గుట్టుగా గ్యారెంటీ అప్పులు! | Budget with incorrect calculations on debts incurred by coalition government | Sakshi
Sakshi News home page

గుట్టుగా గ్యారెంటీ అప్పులు!

Feb 15 2026 4:24 AM | Updated on Feb 15 2026 4:24 AM

Budget with incorrect calculations on debts incurred by coalition government

బడ్జెట్‌లో దాచేసిన చంద్రబాబు సర్కారు

ప్రభుత్వ గ్యారెంటీ అప్పు.. 2025 చివరి నాటికి రూ.3.11 లక్షల కోట్లు 

రంగాల వారీగా ఆదాయ వివరాలపైనా దాగుడు మూతలు 

కూటమి సర్కారు చేసిన అప్పులపై తప్పుడు లెక్కలతో బడ్జెట్‌ 

ఫిబ్రవరి 3వతేదీ నాటికే బడ్జెట్‌ అప్పులు రూ.97,571 కోట్లు

ఆర్థిక మంత్రి లెక్కల్లో రూ.79,456 కోట్లుగా సవరణ అంచనాలు 

ప్రస్తుత ఆర్థిక ఏడాది బడ్జెట్‌ సవరించిన అంచనాల్లో భారీగా కోతలు  

మూలధన వ్యయంపై తప్పుడు గణాంకాలతో సవరణ అంచనాలు 

జీఎస్‌డీపీలో అప్పులు 35 నుంచి 36 శాతానికి పెరుగుదల  

సాక్షి, అమరావతి: అప్పులపై వాస్తవాలను చంద్రబాబు సర్కారు మరోసారి కప్పిపుచ్చింది. కూటమి సర్కారు గ్యారెంటీతో చేసిన అప్పులను బడ్జెట్‌ ఇన్‌ బ్రీఫ్‌లో చూపకుండా దాచేసింది. ఇలా అసంపూర్తి లెక్కలతో బడ్జెట్‌ ఇన్‌ బ్రీఫ్‌ ఇవ్వడం చంద్రబాబు సర్కారుకు ఇది రెండోసారి కావడం గమనార్హం. గత బడ్జెట్‌లోనూ ఐదేళ్ల అప్పుల వివరాలు ఇవ్వకుండా ఎగరగొట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్‌ ఇన్‌ బ్రీఫ్‌లో కేవలం బడ్జెట్‌ అప్పులను మాత్రమే చంద్రబాబు సర్కారు పేర్కొంది. బడ్జెట్‌ బయట వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పుల వివరాలను వెల్లడించకపోవడం గమనార్హం. 

ఓపెన్‌ మార్కెట్, కేంద్రం ఇచ్చినవి, చిన్న మొత్తాలతో పాటు ప్రభుత్వ గ్యారెంటీ అప్పులను బడ్జెట్‌ ఇన్‌ బ్రీఫ్‌లో వెల్లడించడం సర్వ సాధారణం. అయితే చంద్రబాబు సర్కారు గ్యారెంటీ అప్పులు, చిన్న మొత్తాలు తదితరాల అప్పులను బడ్జెట్‌ ఇన్‌ బ్రీఫ్‌లో చూపకుండా దాచి పెట్టింది. ఇందుకు ప్రధాన కారణం.. బడ్జెట్‌ బయట ప్రభుత్వ గ్యారెంటీలతో ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయడమే. 

బడ్జెట్‌ ఇన్‌ బ్రీఫ్‌లో రంగాల వారీగా ఆదాయ వివరాలు, వ్య­యాలను చూపిస్తారు. ఈసారి వాటిని కూడా కూటమి సర్కారు ఎగరగొట్టింది. దాని స్థానంలో ప్రజా రుణం జీఎస్‌డీపీలో శాతం పేరుతో గ్రాఫిక్స్‌తో సరిపుచ్చింది. అప్పుల లెక్కలపై వాస్తవాలు బయట పడతాయనే భయంతోనే ఇలా చేసినట్లు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.   

» ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అప్పులపై కూడా తప్పుడు గణాంకాలతో చంద్రబాబు సర్కారు బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి 3వతేదీ నాటికే బడ్జెట్‌ అప్పులు రూ.97,456 కోట్లు కాగా.. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 2025–26 అప్పులు రూ.79,456 కోట్లుగా సవరించిన అంచనాల్లో పేర్కొనడం గమనార్హం. 

