ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించేవరకూ పోరాటం | Congress takes out march to condemn Union government for diluting MGNREGA | Sakshi
Sakshi News home page

ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించేవరకూ పోరాటం

Feb 6 2026 1:06 AM | Updated on Feb 6 2026 1:06 AM

Congress takes out march to condemn Union government for diluting MGNREGA

చెన్నై సభలో మాట్లాడుతున్న భట్టి విక్రమార్క

చెన్నై సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సాక్షి, హైదరాబాద్‌: మహాత్మాగాంధీ ఏం పాపం చేశారని ఉపాధి హామీ పథకం నుంచి ఆయన పేరును తొలగించారని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. గతంలో ప్రతి వ్యవసాయ సీజన్లో 50 పైసల కూలీ ధరల పెరుగుదల కోసం దేశవ్యాప్తంగా ఎన్నో ఆందోళనలు, వారిపై పోలీసు లాఠీచార్జీలు, రక్తపాతం జరిగేవని గుర్తుచేశారు.

ఈ దారుణమైన పరిస్థితులను పారదోలేందుకు మానవీయకోణంతో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆధ్వర్యంలో.. దేశంలోని కోట్లాదిమంది వ్యవసాయ కార్మికుల కోసం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చారని తెలిపారు. కూలీలకు 100 రోజుల పాటు పనికి గ్యారంటీ కల్పిస్తూ, ఉపాధి అనేది వ్యవసాయ కార్మికుల హక్కు అనే భావనతో ఈ పథకాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. ఈ పథకం దేశంలోని కోట్లాది వ్యవసాయ కార్మికుల జీవితాల్లో ఒక నిశ్శబ్ద విప్లవం అని పేర్కొన్నారు. గురువారం చెన్నైలో ఉపాధి హామీ పథకంలో మార్పులు, గాంధీ పేరు తొలగింపును నిరసిస్తూ తమిళనాడు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్ర అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో భట్టి ప్రసంగించారు.

పథకంలోని ఆత్మనూ తొలగించారు..
‘దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీ తన న్యాయవాద వృత్తిని వదిలి దేశానికి వచ్చారు. అధికారం కోసమో, ఇతర వ్యక్తిగత ప్రయోజనాల కోసమో ఆయన రాలేదు. తన సహచరులతో కలిసి గొప్ప స్వాతంత్య్ర పోరాటం నిర్వహించాలనే పట్టుదలతో దక్షిణాఫ్రికా నుంచి వచ్చారు. అలాంటి వ్యక్తి పేరిట తీసుకొచ్చిన పథకాన్ని నిర్వీర్యం చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. కోట్లాది వ్యవసాయ కార్మికులు ఏం తప్పు చేశారని పథకంలో మార్పులు చేశారు?..’ అని భట్టి ప్రశ్నించారు. ‘కాంగ్రెస్‌ అగ్రనేతలు ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ వ్యవసాయ కూలీల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతోంది. మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టం–2005ను కేంద్ర ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించే వరకు కాంగ్రెస్‌ శ్రేణులు పోరాటం కొనసాగిస్తాయి’ అని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement