సీఎంఓలో ఒకరిద్దరు అధికారులే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు
మనది నియంతృత్వ దేశం కాదు
ఎలా పడితే అలా, ఏది పడితే అది చేయడానికి వీల్లేదు
వర్సిటీల్లో బోధనా సిబ్బంది రిటైర్మెంట్ వయసు పెంపుపై వివక్ష సరికాదు
ఉన్నత విద్యాశాఖ– వ్యవసాయ శాఖ వర్సిటీల మధ్య వ్యత్యాసం తగదు
ఇది రాజ్యాంగ విరుద్ధం
రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యాశాఖ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తూ యూజీసీ స్కేల్ పొందుతున్న బోధనా సిబ్బంది పదవీ విరమణ వయసును 62 నుంచి 65కి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బంది పదవీ విరమణ వయసు 65కి పెంచకపోవడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వ చర్యలు వివక్షాపూరితమని స్పష్టం చేసింది.
ప్రభుత్వంలో ఎక్కడో ఏదో తేడా ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించిన హైకోర్టు, ముఖ్యమంత్రి కార్యాలయంలో (సీఎంఓ) కూర్చొని ఒకరిద్దరు అధికారులే అన్నీ నిర్ణయాలు తీసేసుకుంటున్నారని సూచించింది. మనది ప్రజాస్వామ్య దేశమే తప్ప, నియంతృత్వ దేశం కాదని, ఈ విషయాన్ని అధికారులందరూ గుర్తు పెట్టుకోవాలని స్పష్టం చేసింది. ఎలా పడితే అలా, ఏది పడితే అది చేయడానికి వీల్లేదంది. ఈ అంశంపై దాఖలైన అప్పీళ్లపై న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ సుబేంధు శమం ధర్మాసనం సోమవారం కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
బోధనా సిబ్బంది కొనసాగింపునకు ఆదేశాలు..
వ్యవసాయ శాఖ పరిధిలోని ఉద్యానవన, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య విశ్వవిద్యాలయాల్లో యూజీసీ స్కేల్ పొందుతున్న బోధనా సిబ్బందిని తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు కొనసాగించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు తాజాగా ఆదేశించింది. పదవీ విరమణ వయసును 65కి పెంచాలంటూ ఈ నాలుగు విశ్వవిద్యాలయాలు చేసిన ప్రతిపాదనలను వ్యవసాయ శాఖ ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడిత రాజశేఖర్ ఏకపక్షంగా తిరస్కరించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఈ మేరకు రాజశేఖర్ ఇచి్చన లేఖ అమలును నిలిపేసింది.
వ్యవసాయ శాఖ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికే పలువురు పదవీ విరమణ చేశారని, అయితే ప్రభుత్వం ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆక్షేపించింది. ఇలా అయితే విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందని ప్రశి్నంచింది. పదవీ విరమణ వయసు పెంపుపై కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి మూడు వారాల గడువునిచ్చింది. కాగా ఈ అంశంపై ధర్మాసనం ఆదేశాల మేరకు బుడిద రాజశేఖర్ కోర్టు ముందు స్వయంగా హాజరయ్యారు.


