నాన్‌వెజ్‌ వెరైటీలకు యువత ఫిదా, వైద్యుల హెచ్చరిక | Youth addicted to nonveg varieties doctors warning | Sakshi
Sakshi News home page

నాన్‌వెజ్‌ వెరైటీలకు యువత ఫిదా, వైద్యుల హెచ్చరిక

Feb 24 2026 12:09 PM | Updated on Feb 24 2026 12:23 PM

Youth addicted to nonveg varieties doctors warning

క్రేజీ.. బిర్యానీ లకు యువత ఫిదాఅనారోగ్యమేనంటున్న వైద్యులు  

చిన్న వయస్సులోనే ఊబకాయులుగా మారుతున్న వైనం 

క్రమేణా సంప్రదాయ వంటలు,   ఆర్గానిక్‌ ఫుడ్‌పై చూపు  

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఒకప్పుడు పిజ్జాలు, బర్గర్‌లు తినే నగర యువత, చిన్నారులు నేడు బిర్యానీలపై మనసు పారేస్తుంటున్నారు. తరచూ నాన్‌వెజ్‌ వంటకాలను లాగించేస్తున్నారు. దీంతో బిర్యానీ పాయింట్‌లకు క్రేజ్‌ నెలకొంది. ఆయిల్‌ ఫుడ్, కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉండటంతో ఊబకాయులుగా మారి, ఆనారోగ్యం పాలవుతున్నారు. మరోవైపు మధ్య వయస్సుతో పాటు, వృద్ధులు సాంప్రదాయ, ఆర్గానిక్‌ ఆహారంపై దృష్టి పెడుతున్నారు. దీంతో నగరంలో ఆర్గానిక్‌ స్టాల్స్‌ వెలుస్తున్నాయి. 

జోరుగా వ్యాపారం.. 
నగరంలో బిర్యానీల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎక్కడ చూసినా బిర్యానీ పాయింట్స్‌ వెలుస్తున్నాయి. రోడ్డుపైనే మొబైల్‌ బిర్యానీ స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈట్‌ స్ట్రీట్‌ నుంచి కార్పొరేట్‌ హోటల్స్‌ వరకూ బిర్యానీలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రస్తుతం బిర్యానీల ట్రెండ్‌ నడుస్తోంది. అంతేకాదు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా జుమాటో, స్విగ్గీ వంటి సర్వీసుల ద్వారా ఇంటి వద్దకే బిర్యానీలు వచ్చేస్తున్నాయి. ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్న వారిలో 90 శాతం నాన్‌ వెజ్‌ వంటకాలే ఉంటున్నాయి. మరో వైపు ఇళ్లలో సైతం నూడిల్స్, బర్గర్స్‌ వంటివే తయారు చేసుకుని లాగించేస్తున్నారు. యువత, చిన్నారులు ఎక్కువగా వాటిపై మక్కువ చూపుతున్నారు. 

రకరకాల బిర్యానీలు.. 
యువతను ఆకట్టుకునేందుకు రకరకాల బిర్యానీలు అందుబాటులోకి తెస్తున్నారు. పాలకొల్లు కుండ బిర్యానీ, రాయలసీమ రొయ్యల బిర్యానీ, అరేబియన్‌ మండీ బిర్యానీ, గ్రిల్స్‌ చికెన్, తండూరీ, నెల్లూరు రొయ్యలు బిర్యానీ అంటూ ఇలా రకరకాల బిర్యానీలు ఘుమఘుమలాడే సువాసనలతో నోరూరించే రుచులను అందిస్తుండటంతో నగర ప్రజలు మనసుపారేసుకుంటున్నారు. వారంలో మూడు నాలుగు రోజులు బిర్యానీలను లాగించేస్తున్నారు. బిర్యానీలు అధికంగా లాగించే వారిలో 90 శాతం మందికి ఫ్యాటీ లివర్‌ వంటి సమస్యలు వస్తున్నాయి.  

