రాష్ట్రపతిని కించపర్చారు  | PM Narendra Modi accuses Congress of disrespecting President | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతిని కించపర్చారు 

Feb 6 2026 2:12 AM | Updated on Feb 6 2026 2:12 AM

PM Narendra Modi accuses Congress of disrespecting President

ఎన్నికల్లో వరుస పరాజయాలను జీర్ణించుకోలేకపోతున్నారు  

పేద బిడ్డ ఉన్నతస్థాయికి చేరుకోవడం సహించలేకపోతున్నారు  

లోక్‌సభలో చర్చకు అడ్డంకులు సృష్టించడం బాధాకరం  

నిరుపేద గిరిజన మహిళను, రాజ్యాంగాన్ని అవమానించారు  

బిట్టూను దూషించడం దారుణం  

నేడు డీల్స్‌ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నాం 

ప్రజా సంక్షేమం మరిచి సొంత జేబులు నింపుకున్నారు  

నన్ను సమాధి చేయడం మీ తరంకాదు 

రాజ్యసభలో ప్రతిపక్షంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం  

న్యూఢిల్లీ:  కాంగ్రెస్‌ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో వరుస పరాజయాలను ఆ పార్టీ జీరి్ణంచుకోలేకపోతోందని అన్నారు. తనపై ఎంత విద్వేషం గుమ్మరించినా తనను సమాధి చేయడం కాంగ్రెస్‌ పార్టీ తరం కాదని తేలి్చచెప్పారు. గురువారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ సమాధానమిచ్చారు. దాదాపు 100 నిమిషాలపాటు సుదీర్ఘంగా మాట్లాడారు. పలు అంశాలను ప్రస్తావించారు. 

లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు కాంగ్రెస్‌ అడ్డంకులు సృష్టించడం పట్ల విచారం వ్యక్తంచేశారు. అత్యున్నత రాష్ట్రపతి పదవిలో ఉన్న పేద గిరిజన మహిళను, రాజ్యాంగబద్ధమైన పదవిని, భారత రాజ్యాంగాన్ని ఆ పార్టీ కించపర్చిందని మండిపడ్డారు. దళితులను, గిరిజనులను, ఈశాన్య రాష్ట్రాల ప్రజలను కూడా కించపర్చిందని ఆక్షేపించారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్ర మంత్రి రవనీత్‌సింగ్‌ బిట్టూను ద్రోహి అని నిందించడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. 

పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ చొరబాటుదార్లను నిస్సిగ్గుగా కాపాడుతోందని మండిపడ్డారు. ‘ప్రేమ దుకాణం’ అంటూ కల్ల»ొల్లి కబుర్లు చెప్పే కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు మోదీ.. తేరీ ఖబర్‌ ఖుదేగీ(మోదీ.. నీ సమాధి తవ్వుతాం) అంటూ నినాదాలు చేస్తోందని ధ్వజమెత్తారు. అది వారి తరం కాదని అన్నారు. పేద కుటుంబంలో జని్మంచిన తాను ఉన్నత స్థానానికి చేరుకోవడం, ఈ పదవి ఇంకా కొనసాగుతుండడం చూసి కాంగ్రెస్‌ తట్టుకోలేకపోతోందని, అందుకే నిత్యం తనను దూషిస్తోందని విమర్శించారు. ప్రధానమంత్రి పదవిని వారి కుటుంబ హక్కుగా భావిస్తున్నారని సోనియా గాంధీ కుటుంబంపై మండిపడ్డారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే...  

ప్రతిపక్షాల వల్లే లోక్‌సభకు వెళ్లలేకపోయా..  
‘‘దేశంలో కోట్లాది మంది తల్లులు, సోదరీమణులు, పేదల ఆశీస్సులు నాకున్నాయి. వారి సంక్షేమం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నా. ప్రజల అండదండలున్న నన్ను ఏమీ చేయలేరు. కాంగ్రెస్‌ పార్టీ దేశ ప్రజలను ఒక సమస్యగా పరిగణిస్తోంది. కానీ, మేము ప్రజలను ఒక బలంగా, సవాళ్లకు పరిష్కారంగా భావిస్తున్నాం. బుధవారం లోక్‌సభలో జరిగిన పరిణామాలు నిజంగా బాధాకరం. ప్రతిపక్షాలు అలజడి సృష్టించడం వల్లనే సభకు వెళ్లలేకపోయా. ప్రజాస్వామ్య దేవాలయంలో ఇష్టానుసారంగా ప్రవర్తించారు. సభాపతి స్థానంలో ఉన్న అస్సాం ఎంపీపై, ఆంధ్రప్రదేశ్‌ దళిత ఎంపీపై పేపర్లు విసిరేశారు. అస్సాం ప్రజలను.. మొత్తం ఈశాన్య రాష్ట్రాల ప్రజలను అవమానించారు. దళితులను అవమానించారు. కాంగ్రెస్‌ వల్ల అస్సాం గాయకుడు భూపేన్‌ హజారికా ఎన్నో అవమానాలకు గురయ్యారు.    

