'భృతి' లేదు.. గతి లేదు | No allocations for unemployment benefits in the latest budget | Sakshi
Sakshi News home page

'భృతి' లేదు.. గతి లేదు

Feb 15 2026 4:06 AM | Updated on Feb 15 2026 4:06 AM

No allocations for unemployment benefits in the latest budget

చంద్రబాబు హామీలు హుళక్కే.. ఉద్యోగం రాలేదు.. ‘భృతి’ అందలేదు!

ముచ్చటగా మూడో బడ్జెట్లలోనూ నిరుద్యోగ యువతకు మొండిచెయ్యి

ఎన్నికలప్పుడు నెలకు మూడు వేల నిరుద్యోగభృతి ఇస్తామని బూటకపు హామీ

ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు

రెండేళ్లుగా నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగుల నిరీక్షణ.. జాబ్‌ క్యాలెండర్‌ ఊసే గల్లంతు

తాజా బడ్జెట్‌లోనూ నిరుద్యోగ భృతికి పంగనామం

ఇలా మూడేళ్లలో నిరుద్యోగులకు రూ.21,600 కోట్లు ఎగ్గొట్టిన బాబు

దేశానికి ఆయువుపట్టు యువశక్తి. ఏపీలో ఉండే యువతను ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తా. పరిశ్రమలు తెస్తా. ఉద్యోగాలు ఇస్తా. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. యువతకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తా. ఇప్పుడు చెప్పండి యువతను నిర్వీర్యం చేసిన పార్టీ ఏదీ? మిమ్మల్ని ఆదుకునే పార్టీ ఏదీ?.. – మే 28, 2023న రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడులో చంద్రబాబు దగాకోరు మాటలు

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తికావస్తోంది. ముచ్చటగా మూడో బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. అయినా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. పరిశ్రమలూ తేలేదు. నిరుద్యోగ భృతి ఊసేలేదు. జాబ్‌ క్యాలెండర్‌ అడ్రస్సే లేదు. నోటిఫికేషన్లకు అసలే దిక్కులేదు. 

‘‘ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాం. రికార్డు చేసుకో.. డేటు, టైము రాసుకో.. జగన్‌లాగా పారిపోయే బ్యాచ్‌ కాదు నేను.’’ –  2024 ఫిబ్రవరి 13న యువగళం సభలో మంత్రి నారా లోకేశ్‌ బీరాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు మరోసారి నిరుద్యోగ యువతను నిండా ముంచేసింది. ముచ్చటగా మూడో బడ్జెట్‌లోనూ మొండి చెయ్యి చూపించింది. ఎన్నికల సమయంలో అధికార పీఠం కోసం నిరుద్యోగ యువతను నమ్మించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లు నయ వంచనకు గురి చేశారు. ఆయువుపట్టుపై దెబ్బకొట్టారు. తాజాగా 2026–27 బడ్జెట్‌లోనూ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ‘సూపర్‌ సిక్స్‌లో.. బాబుమార్క్‌’ దగాకోరు రాజకీయాన్ని ప్రదర్శించారు. 

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మూడు వార్షిక బడ్జెట్లలోనూ నిరుద్యోగుల ఊసే లేకుండా చేశారు. ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు, లేకుంటే ఉద్యోగం వచ్చే వరకు ప్రతి ఒక్కరికీ నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని అటకెక్కించేశారు. రెండేళ్ల చంద్రబాబు సర్కారు ఒక్కో నిరుద్యోగికి ఏడాదికి రూ.36 వేల చొప్పున రెండేళ్లలో రూ.72 వేలు ఇవ్వకుండా మోసం చేసింది. 

ఇలా 20 లక్షల మందికి చూస్తే దాదాపు రెండేళ్లలో రూ.14,400 కోట్లు బకాయిపడింది. ఈ ఏడాది బడ్జెట్‌లో అసలు నిరుద్యోగ భృతి ప్రస్తావన లేకపోవడంతో మరో రూ.7,200 కోట్ల చెల్లింపులకు ఎగనామం పెట్టింది. అంటే, చంద్రబాబు ఎన్నికల హామీల్లో భాగంగా నిరుద్యోగులకు రూ.21,600 కోట్లు ఇవ్వకుండా మోసానికి పాల్పడ్డారని స్పష్టమవుతోంది.

