ఉద్యోగమే కాదు.. వ్యక్తిగత జీవితమూ ముఖ్యమేనంటున్న కొత్త తరం ఉద్యోగులు
అభినందనలు అవసరం లేదు... ఉద్యోగ వృద్ధి ఉంటే చాలంటున్న 81 శాతం
వేతనాల పెంపు మాత్రమే ప్రధానమన్న 21 శాతం మంది
నౌకరీ డాట్ కామ్ అధ్యయనంలో వెల్లడి
జెన్ జెడ్.. ప్రపంచాన్ని ఉర్రూతలూగించడమే కాదు... అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముకగా మారుతున్న సైన్యం... విశ్వ భవిష్యత్తుగా అవతరించిన ఈ జెన్ జెడ్ తమకంటూ నిర్దిష్ట అభిప్రాయాలను ఏర్పరచుకుంది. దేశాల్లో అధికార పీఠాలను మార్చడం నుంచి దిగ్గజ కంపెనీల తలరాతలను మార్చడంలోనూ వీరిది కీలకపాత్ర. కొంగొత్త తరం తమ ఉద్యోగాల విషయంలో వేటికి ప్రాధాన్యమిస్తున్నారు... ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారనే దానిపై ప్రముఖ ఉద్యోగ వివరాల వెబ్‌సైట్ నౌకరీ డాట్ కామ్ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది.
‘ది జెన్ జెడ్ వర్క్ కోడ్ 2026... వాట్ డ్రైవ్స్, ఎంగేజెస్ అండ్ రిటెయిన్స్ దెమ్’అనే పేరుతో నిర్వహించిన ఈ సర్వే వివరాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా వివిధ రంగాల కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న 23 వేల మందికి పైగా ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబైతోపాటు ఇతర నగరాలకు చెందిన ఉద్యోగులున్నారు. – సాక్షి, హైదరాబాద్
ఈ సర్వేలో ఏం వెల్లడైందంటే...
» జాబ్ ఆఫర్ల కోసం వేతనం కాకుండా దేన్ని పరిగణనలోకి తీసుకుంటారని ప్రశ్నించగా, 50 శాతం మంది ఉద్యోగంతోపాటు జీవితం కూడా ప్రధానమని, రెండింటినీ సమతుల్యంగా ముందుకు నడిపే ఉద్యోగాలను ఎంచుకుంటామని చెప్పారు. పనిగంటలతో పాటు వారాంతపు వినోదాలకు కూడా ప్రాధాన్యమిస్తామని చెప్పారు.
కేవలం ఉద్యోగ అభివృద్ధి మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని 31 శాతం చెప్పగా, కంపెనీలో విలువలకు ప్రాధాన్యమిస్తామని 12 శాతం, నాయకత్వ తీరుకు ఓటేస్తామని 7 శాతం అభిప్రాయపడ్డారు. అయితే, 5–8 సంవత్సరాల అనుభవం ఉన్న ఉద్యోగుల్లో 60 శాతం మంది ఉద్యోగంతోపాటు జీవితాన్ని సమపాళ్లలో నడిపించేలా జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు.
» కెరీర్ అభివృద్ధి అంటే ఏంటని ప్రశ్నించగా నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడమేనని 57 శాతం, జీతం పెరగడమని 21 శాతం, పదోన్నతి రావడమని 12 శాతం, ప్రాజెక్టులను లీడ్ చేయడమని 10 శాతం మంది చెప్పారు.
» ఉద్యోగంలో ఎలాంటి గుర్తింపు కావాలని కోరుకుంటారన్న ప్రశ్నకు.. 81 శాతం మంది ఉద్యోగ వృద్ధి అవకాశాలు రావడమే గుర్తింపు అని చెప్పగా, నగదు బహుమతులు గుర్తింపుగా భావిస్తామని 10 శాతం, అభినందనలు గుర్తింపుగా పరిగణిస్తామని 7 శాతం, వ్యక్తిగతంగా అభినందనలు తెలపడాన్ని గుర్తింపు అనుకుంటామని 2 శాతం మంది వెల్లడించారు.
» పని ప్రదేశంలో మీ మానసిక ఆరోగ్యాన్ని ఏ అంశం ప్రభావితం చేస్తోందని ప్రశ్నించగా.. ఉద్యోగం–జీవితం సమతుల్యంగా లేకపోవడం మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని 34 శాతం మంది, ఎలాంటి అభివృద్ధి కనిపించకపోవడం బాధను కలిగిస్తోందని 31 శాతం మంది, చెడు సహచరుల వల్ల ఇబ్బంది పడుతున్నామని 19 శాతం మంది, బాసిజం తట్టుకోలేకపోతున్నామని 16 శాతం మంది చెప్పారు.
» ఒకటే ఉద్యోగంలో ఎన్నాళ్లు ఉంటారని అడిగితే.. ఒక ఉద్యోగం ఒక సంవత్సరం మాత్రమే చేస్తామని 14 శాతం మంది, 2–3 ఏళ్లు ఉంటామని 37 శాతం మంది, 4–5 ఏళ్లు ఉంటామని 13 శాతం, ఐదు కంటే ఎక్కువ సంవత్సరాలుగా ఒకే ఉద్యోగం చేస్తున్నామని 36 శాతం మంది చెప్పారు.
» కెరీర్‌కు సంబంధించిన సలహాలను స్నేహితులు, మార్గదర్శకుల నుంచి తీసుకుంటామని 43 శాతం, నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ల నుంచి తీసుకుంటామని 40 శాతం, పాడ్‌కాస్ట్‌ల ద్వారా తెలుసుకుంటామని 13 శాతం, ఇన్‌స్ట్రాగామ్ అని 4 శాతం చెప్పారు.
» ఈ నివేదికకు ముక్తాయింపుగా... ‘జెన్‌జీ ఆటలు ఆడటం లేదు. వారికి నిజం కావాలి. నిజం తప్ప ఏమీ అవసరం లేదు. ఈజ్ యువర్ కంపెనీ లిజనింగ్?’అని ప్రస్తావించడం గమనార్హం.


