విద్యుత్ చార్జీలు తగ్గిస్తామంటూ ఎన్నికల ముందు హామీ
అధికారంలోకి వచ్చాక రూ.22 వేలకోట్లకుపైగా చార్జీల భారం
విద్యుత్ చార్జీలు తగ్గించేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు శూన్యం
డిస్కం అప్పులకు రూపాయి కూడా విదల్చని ప్రభుత్వం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించింది రూ.13,600 కోట్లు
కానీ ఉచిత, రాయితీ విద్యుత్‌కు ఇచ్చింది రూ.11 వేలకోట్లు మాత్రమే
ఈసారి వ్యవసాయ విద్యుత్‌కు రూ.13,722 కోట్ల ప్రతిపాదన
ఇంధన రంగం మొత్తానికి బడ్జెట్‌లో కేటాయింపు కేవలం రూ.13,934 కోట్లే!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ రంగానికి మరోసారి మొండిచేయి చూపించింది. అధికారంలోకి వచి్చన తరువాత 18 నెలల్లోనే రాష్ట్ర ప్రజలపై రూ.20,135.50 కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపి వసూలు చేస్తున్న చంద్రబాబు ఇంధన రంగానికి బడ్జెట్‌లో కేవలం రూ.13,934 కోట్లు మాత్రమే కేటాయించారు. అదికూడా వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్, వివిధ వర్గాలకు ఇచ్చే రాయితీల కోసం. కనీసం చార్జీల రూపంలో ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నంత కూడా బడ్జెట్‌లో ఇవ్వలేకపోయారు.
ఆధునిక అభివృద్ధికి ఎనర్జీ ప్రాణాధారమని, ఎనర్జీ భద్రత అంటే ఆర్థిక భద్రతని, వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం, విద్య, ఆరోగ్యం ఇలా ప్రతి రంగం అభివృద్ధి విద్యుత్‌పై ఆధారపడి ఉందని చెప్పిన ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విద్యుత్ రంగం అప్పులు తీర్చడానికి ఒక్క రూపాయి కూడా బడ్జెట్‌లో విదల్చలేదు.
గత ప్రభుత్వ పాలనలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పీపీఏలను) అస్తవ్యస్తంగా రద్దుచేయడం వల్ల అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చిందని కేశవ్ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ట్రూ–అప్ చార్జీల రూపంలో ప్రజలపై భారం పడిందని మంత్రి అంగీకరించారు. నిజానికి గత టీడీపీ పాలనతో జరిగిన అనవసర, అధిక ధరల విద్యుత్ కొనుగోళ్ల కారణంగానే రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) అప్పుల ఊబిలో కూరుకుపోయాయి.
రూ.2,600 కోట్లు తక్కువే..
ప్రస్తుత సంవత్సరంలో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీగా రూ.11 వేలకోట్లకు పైగా విడుదల చేసి 22.5 లక్షల మంది రైతులకు లబ్ధిచేకూర్చామని, అలాగే ఆక్వాటారిఫ్ సబ్సిడీగా రూ.890 కోట్లు విడుదల చేసి 48,500 మంది ఆక్వా వినియోగదారులకు మద్దతు ఇచ్చామని, బీపీఎల్ వృత్తిదారులకు సబ్సిడీ టారిఫ్‌లు కొనసాగిస్తున్నామని ఆర్థికమంత్రి చెప్పారు. నిజానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.13,600 కోట్లు కేటాయించారు. కానీ మంత్రి చెప్పినదాని ప్రకారం చూస్తే రూ.2,600 కోట్లు తక్కువే వెచ్చించారు.
అంటే ఆ మేరకు అర్హులకు ఉచిత, రాయితీ విద్యుత్‌ను దూరం చేశారు. ఇక సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానం కింద 2024 జూన్ నుంచి రూ.2.88 లక్షలకోట్ల విలువైన 55 ప్రాజెక్టులను మంజూరు చేశామని మంత్రి చెప్పారు. ఇందులో 15.56 గిగావాట్ల సౌరశక్తి, 4.86 గిగావాట్ల వాయుశక్తి, 17.7 గిగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, 1 ఎంఎంఏటీపీఏ గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రాజెక్టులున్నాయని తెలిపారు.
అడిగింది ఎంత.. ఇచ్చింది ఎంత?
వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన లెక్కలకు, ఆర్థికమంత్రి చెప్పిన లెక్కలకు పొంతన లేదు. ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం ద్వారా రాష్ట్రంలో 22.5 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు రోజుకు 9 గంటలపాటు నిరంతర పగటి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత డిసెంబర్ 31 నాటికి ఈ పథకానికి రూ.13,241.17 కోట్ల సబ్సిడీ వ్యయం జరిగిందని చెప్పారు.
కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.11 వేలకోట్లు ఖర్చుచేసినట్లు ఆర్థికమంత్రి తెలిపారు. ఈ ఇద్దరు మంత్రులు చెప్పినదాని ప్రకారం చూస్తే ఆ మేరకు నిధులు ఖర్చు చేయలేదని స్పష్టంగా తెలుస్తోంది. అలాగే 2026–27లో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ అవసరాలకే రూ.13,722 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి వెల్లడించారు. కానీ ప్రభుత్వం మొత్తం ఇంధన రంగానికి బడ్జెట్‌లో రూ.13,934 కోట్లు కేటాయించింది.