ఇంకెంతకాలం ఈ మోసం బాబూ!
2014 ఎన్నికల ముందు  నిరుద్యోగులను బుట్టలో వేసుకుని రూ.2 వేలు నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి, నాలుగున్నరేళ్లకుపైగా ఆ ఊసే ఎత్తేలేదు. 2017–18లో రూ.500 కోట్లు కేటాయించినా..  పైసా కూడా ఖర్చు చేయలేదు. నిరుద్యోగ భృతి ఇచ్చే వారి సంఖ్యను తొలుత 12 లక్షలు అని చెప్పి, చివరికి 2.10 లక్షల మందే అర్హులన్నారు. తీరా 1.62 లక్షల మందికే ఇస్తామని, ఈ–కెవైసీ లింక్‌ పెట్టారు. చివరకు అందులోనూ కొంత మందికే నిరుద్యోగ భృతి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు మొత్తానికి బరితెగించి ఇవ్వను పొమ్మని నిరుద్యోగులను బెదిరిస్తున్నారు. 

బాబు పాలనలో ఉద్యోగాల భర్తీ ఊసే లేదు
బాబు పాలనలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై వివాదాలు సృష్టించడం, వాటిని అడ్డంపెట్టుకుని భర్తీ నిలిపివేయడం పరిపాటి. ఈసారీ అదే సూత్రాన్ని సర్కారు పాటిస్తోంది. గతంలో జారీ అయిన నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్న దాదాపు 10 లక్షల మంది అభ్యర్థుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడుతోంది. దాదాపు 21 నోటిఫికేషన్లకు షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించి 2024 డిసెంబర్‌ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. 

ఇచ్చిన నోటఫికేషన్లలో 19 నోటిఫికేషన్ల ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్తగా 150 గ్రూప్‌–1 పోస్టులు సృష్టిస్తున్నట్టు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇప్పటికే ఇచ్చిన గ్రూప్‌–1 నోటిఫికేషన్‌లో పోస్టులు భర్తీ చేయకుండా, ఆయా శాఖల్లో కేడర్‌ ఖాళీలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోకుండా 150 పోస్టులు, మరో 4,300 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు భర్తీ చేస్తామనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

వైఎస్‌ జగన్‌ హయాంలో ఉద్యోగాల విప్లవం 
» వైఎస్‌ జగన్‌ తన ఐదేళ్ల పాలనలో ఉద్యోగాల విప్లవం సృష్టించారు. 
»    గ్రామ/వార్డు సచివాలయాలను ప్రవేశపెట్టి 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలు కొత్తగా కల్పించారు. 2.66 లక్షల వలంటీర్లను గత ప్రభుత్వంలో నియమించారు. 
»    ఆప్కాస్‌ ద్వారా 96వేల ఉద్యోగాలు భర్తీ చేశారు. 
»  ఆర్టీసీ విలీనం ద్వారా 58వేల ఉద్యోగాలు రెగ్యులరైజ్‌ చేశారు. 
»  మొత్తం ఐదేళ్లలో 6,31,310  ఉద్యోగాలిచ్చారు. 
»  చంద్రబాబు కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పుడు విడుదల చేసిన 2023–24 సామాజిక ఆర్థిక సర్వేలో పేర్కొన్న ప్రకారమే.. లార్జ్‌ అండ్‌ మెగా ఇండస్ట్రీస్‌లో 1.02 లక్షల మందికి , ఎంఎస్‌ఎంఈ రంగంలో 32,79,970 మందికి  వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో ఉద్యోగాలు ఇచ్చినట్లు స్పష్టంగా ఉంది. 
»   గవర్నమెంట్, లార్డ్‌ అండ్‌ మెగా, ఎంఎంఎస్‌ఈ సెక్టార్‌లో 40,13,552 మందికి ఉద్యోగాలు ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement