తరలిరానున్న లక్షలాది మంది భక్తులు
కొలువుదీరనున్న భారీ విద్యుత్ ప్రభలు
నరసరావుపేట రూరల్: తిరునాళ్ల మహోత్సవానికి పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం కోటప్పకొండ సిద్ధమైంది. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం నిర్వహించే ఈ తిరునాళ్లకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు జాగరణకు తరలిరానున్నారు. త్రికోటేశ్వర స్వామి వారికి ప్రభుత్వం తరఫున విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి పట్టువ్రస్తాలు సమర్పించనున్నారు. భక్తులకు ఉచిత, ప్రత్యేక, శీఘ్ర దర్శనం, వీఐపీ దర్శనం, అభిషేక దర్శనం కల్పించే విధంగా క్యూలైన్లు సిద్ధం చేసినట్లు అధికారులు చెప్పారు.
క్యూలైన్లలో భక్తులకు అందజేసేందుకు ఆరు లక్షల వాటర్ బాటిళ్లు, లక్ష మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్లు, పాలు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. తిరునాళ్ల జాగరణకు ఈ ఏడాది 5 లక్షల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. వారి సౌకర్యార్థం ఆర్టీసీ కోటప్పకొండకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది.
నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి 618 బస్సులను నడపనుంది. కొండ దిగువ నుంచి పైకి భక్తులను చేరవేసేందుకు తిరుమలకు చెందిన 120 బస్సులను అందుబాటులో ఉంచారు. వైద్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పరిశీలించారు. ఎస్పీ బి.కృష్ణారావు ఆధ్వర్యంలో మూడు వేల మంది సిబ్బందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
కొలువుదీరనున్న భారీ విద్యుత్ ప్రభలు
ప్రభల పండుగగా పేరుగాంచిన కోటప్పకొండ తిరునాళ్లలో ఈ ఏడాది 26 భారీ విద్యుత్ ప్రభలు కొలువుదీరనున్నాయి. వీటితో పాటు 50 చిన్న ప్రభలు, వందకు పైగా మొక్కుబడి ప్రభలు కొండకు తరలిరానున్నాయి. భక్తులకు విక్రయించేందుకు రెండు లక్షల లడ్డూలు, లక్ష అరిసె ప్రసాదాలను సిద్ధంగా ఉంచినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది భక్తులకు చిన్న లడ్డూలను ఉచితంగా అందజేయనున్నట్లు పేర్కొన్నారు.


