చరిత్రలో ఆయన బూతుల సీఎంగా మిగిలిపోతారు
కేసీఆర్‌ను చూసి ఓర్వలేక విషం కక్కుతున్నారు
కుర్చీని కాపాడుకునేందుకు బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నారు
మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భాష సభ్య సమాజం అసహ్యించుకునేలా, తెలంగాణ ప్రతిష్టను దిగజార్చేలా ఉంది. ఆయన ప్రవర్తన తెలంగాణ సంస్కృతికే మాయని మచ్చ. దీనిపై మేధావులు, బుద్ధిజీవులు మౌనం వహించడం రాష్ట్రానికి ప్రమాదకరం. చరిత్రలో రేవంత్‌రెడ్డి బూతుల సీఎం గానే మిగిలిపోతారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన జాతిపిత కేసీఆర్‌ను చూసి ఓర్వలేక రేవంత్ విషం కక్కుతున్నారు’ అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తన రెండున్నరేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేక, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ వికృత భాషను ఆశ్రయిస్తున్నారని ధ్వజమెత్తారు.
అమెరికా పర్యటన తర్వాత రేవంత్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే చాలా ఆవేదన కలుగుతోందని చెప్పారు. తెలంగాణ సాధించిన వ్యక్తిగా, ప్రజల ఆకాంక్షను నిజం చేసిన జాతిపితగా తెలంగాణ సమాజం కేసీఆర్‌ను పిలుచుకుంటోందని, దీన్ని చూసి రేవంత్‌రెడ్డికి ఎందుకంత కడుపునొప్పి అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘ప్రతి ముఖ్యమంత్రికి ఆ రాష్ట్ర చరిత్రలో ఒక పేజీ ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ చరిత్రలో బూతుల ముఖ్యమంత్రిగా నిలిచిపోతాడు. కేసీఆర్ త్యాగాన్ని, కృషిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం మాత్రమే రేవంత్‌రెడ్డి చేస్తున్నాడు’ అని మండిపడ్డారు.
నెలకో స్కామ్ కేలండర్ ఇచ్చారు
జాబ్ కేలండర్ ఇస్తానని నిరుద్యోగులను మోసం చేసిన రేవంత్.. నెలకో కుంభకోణంతో స్కామ్ కేలండర్ అమ లు చేస్తున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ‘జనవరిలో పౌర సరఫరాల స్కామ్, ఫిబ్రవరిలో ఎన్టీపీసీ ఫ్లైయాష్ స్కామ్, మార్చిలో శాండ్ స్కామ్, ఏప్రిల్‌లో ఆర్టీసీ స్కామ్, మేలో బామ్మర్దికిచ్చిన అమృత్ టెండర్ల స్కామ్, జూన్‌లో ఫోర్త్ సిటీ స్కామ్, జూలైలో లగచర్ల, హెచ్‌సీయూల్యాండ్ స్కామ్, ఆగస్టులో పీజీ మెడికల్ సీట్ల స్కామ్, సెప్టెంబర్‌లో హిల్ట్‌పి ఇండస్ట్రియల్ స్కామ్, అక్టోబర్‌లో పవర్ స్కామ్, నవంబర్‌లో సింగరేణి స్కామ్, డిసెంబర్‌లో కేఎల్‌ఎస్‌ఆర్ స్కామ్ చేశారు’ అని ఆరోపించారు.
మిర్యాలగూడ సభలోనూ రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు. తన కుర్చీని కాపాడుకునేందుకు బీజేపీతో చీకటి ఒప్పందం చేసు కున్నారని ఆరోపించారు. ‘బీజేపీ జాతీయనేతలు వచ్చి ఆర్‌ఆర్ ట్యాక్స్ అని అవినీతి గురించి మాట్లాడతారు తప్ప, ఎలాంటి విచారణ చేయరు. పొంగులేటి ఇంటిపై, భట్టి విక్రమార్క ఇంటిపై ఐటీ, ఈడీ దాడులు జరిగితే ఆ వివరాలు ఎందుకు బయటకు రావడం లేదు? ఇది కాంగ్రెస్–బీజేపీ చీకటి ఒప్పందానికి నిదర్శనం కాదా?’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.