ఫ్యాషన్‌గా మారిన ఈట్‌స్ట్రీట్‌.. 
ఒకప్పుడు రోడ్డుపై తినుబండారాలు తినేందుకు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. ఇప్పుడు రోడ్డు పక్కన ఉన్న బండి వద్ద తినడం ఫ్యాషన్‌గా మారింది. అంతేకాదు ఈట్‌స్ట్రీట్‌కు వస్తున్న వారిలో ఎగువ మధ్య తరగతి, ఉన్నత వర్గాల వారే ఎక్కువగా ఉంటున్నారు. రాత్రి వేళల్లో కుటుంబ సమేతంగా వచ్చి ఈట్‌స్ట్రీట్‌లోని బండి వద్ద బిర్యానీలు తీసుకుని రోడ్డుపై తినేస్తున్నారు. వీకెండ్స్‌లో అయితే రద్దీ మరింతగా ఉండటంతో బిర్యానీలు హాట్‌కేక్‌ల్లా అయిపోతున్నాయి.  

ఇదీ చదవండి: ఒక్క చిట్కాతో సిజేరియన్‌ తరువాత 15 కిలోలు తగ్గిన డాక్టర్‌

ఆర్గానిక్‌ ఫుడ్స్‌ వైపు చూపు.. 
నగరంలో క్రమేణా ఆహార పద్ధతుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నారు. వయస్సు 45 ఏళ్ల దాటిన వారు పాతతరం ఆహార పద్ధతులను మళ్లీ అలవాటు చేసుకుంటున్నారు. అలాంటి వారి కోసం నగరంలో స్టాల్స్‌ వెలుస్తున్నాయి. ఆర్గానిక్స్‌ ఉత్పత్తుల వాడకం కూడా పెరిగింది. ఆర్గానిక్‌ కూరగాయలు, చిరుధాన్యాలను ఇటీవల కాలంలో ఎక్కువగా ఆ వయస్సు వారు వాడుతున్నారు. అంతేకాదు నగరంలో చద్దన్నం స్టాల్స్‌ కూడా వెలుస్తున్నాయి.  

అనారోగ్యం అంటున్న వైద్యులు.. 
బిర్యానీలు ఎక్కువగా తినడం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. వారంలో ఒక రోజు తింటే పర్వాలేదని, మూడు, నాలుగు రోజులు తింటున్న వారి సంఖ్య ఎక్కువ అవుతున్నట్లు చెబుతున్నారు. అలాంటి వారు ఒబెసిటీతో పాటు ఫ్యాటీ లివర్, మధుమేహం, రక్తపోటు, స్ట్రెస్, యాంగ్లై్జటీ, డిప్రెషన్‌ వంటి వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. పిల్లలు చిన్నతనంలో ఊబకాయులుగా మారితే పెనుప్రమాదమని సూచిస్తున్నారు. 

నాన్‌వెజ్‌ ఎక్కువగా  తినకూడదు.. 
మనం తీసుకునే ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలి. బిర్యానీలు, నాన్‌వెజ్‌ వంటకాలు ఎక్కువగా తినడం మంచిది కాదు. వాటిలో కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉండటం వలన ఫ్యాటీ లివర్, జీర్ణకోశ వ్యాధులు వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో చెడు కొల్రస్టాల్‌ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎక్కువ మంది చిరుధాన్యాలపై ఆసక్తి చూపుతున్నారు. వాటిలో కూడా పిండి పదార్ధాలు అధికంగా ఉంటాయి. కాబట్టి పరిమితంగానే వాటిని తీసుకోవాలి. తాజా పళ్లు, కూరగాయలు, సీజనల్‌ ఫ్రూట్స్, పాలు, కోడిగుడ్డు వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఇంట్లో తయారు చేసిన ఆహారం తీసుకుంటే మంచిది. మధుమేహం ఉన్న వారు. ప్రీ డయాబెటీస్‌ స్టేజ్‌లో ఉన్న వారు. ఆహార నియమాల విషయంలో మరింత జాగ్రత్త వహించాలి.   – డాక్టర్‌ కె.వేణుగోపాలరెడ్డి,  మధుమేహ నిపుణుడు

Advertisement
 
Advertisement
Advertisement