హోలీ తర్వాత ఉంటదీ.. బయటకొస్తే చుక్కలే! | Delhi Temperatures To Touch 35 After Holi | Sakshi
Sakshi News home page

హోలీ తర్వాత ఉంటదీ.. బయటకొస్తే చుక్కలే!

Mar 2 2026 11:57 AM | Updated on Mar 2 2026 12:06 PM

Delhi Temperatures To Touch 35 After Holi

న్యూఢిల్లీ: మార్చి నెల ప్రారంభం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఉష్ణోగ్రతలు ఇప్పటికే అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గడిచిన మూడేళ్ల కాలంలో 2026 ఫిబ్రవరి నెలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన వివరాల ప్రకారం, మార్చి 1వ తేదీన ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 31 నుంచి 32 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా ఉంది. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా హోలీ పండగ తరువాత  అంటే మార్చి 7 నాటికి గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల మార్కును తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గంటకు సుమారు 33 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నప్పటికీ, అవి ఎండ తీవ్రత నుంచి ఉపశమనాన్ని కలిగించడం లేదు. రాబోయే రోజుల్లో ఈ గాలుల వేగం తగ్గే అవకాశం ఉండటంతో ఉష్ణతాపం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మార్చి రెండో వారంలో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల కంటే పైస్థాయికి చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆకాశం నిర్మలంగా ఉండటంతో పాటు ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. సమీప భవిష్యత్తులో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో, పగటివేళ బయటకు వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. కాగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనూ ఈ తరహా వాతావరణ పరిస్థితులే కనిపిస్తున్నాయి. 

ఇది కూడా చదవండి: 91శాతం వైద్యుల షాకింగ్‌ డెసిషన్‌!

Advertisement
 
Advertisement
Advertisement