మరో పక్క బడ్జెట్‌ను పూర్తిగా అమలు చేయలేక చంద్రబాబు సర్కారు చతికిల పడింది. ప్రస్తుత ఆర్థిక ఏడాది బడ్జెట్‌ సవరించిన అంచనాల్లో భారీగా కోత పెట్టారు. 2025–26 బడ్జెట్‌ను రూ.3,22,359 కోట్లుగా ప్రతిపాదించగా ఇప్పుడు సవరించిన అంచనాల్లో రూ.3,00,534 కోట్లకు కుదించారు. అంటే ఏకంగా రూ.21,825 కోట్లు కోత విధించారు. 

»  ప్రస్తుత ఆర్థిక ఏడాది బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.14,182 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో రూ.13,081 కోట్లకు తగ్గించారు. గ్రామీణాభివృద్ధి రంగానికి రూ.18,890 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో రూ.15,244 కోట్లకు కుదించారు. సాధారణ విద్యకు రూ.34,825 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో రూ.32,694 కోట్లకు తగ్గించారు. 

ఆరోగ్య రంగానికి రూ.19,264 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో రూ.17,637 కోట్లకు తగ్గించారు. పట్టణాభివృద్ధికి బడ్జెట్‌లో రూ.13,862 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో రూ.11,252 కోట్లకు తగ్గించారు. ఇలా తగ్గించిన గణాంకాలతో, 2026–27లో అధికంగా కేటాయింపులు చేశామంటూ బాబు సర్కారు జబ్బలు చరుచుకోవడం గమనార్హం.   

» మూలధన వ్యయంపై కూడా తప్పుడు గణాంకాలతో సవరణ అంచనాలను ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. 2025–26లో మూలధన వ్యయం రూ.40,635 కోట్లు ఉండగా సవరించిన అంచనాల్లో రూ.33,134 కోట్లుగా పేర్కొన్నారు. అయితే కాగ్‌ గణాంకాల మేరకు వాస్తవ మూలధన వ్యయం డిసెంబర్‌ నాటికి కేవలం రూ.19,224 కోట్లే. మూడు నెలల్లో ఏకంగా మరో రూ.13 వేల కోట్లకుపైగా వ్యయం చేస్తామనడం ఆచరణ సాధ్యం కాదని స్పష్టం అవుతోంది.  

» కూటమి సర్కారు పాలనలో జీఎస్‌డీపీలో బడ్జెట్‌ అప్పులు 35 నుంచి 36 శాతానికి పెరిగాయి. జీఎస్‌డీపీలో అప్పులు 2023–24లో 35 శాతం ఉండగా చంద్రబాబు ప్రభుత్వం వచి్చన నాటి నుంచి మూడు బడ్జెట్లలో జీఎస్‌డీపీలో అప్పులు 36 శాతానికి ఎగబాకాయి.  

»  2023–24 నాటికి బడ్జెట్‌ అప్పులు రూ.4.91 లక్షల కోట్లు ఉండగా 2026–27 మార్చి నాటికి ఏకంగా రూ.7.11 లక్షల కోట్లకు పెరగనున్నాయి. అంటే వచ్చే మార్చి నాటికి కూటమి సర్కారు బడ్జెట్‌ అప్పులే ఏకంగా రూ.2.20 లక్షల కోట్లు పెరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది.   

»  ఇక బడ్జెట్‌ బయట అప్పులకు కూటమి సర్కారు భారీగా గ్యారెంటీలు ఇచ్చింది. బడ్జెట్‌ డాక్యుమెంట్‌ వాల్యూమ్‌ 5 ప్రకారం వివిధ సంస్థల ద్వారా 2025 డిసెంబర్‌ నాటికి రూ.3.11 లక్షల కోట్ల అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీలు ఇచ్చింది. ఇందులో పౌరసరఫరాల సంస్థ, ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, రాష్ట్ర మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, ఏపీ జెన్‌కో తదితర సంస్థలున్నాయి. బడ్జెట్‌ బయట అప్పులపై ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆధారపడుతోందని దీన్నిబట్టి స్పష్టం అవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement