వారసత్వంగానే రొమ్ము కేన్సర్‌! | 1 in 4 Indian breast cancer patients carry inherited genetic risk variants: study | Sakshi
Sakshi News home page

వారసత్వంగానే రొమ్ము కేన్సర్‌!

Mar 3 2026 4:42 AM | Updated on Mar 3 2026 4:42 AM

 1 in 4 Indian breast cancer patients carry inherited genetic risk variants: study

పరిశోధనలో పాల్గొన్న బృందం

ప్రతి నలుగురిలో ఒకరు 

ఈ వ్యాధి బారినపడుతున్నారు 

ఐఐటీ మద్రాస్, కార్కినోస్‌ హెల్త్‌కేర్‌ పరిశోధనలో వెల్లడి

సాక్షి,చెన్నై: రొమ్ము కేన్సర్‌ రోగులపై ఐఐటీ మద్రాస్, కార్కినోస్‌ హెల్త్‌కేర్‌ చేపట్టిన అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని రొమ్ము కేన్సర్‌ రోగులలో ప్రతి నలుగురిలో ఒకరికి వారసత్వంగా వచ్చే జన్యు లోపాల వల్లే సంభవిస్తోందని పరిశోధకులు తేల్చారు. ఈ వివరాలను ఐఐటీ మద్రాస్‌ సోమవారం ప్రకటించింది. రొమ్ము కేన్సర్‌కు కారణమయ్యే బీఆర్‌సీఏ 1,2 జన్యువుల కంటే ఎక్కువగా, ఇతర జన్యువులలో లోపాలు ఉన్నట్లు ఈ అధ్యయనం గుర్తించిందని పేర్కొంది. 67% వారసత్వ కేసులు ఈ ప్రామాణిక బీఆర్‌సీఏ జన్యువుల వెలుపలే ఉన్నాయని వెల్లడించింది.

అంతర్జాతీయ డేటా బేస్‌లలో లేని, కేవలం భారతీయ జనాభాలోనే కనిపించే ప్రత్యేక జన్యు వైవిధ్యాలను పరిశోధకులు కనుగొన్నారు. చికిత్సలో వాడే మందులు అందరికీ సురక్షితం కాదని, 3.13% నుంచి 5% మంది రోగులలో ‘డీపీవైడీ’అనే జన్యు వైవిధ్యం వల్ల కీమోథెరపీ తీవ్రమైన విషప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న రోగులలో కేవలం కేన్సర్‌ మాత్రమే కాకుండా ఇతర తీవ్రమైన వంశపారంపర్య సమస్యలు కూడా బయటపడ్డాయన్నారు. ఐఐటీ మద్రాస్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.మహాలింగం పర్యవేక్షణలో జరిగిన ఈ పరిశోధన ఫలితాలు ప్రతిష్టాత్మక బీఎంసీ కేన్సర్‌ జర్నల్‌లో పొందుపరిచినట్లు ఐఐటీ మద్రాస్‌ ప్రకటించింది. ఇది భవిష్యత్తులో భారతీయ రోగులకు వారి జన్యువుల ఆధారంగా మెరుగైన చికిత్స అందించడానికి ఒక బలమైన పునాది కానుందని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement