకుండా నోటిలోని, కడుపులోని మంచి బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతిని ‘లీకీ గట్’ సమస్య వస్తుందన్నారు. ఫలితంగా తిన్న ఆహారం పడకపోవడం, కడుపు ఉబ్బరం లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే కాఫీని పరిమితంగా తీసుకుంటేనే ఆరోగ్యకరమని డాక్టర్ ఎం రవికుమార్ సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ట్రంప్ ‘టారిఫ్’ పిడుగు: మరో దేశంపై ప్రతీకారం?


