borra
-
ఆ రూ.లక్ష గిఫ్ట్ కూపన్లు నాకొద్దు
సాక్షి, అమరావతి: ప్రజాధనాన్ని వృథా చేస్తున్న కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీలకు రూ.లక్ష విలువ చేసే గిఫ్ట్ కూపన్లు ఇచ్చిందని, అందుకే తాను ఆ కూపన్లను తిరిగి పంపుతున్నానని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఏసీ టైం టేబుల్ ప్రకారం శాసనమండలిలో ఐదు రోజుల పాటు బడ్జెట్‌పై చర్చ జరగాల్సింది పోయి ఇతర అంశాల వైపు దారి మళ్లిస్తున్నారని ఆయన అన్నారు. అసెంబ్లీలో విపక్షం లేనందున, అధికార పార్టీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, వాళ్లే జబ్బలు చరుచుకుంటున్నారనని ఆయన ఎద్దేవా చేశారు. అయితే మండలిలో విపక్షాలు ఉన్నాయి.. కనీసం ఇక్కడైనా చర్చించాల్సింది పోయి, తమ లాంటి స్వతంత్ర ఎమ్మెల్సీల హక్కులను కాలరాస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, శ్రామికులు, అంగన్వాడీలు, కేజీబీవీ సిబ్బంది, రైతుల సమస్యలపై అసలు చర్చించడం లేదని ఆరోపించారు. ఎలాంటి చర్చలు జరగని మండలిలో ఎమ్మెల్సీగా ఉన్న తనకు ఇచ్చిన రూ.లక్ష విలువైన గిఫ్ట్ కూపన్లను తిరస్కరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఏడాది పాటు టాటా సంస్థకు చెందిన ‘క్రోమా’ షో రూమ్‌లో రూ.లక్ష విలువైన వస్తువులు కొనుగోలు చేసుకోమంటూ కూపన్లు ఇవ్వడం ద్వారా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నట్లుగా భావించి ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. శాసన మండలి జాయింట్ సెక్రటరీ విజయరాజుకు సోమవారం కూపన్లు తిరిగి ఇచ్చేశారు. -
బొర్రాలో జోరుగా రంగురాళ్ల తవ్వకాలు
అనంతగిరి:మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహల సమీపంలో రంగురాళ్ల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. బొర్రా పంచాయతీ పెద్దూరు, నిన్నిమామిడి, జీరుగెడ్డ, కొంట్యాసిమిడి, డెక్కాపురం తదితర గ్రామాల్లో మూడేళ్ల నుంచి రంగురాళ్ల తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ దొరికే రాళ్లు నాణ్యమైనవి కావడంతో మైదాన ప్రాంతాలతో పాటు ఒడిశా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు గ్రామాల్లో మధ్యవర్తుల సహకారంతో స్థానిక గిరిజనులకు రోజువారి కూలి చెల్లించి మరీ తవ్వకాలు చేపడతున్నారు. గతంలో పోలీసుల దాడుల్లో చేపట్టి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కాలంలో వర్షాలు పడుతుండడంతో రాత్రి, పగలు తేడా లేకుండా తవ్వకాలు చేపడుతున్నారు. పర్యాటక ప్రాంతం కావడంతో ఎవరూ పట్టించుకోరనే ధీమాతో వ్యాపారులు స్థానికులతో తవ్వకాలు జరుపుతున్నారు. రంగురాళ్ల తవ్వకాలపై స్థానిక ఎస్ఐ పి.దామోదరనాయుడు వద్ద ప్రస్తావించగా రంగురాళ్లు తవ్వుతున్నట్టు గతంలో సమాచారం రావడంతో కొంతమందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. తవ్వకాలు జరగకుండా నిఘా ఉంచామన్నారు. ఎక్కడైనా రంగురాళ్ల తవ్వకాలు చేపడుతున్నట్టయితే 9440904224 నెంబరుకు సమాచారం అందించాలని కోరారు. -
బొర్రా మార్గంలో ఆగిన రైళ్లు
విశాఖ: విశాఖలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని బొర్రా-చిమిడిపల్లి మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో గురువారం మధ్యాహ్నం ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానికుల సమాచారంతో వెంటనే స్పందించిన అధికారులు సంఘటన స్థలికి చేరుకుని మరమ్మతులు ప్రారంభించారు.


