ముగ్గురు ఎమ్మెల్యేలపై కుకీల సామాజిక బహిష్కరణ | Social Boycott of Kuki Zo MLAs | Sakshi
Sakshi News home page

ముగ్గురు ఎమ్మెల్యేలపై కుకీల సామాజిక బహిష్కరణ

Feb 6 2026 1:47 AM | Updated on Feb 6 2026 1:47 AM

Social Boycott of Kuki Zo MLAs

ఇంఫాల్‌: మణిపూర్‌లోని ప్రభుత్వంలో చేరిన ముగ్గురు కుకీ శాసనసభ్యుల సామాజిక బహిష్కరణకు కుకీ–జో కౌన్సిల్‌(కేజెడ్‌సీ) పిలుపునిచ్చింది. ఆ ముగ్గురూ శత్రువర్గమైన మైతేయీలతో చేతులు కలపడంతోపాటు సొంత వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించింది. ఇందుకు నిరసనగా ప్రధానంగా కుకీ–జోలుండే చురాచాంద్‌పూర్‌ జిల్లాలో శుక్రవారం పూర్తిబంద్‌కు పిలుపునిచ్చింది. మణిపూర్‌లోని ప్రధానమైన కుకీ–జో, మైతేయి వర్గాల మధ్య 2023 మే నుంచి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటుండటం తెల్సిందే. 

దీంతో, గతేడాది ఫిబ్రవరిలో సీఎం బీరేన్‌ సింగ్‌ రాజీనామా చేయగా కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. బుధవారం కుకీ వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే యుమ్నామ్‌ ఖెమ్‌చంద్‌ సింగ్‌ సీఎంగా ప్రమాణం చేయడం తెల్సిందే. 

కుకీ వర్గానికే చెందిన మరో బీజేపీ ఎమ్మెల్యే నెమ్చా కిప్‌జెన్, నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ ఎమ్మెల్యే డిఖోలు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. మణిపూర్‌ అసెంబ్లీలోని మొత్తం 10 మంది కుకీ ఎమ్మెల్యేల్లో ఏడుగురు బీజేపీకి చెందిన వారే. హమార్‌ గిరిజన తెగకు చెందిన ఎమ్మెల్యే సనటే, కుకీ–జో ఎమ్మెల్యే ఖౌటెలు ప్రభుత్వంలో తమను కూడా భాగస్వాములుగా గుర్తించాలంటూ గవర్నర్‌ ఏకే భల్లాకు వినతిపత్రం అందజేశారు. హమార్‌ తెగ కూడా కుకీ–జో వర్గం కిందికే వస్తుంది. ఈ నేపథ్యంలోనే కేజెడ్‌సీ వీరి సామాజిక బహిష్కరణకు పిలుపునివ్వడం గమనార్హం.  

Advertisement
 
Advertisement
Advertisement