ఆ రూ.లక్ష గిఫ్ట్‌ కూపన్లు నాకొద్దు  | PDF MLC Borra Gopimurthy Returns ₹1 Lakh Gift Coupons, Alleges Misuse Of Public Funds By Coalition Government In Amaravati | Sakshi
Sakshi News home page

ఆ రూ.లక్ష గిఫ్ట్‌ కూపన్లు నాకొద్దు 

Feb 24 2026 11:08 AM | Updated on Feb 24 2026 11:15 AM

PDF MLC Gopi Murthy Fire On TDP Govt

 ప్రజాధనాన్ని కూటమి  ప్రభుత్వం వృథా చేస్తోంది 

మండలిలో మా హక్కులను కాలరాస్తున్నారు.. అందుకే తిరిగిచ్చేస్తున్నా.. 

పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి 

సాక్షి, అమరావతి: ప్రజాధనాన్ని వృథా చేస్తున్న కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీలకు రూ.లక్ష విలువ చేసే గిఫ్ట్‌ కూపన్లు ఇచ్చిందని, అందుకే తాను ఆ కూపన్లను తిరిగి పంపుతున్నానని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఏసీ టైం టేబుల్‌ ప్రకారం శాసనమండలిలో ఐదు రోజుల పాటు బడ్జెట్‌పై చర్చ జరగాల్సింది పోయి ఇతర అంశాల వైపు దారి మళ్లిస్తున్నారని ఆయన అన్నారు.

 అసెంబ్లీలో విపక్షం లేనందున, అధికార పార్టీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, వాళ్లే జబ్బలు చరుచుకుంటున్నారనని ఆయన ఎద్దేవా చేశారు. అయితే మండలిలో విపక్షాలు ఉన్నాయి.. కనీసం ఇక్కడైనా చర్చించాల్సింది పోయి, తమ లాంటి స్వతంత్ర ఎమ్మెల్సీల హక్కులను కాలరాస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, శ్రామికులు, అంగన్‌వాడీలు, కేజీబీవీ సిబ్బంది, రైతుల సమస్యలపై అసలు చర్చించడం లేదని ఆరోపించారు. 

ఎలాంటి చర్చలు జరగని మండలిలో ఎమ్మెల్సీగా ఉన్న తనకు ఇచ్చిన రూ.లక్ష విలువైన గిఫ్ట్‌ కూపన్లను తిరస్కరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఏడాది పాటు టాటా సంస్థకు చెందిన ‘క్రోమా’ షో రూమ్‌లో రూ.లక్ష విలువైన వస్తువులు కొనుగోలు చేసుకోమంటూ కూపన్లు ఇవ్వడం ద్వారా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నట్లుగా భావించి ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. శాసన మండలి జాయింట్‌ సెక్రటరీ విజయరాజుకు సోమవారం కూపన్లు తిరిగి ఇచ్చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement