వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో దేశంపై ‘టారిఫ్’ పిడుగు కురిపించారు. దక్షిణ కొరియా నుండి దిగుమతి అయ్యే ఆటోమొబైల్స్, కలప, ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తులపై టారిఫ్‌లను 25 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని అమలు చేయడంలో దక్షిణ కొరియా విఫలమైందని ఆయన ఆరోపించారు. 2025 జూలై 30న అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌తో తాను కుదుర్చుకున్న ఒప్పందాన్ని, అలాగే అక్టోబర్ 29న తన పర్యటనలో తాను చెప్పిన అంశాలను అక్కడి పార్లమెంటు ఇంకా ఎందుకు ఆమోదించలేదని ట్రంప్ ప్రశ్నించారు. దీనికి ప్రతిచర్యగా తాను సుంకాలను 15శాతం నుండి 25 శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్ వెల్లడించారు.
అమెరికాకు వాణిజ్య ఒప్పందాలనేవి అత్యంత ముఖ్యమని, తాము కుదుర్చుకున్న ప్రతి డీల్‌లోనూ ఒప్పందం ప్రకారం సుంకాలను తగ్గించామని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. తమ వాణిజ్య భాగస్వాములు కూడా అదే విధంగా వ్యవహరించాలని ఆశిస్తున్నట్లు ఆయన తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా వాషింగ్టన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తమ ఎగుమతులపై అమెరికా టారిఫ్‌లను తగ్గించేలా నవంబర్ నుండి దక్షిణ కొరియా చర్యలు చేపడుతోంది. మరోవైపు, డేటా లీక్ కారణంగా అమెరికాకు చెందిన ఈ కామర్స్ సంస్థ ‘కూపాంగ్’పై జరుగుతున్న దర్యాప్తు విషయంలో కూడా సియోల్ అధికారులు అమెరికా ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు.
అమెరికాకు దక్షిణ కొరియా కీలక వాణిజ్య భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఏటా సుమారు $150 బిలియన్ల(సుమారు రూ. 12.5 లక్షల కోట్లు) విలువైన వస్తువులు అమెరికాకు ఇక్కడి నుండే దిగుమతి అవుతాయి. గత ఏడాది జూలైలో ఇరు దేశాల అధ్యక్షులు ఒక ఒప్పందానికి వచ్చినప్పటికీ, అమెరికా కోరిన పెట్టుబడి హామీల విషయంలో ఏర్పడిన భేదాభిప్రాయాలతో ఈ ప్రక్రియ స్తంభించింది. అనంతరం అక్టోబర్‌లో ట్రంప్ ఆసియా పర్యటన సందర్భంగా, అమెరికాలో $350 బిలియన్ల(రూ. 35,000 కోట్లు పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాన్ని ఖరారు చేశారు.
ఈ నేపథ్యంలో నవంబర్‌లో వైట్ హౌస్ ఒక ‘ఫ్యాక్ట్ షీట్’ విడుదల చేస్తూ, దిగుమతి సుంకాలను 15 శాతానికి పరిమితం చేసింది. అయితే అమెరికా ప్రస్తుత నిర్ణయంతో ఆ సుంకాలు తిరిగి పాత స్థాయికి చేరుకోనున్నాయి. 2025 ఏప్రిల్‌లో దక్షిణ కొరియా ‘లిబరేషన్ డే’ సందర్భంగా మొదట 25 శాతం టారిఫ్ ప్రకటించగా, అది మార్కెట్లను కుదిపేసింది. అప్పట్లో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా, ఇప్పుడు మళ్లీ అమలులోకి తెచ్చారు. గతంలో కెనడాపై 10 శాతం, గ్రీన్‌లాండ్ విషయంలో యూరప్ దేశాలపై, ఇటీవల కెనడాపై 100 శాతం టారిఫ్ విధిస్తామన్న ట్రంప్ హెచ్చరికల తర్వాత ఈ తాజా ప్రకటన వెలువడటం గమనార్హం.
ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన పని ఒత్తిడి.. టెక్కీ దుస్థితి వైరల్