సదానందన్‌ మాస్టర్‌ను అవమానించారు  
బీజేపీ నేత, కేంద్ర మంత్రి బిట్టూను కాంగ్రెస్‌ నాయకుడొకరు(రాహుల్‌ గాం«దీ) బుధవారం ద్రోహి అంటూ దూషించారు. ఆ పార్టీకి సిక్కులంటే ద్వేషం. కాంగ్రెస్‌ నుంచి ఎన్నో గ్రూప్‌లు విడిపోయాయి. ఎంతోమంది ఆ పార్టీ నుంచి వెళ్లిపోయారు. బిట్టూ సిక్కు కాబట్టి ద్రోహి అని నిందించారు. ఇది సిక్కులకు, గురువులకు జరిగిన అవమానం. సిక్కుల పట్ల విద్వేషాన్ని కాంగ్రెస్‌ మరోసారి బయటపెట్టుకుంది. నిన్న రాజ్యసభలో స్వతంత్ర సభ్యుడు సదానందన్‌ మాస్టర్‌ తన కృత్రిమ కాలును ప్రదర్శిస్తే ప్రతిపక్ష ఎంపీలు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇంతకంటే దారుణం ఉంటుందా? ఆయన గొప్ప విలువలున్న వ్యక్తి. రాజకీయ గొడవల వల్ల మూడు దశాబ్దాల క్రితం కాలు పోగొట్టుకున్నారు. ఆయనను అవమానించడం మొత్తం దేశానికి బాధ కలిగించింది. అందుకు విపక్ష ఇండియా కూటమి బాధ్యత వహించాలి.  

ఓట్ల కోసం చొరబాటుదార్లను రక్షిస్తున్నారు  
‘‘పశ్చిమ బెంగాల్‌లో దయలేని ప్రభుత్వం అధికారం చెలాయిస్తోంది. పతనం కావడంతో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోంది. ఓట్ల కోసం చొరబాటుదార్లను కాపాడుతోంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి. అధికారం కోసం దేశాన్ని నాశనం చేయొద్దు. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం చొరబాటుదార్లను సహించవు. వారిని బయటకు వెళ్లగొడతాయి. మనదేశంలో మాత్రం చొరబాటుదార్లను రక్షించే పరిస్థితులున్నాయి. అందుకోసం కోర్టులపైనా ఒత్తిడి తెస్తున్నారు. 

మన యువత హక్కులను లాక్కొని, గిరిజనుల భూములను కబ్జా చేస్తున్నవారిని కాపాడడం ఏమిటి? మన ఆడబిడ్డలు, కుమారుల జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నవారిని రక్షించడం తగదు. కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్, డీఎంకే, వామపక్షాలు దశాబ్దాలపాటు అధికారం అనుభవించాయి. అధికారంలో ఉన్నప్పుడు సొంత లాభం చూసుకోవడం తప్ప ప్రజల బాగు కోసం చేసిందేమీ లేదు. నేడు మనం డీల్స్‌ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నాం. గతంలో డీల్‌ అంటే బోఫోర్స్‌ డీల్‌ మాత్రమే. ప్రజల జీవితాలను మార్చడం వారికి ముఖ్యం కాదు. సొంత జేబులు నింపుకోవడమే ముఖ్యం’’ అని మోదీ ధ్వజమెత్తారు. 
.
నాణ్యమైన వస్తువులు ఉత్పత్తి చేయాలి  
‘‘అన్ని రంగాల్లో నూతన స్ఫూర్తి, శక్తితో వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని చేరుకోవాలి. ఇందులో భాగంగా నాణ్యమైన వస్తువుల ఉత్పత్తిపై మనం దృష్టి పెట్టాలి. ఇందుకు ప్రజలు సహకరించాలి. నాణ్యత విషయంలో రాజీపడొద్దు. ‘మేడ్‌ ఇన్‌ ఇండియా, మేడ్‌ ఇన్‌ భారత్‌’ ప్రపంచమంతటా వినిపించాలి. మన నాణ్యమైన ఉత్పత్తులు అన్ని చోట్లకూ వెళ్లాలి. అంతరిక్షం, సైన్స్, టెక్నాలజీ, గ్రీన్‌ హైడ్రోజన్, ఏఐ, అరుదైన ఖనిజాల రంగాల్లో ముందడుగు వేస్తున్నాం. సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌ పరుగులు తీస్తోంది. గతంలో నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు సంస్కరణల వల్ల లాభాల్లోకి వస్తున్నాయి. బ్యాంకింగ్‌ రంగంలోనూ సంస్కరణలు చేపట్టాం. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ చేసిన నిర్వాకాలకు ఇప్పుడు ఆ పార్టీ సమాధానం చెప్పాలి. కాంగ్రెస్‌ ప్రభుత్వాల తప్పులను సరిచేయడానికి మా శక్తిని ఖర్చు పెడుతున్నాం’’ అని ప్రధాని మోదీ వివరించారు.    

రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్‌
రాజ్యసభలో ప్రధానమంత్రి ప్రసంగం ప్రారంభించడానికి తన స్థానం నుంచి లేవగానే విపక్ష సభ్యులు బిగ్గరగా నినాదాలు చేశారు. విపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని చైర్మన్‌ సి.పి.రాధాకృష్ణన్‌ను కోరారు. అందుకు ఆయన నిరాకరించారు. దాంతో మోదీ ప్రసంగం ప్రారంభించారు. దాంతో ప్రతిపక్ష ఎంపీలు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలతో హోరెత్తించారు. నిరసన వ్యక్తంచేశారు. లోక్‌సభలో రాహుల్‌ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అవమానాలు సహించబోమని అన్నారు. కూర్చొని నినాదాలు ఇవ్వొచ్చంటూ ఖర్గేకు ప్రధాని మోదీ సూచించారు. కొద్ది సేపటి తర్వాత ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. మోదీ ప్రసంగం కొనసాగింది. విపక్ష సభ్యులు బయటకు వచ్చి మకరద్వారం వద్ద నినాదాలు చేశారు. ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోశారు.    

ఆ ఒప్పందాలతో ప్రపంచంలో గొప్ప విశ్వాసం  
‘‘యూరోపియన్‌ యూనియన్‌తో కుదిరిన చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం తర్వాత అమెరికాతో ఒప్పందానికి వచ్చాం. ఇవి ఫ్యూచర్‌ రెడీ ఒప్పందాలు. ప్రపంచంలో గొప్ప విశ్వాసం నింపాయి. ప్రపంచ స్థిరత్వానికి ఈ ఒప్పందాలు తోడ్పడుతాయి. గత కొన్నేళ్లలో తొమ్మిది పెద్ద దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాం. ఇది ఈయూతో కుదిరిన ఒప్పందం ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ డీల్స్‌’. మనం ఇక వెనక్కి చూడాల్సిన అవసరం గానీ, పరుగు ఆపాల్సిన అవసరం గానీ లేదు. ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్య సాధన దిశగా వేగంగా దూసుకెళ్తున్నాం. కోవిడ్‌–19 మహమ్మారి వ్యాప్తి సమయంలో ప్రపంచమంతటా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత నూతన ప్రపంచ క్రమం ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇలాంటి పరిస్థితే కనిపించింది. ఇప్పుడు భారత్‌ పట్ల ప్రపంచదేశాల్లో గొప్ప విశ్వాసం వ్యక్తమవుతోంది. ఎన్నో దేశాలకు మన దేశం విశ్వసనీయ భాగస్వామిగా మారింది. భారతదేశ ఉజ్వల భవిష్యత్తులో పాలుపంచుకోవాలని ఇతర దేశాలు కోరుకుంటున్నాయి. అందుకే మనతో ఒప్పందాలకు ముందుకొస్తున్నాయి. దక్షిణార్ధ గోళ దేశాలకు(గ్లోబల్‌ సౌత్‌) నేడు మనమే బలమైన గొంతుకగా మారాం’’ అని మోదీ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement