మూడో బడ్జెట్‌లోనూ నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పింఛన్లు, రైతులు, పొదుపు మహిళల సున్నా వడ్డీకి మంగళం
ఈ పథకాలు ఇక అమలు చేయబోరని అసెంబ్లీ సాక్షిగా సుస్పష్టం
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు, దీపం పథకాలకు కోతలతో సరి
ఆరోగ్యశ్రీ బకాయిల ఊసు లేదు.. ఆసరా సాయం ఎగనామం.. ఫీజు బకాయిలు రూ.8,900 కోట్ల పరిస్థితి అగమ్యగోచరం.. ఉద్యోగ వర్గాలకూ వంచనే.. రూ.40 వేల కోట్ల బకాయిలు
పేదల ఇళ్లు కాగితాలపైనే.. సంపద సృష్టి, సూపర్ సిక్స్ జాడలేని దగా బడ్జెట్
అభివృద్ధి, సంక్షేమం తిరోగమనమే.. వచ్చే ఏడాది మరో రూ.లక్ష కోట్ల అప్పులు
పన్నేతర, పన్నుల బాదుడుతో ప్రజల జేబులు ఖాళీ.. పన్నేతర ఆదాయం ఏకంగా రూ.11,473 కోట్లు.. పన్నుల ఆదాయం అదనంగా రూ.27,820 కోట్లు
ఇప్పటికే ఐదున్నర లక్షల పింఛన్ల కోత.. కేటాయింపులు బట్టి మరో 8 లక్షల మందికి పింఛన్ దూరం.. అంటే మొత్తం 13.5 లక్షల పింఛన్లకు మంగళం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 1.80 లక్షల మంది మహిళలకు చంద్రబాబు ‘ఆడబిడ్డ నిధి’ ఇస్తామని హామీ ఇచ్చారు. ఒక్కొక్కరికీ ఏటా రూ.18 వేలు చొప్పున మూడేళ్లలో దాదాపు రూ.లక్ష కోట్లు ఇవ్వాలి. కానీ.. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఇచ్చింది మాత్రం సున్నా. 20 లక్షల మంది నిరుద్యోగులకు భృతి ఇస్తామన్నారు. నెలకు రూ.3 వేలు చొప్పున మూడేళ్లలో నిరుద్యోగ యువతకు రూ.21,600 కోట్లు ఇవ్వాలి. కానీ.. ఇచ్చింది గుండు సున్నా. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 20 లక్షల మందికి పెన్షన్ హామీని నెరవేర్చకుండా మూడేళ్లలో రూ.28,800 కోట్లు ఎగనామం పెట్టారు.
సున్నా వడ్డీ పథకానికి తూట్లు పొడిచి దాదాపు కోటి మంది పొదుపు మహిళలతోపాటు రైతులనూ దగా చేశారు. సూపర్ సిక్స్, ఎన్నికల హామీలను నెరవేర్చకుండా మూడు కోట్ల మందికిపైగా మహిళలు, రైతులు, యువతకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. మూడో బడ్జెట్‌లోనూ వాటి ప్రస్తావనే లేకుండా చేసి ఇక ఆ పథకాలను అమలు చేయబోమని విస్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినట్లైంది. తల్లికి వందనం పథకానికి రూ.13,112 కోట్లు కావాల్సి ఉంటే ఈ బడ్జెట్‌లో ఇచ్చింది రూ.8,457 కోట్లే!
మొదటి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి రెండో ఏడాది కోతలతో సరిపుచ్చారు. అన్నదాతా సుఖీభవ కింద పాత బకాయిలతో కలిపి రూ.27,455 కోట్లు ఇవ్వాల్సి ఉంటే బడ్జెట్లో చేసిన కేటాయింపులు రూ.6,600 కోట్లు మాత్రమే. దీపం పథకం అమలుకు ఏటా రూ.4,200 కోట్లు అవసరం కాగా బడ్జెట్లో ప్రతిపాదించింది కేవలం రూ.2,601 కోట్లే! ‘దీపం’ పథకం కింద బకాయిలతో కలిపి రూ.6,183 కోట్లు ఎగనామం పెట్టారు. మహిళలకు ఉచిత బస్సు హామీని తొలి ఏడాది నెరవేర్చకుండా రూ.3,200 కోట్లు ఎగ్గొట్టారు.
రెండో ఏడాది నుంచి అనేక ఆంక్షలతో అరకొరగా అమలు చేస్తున్నారు. ఇక ఉద్యోగుల బకాయిలు దాదాపు రూ.40 వేల కోట్లు ఉండగా పెండింగ్‌లో ఉన్న 4 డీఏలు ఎప్పుడు అందుతాయో తెలియని దుస్థితి నెలకొంది. ఇలా అన్ని వర్గాలను మోసం చేస్తూ రూ.3.32 లక్షల కోట్లతో 2026–27 వార్షిక బడ్జెట్‌ను టీడీపీ కూటమి సర్కారు బడ్జెట్‌ను శనివారం అసెంబ్లీకి సమర్పించింది. సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి అనేది బడ్జెట్‌లో ఎక్కడా లేకపోగా ప్రభుత్వ గ్యారెంటీ రుణాలను దాచి పెట్టింది. భారీ అప్పులు, పన్నులు, పన్నేతర వాతలు మాత్రం బడ్జెట్‌లో ప్రస్ఫుటంగా కనిపించాయి. పది సూత్రాల సూక్తులు మినహా కార్యాచరణ బడ్జెట్‌లో కానరాలేదు.

పేదల ఇళ్లపై కక్ష..
పేదల ఇళ్ల నిర్మాణంపై చంద్రబాబు సర్కారు కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. కాగితాలపై కేటాయింపులు మినహా ఖర్చు చేయడం లేదు. గత రెండు బడ్జెట్లలో కేటాయింపులు, వాస్తవ వ్యయం తీరే దీనికి నిదర్శనం. 2024–25లో పేదల ఇళ్ల నిర్మాణాలకు రూ.4,012 కోట్లు కేటాయించగా రూ.1,611 కోట్లు మాత్రమే వెచ్చించారు. 2025–26లో రూ.6,317 కోట్లను కేటాయించగా సవరించిన అంచనాల్లో వ్యయం కేవలం రూ.2,017 కోట్లుగా పేర్కొన్నారు. ఈసారి రూ.6,357 కోట్లు కేటాయించినట్లు చూపిస్తున్నా ఈ ప్రభుత్వానికి వ్యయం చేసే ఉద్దేశం లేదని గత రెండు బడ్జెట్ల ద్వారా స్పష్టమవుతోంది.
అదనంగా రూ.27,820 కోట్ల పన్నుల భారం
ఒకవైపు ప్రైవేట్‌కు సంపద సృష్టిస్తూ వేగంగా అడుగులు వేస్తున్న చంద్రబాబు సర్కారు మరోవైపు పన్నేతర, పన్ను ఆదాయాల ద్వారా రాష్ట్ర ప్రజలపై పెనుభారం మోపింది. పన్నుల ఆదాయం అదనంగా రూ.27,820 కోట్లు వస్తుందని అంచనా వేయడం గమనార్హం. అంటే పన్నుల రూపంలో ప్రజలపై భారీగా వడ్డించనున్నట్లు స్పష్టమవుతోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్ ద్వారా ప్రజలపై భారం మోపనున్నారు.
పన్నుల రూపంలో ఆదాయం సమకూర్చుకోవాలని ప్రతిపాదించినా సూపర్ సిక్స్ హామీలకు మాత్రం పూర్తి స్థాయిలో కేటాయింపులు చేయకపోవడం గమనార్హం. 2025–26లో సవరించిన రాష్ట్ర సొంత పన్ను ఆదాయం రూ.98,025 కోట్లు కాగా, 2026–27లో సొంత పన్ను ఆదాయం రూ.1,25,845 కోట్లుగా అంచనా వేశారు. ఇక పన్నేతర ఆదాయంపై బాబు సర్కారు తిమ్మిని బమ్మిని చేసింది.
2025–26 బడ్జెట్ అంచనాల్లో పన్నేతర ఆదాయం రూ.19,119 కోట్లు కాగా సవరించిన అంచనాల్లో రూ.14,324 కోట్లకు తగ్గించారు. అయితే వాస్తవంగా కాగ్ డిసెంబర్ వరకు విడుదల చేసిన గణాంకాల మేరకు పన్నేతర ఆదాయం కేవలం రూ.4,142 కోట్లు వచ్చింది. ఇక 2026–27 బడ్జెట్‌లో పన్నేతర ఆదాయం రూ.11,473 కోట్లుగా అంచనా వేశారు. అంటే పన్నేతర రూపంలో కూడా ప్రజలపై బాదనున్నారు.
సంపద సృష్టి శూన్యం.. ప్రైవేట్‌కు ఫండింగ్
సంపద సృష్టించి సంక్షేమం, అభివృద్ధి బాటలో నడిపిస్తానని ఎన్నికల ముందు నమ్మబలికిన చంద్రబాబు ప్రభుత్వ రంగంలో పోర్టులు, వైద్య కళాశాలల నిర్మాణాన్ని గాలికి వదిలేశారు. పీపీపీలో విధానంలో భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు బడా సంస్ధలకు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కింద బడ్జెట్‌లో ఏకంగా రూ.1,500 కోట్లు కేటాయింపులు చేశారు.
మరో రూ.లక్ష కోట్ల అప్పులు..
వచ్చే ఏడాది మరో రూ.లక్ష కోట్ల మేర అప్పులు చేయనున్నట్లు బడ్జెట్‌లో చంద్రబాబు సర్కారు వెల్లడించింది. ప్రజా రుణం పేరుతో రూ.98,065 కోట్ల మేర అప్పులు చేయనున్నట్లు బడ్జెట్‌లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ అంతర్గత రుణం కింద రూ.78,182 కోట్లు, కేంద్రం నుంచి రూ.19,133.41 కోట్లు అప్పులు చేయనున్నట్లు బడ్జెట్‌లో స్పష్టం చేశారు.
జనంపై బాదుడు.. భారీ అప్పులే లక్ష్యం..
పన్నుల రూపంలో ప్రజలపై భారీగా బాదుడు, భారీ అప్పులే లక్ష్యంగా రూ.3.32 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2.56 లక్షల కోట్లు, మూలధన వ్యయం రూ.48,697 కోట్లుగా పేర్కొన్నారు.
రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు ఉంటుందని, ఇది జీఎస్‌డీపీలో 1.11 శాతమని వెల్లడించారు. ద్రవ్యలోటు రూ.75,868 కోట్లుగా ఉంటుందని, ఇది జీఎస్‌డీపీలో 3.84 శాతంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు తగ్గుతున్నట్లు అంకెల గారడీతో మోసపుచ్చేందుకు బడ్జెట్లో బాబు సర్కారు ప్రయత్నించినట్లు స్పష్టమవుతోంది.

తల్లులకు బాబు వంచన..
తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలను బడికి పంపిస్తే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. యూడైస్ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. ఈ పథకానికి ఒక్కొక్కరికీ ఏటా రూ.15 వేల వంతున ఏడాదికి మొత్తం రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. కానీ తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు.
2025–26లో కేవలం 66 లక్షల మందికి రూ.6,377 కోట్లను మాత్రమే చెల్లించారు. ఇలా రెండేళ్లలో ఇప్పటికే తల్లులకు రూ.19,848.64 కోట్లకుపైగా సీఎం చంద్రబాబు బకాయిపడ్డారు. ఇక ఇప్పుడు బడ్జెట్‌లో రూ.8457.07 కోట్లు మాత్రమే ప్రతిపాదించి ఏకంగా రూ.4,655.75 కోట్ల మేర కోతలు పెట్టారు. తద్వారా మూడేళ్లలో పిల్లలకు రూ.24,504 కోట్లను ఎగ్గొట్టారు!
రైతులకు వెన్నుపోటు..
పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,716.53 కోట్లు అవసరం. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో 46,85,838 మంది రైతులకు రూ.పది వేల చొప్పున రూ.4,685.54 కోట్లు మాత్రమే విదిల్చారు.
6,72,428 మంది రైతులకు పూర్తిగా ఎగనామం పెట్టారు. రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా ఒక్కో రైతుకు రూ.30 వేలు బకాయి పడ్డారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు సీఎం చంద్రబాబు ఇప్పటికే రెండేళ్లలో రూ.16,747.52 కోట్లు బకాయిపడ్డారు. తాజా బడ్జెట్‌లోనూ అరకొరగా కేటాయింపులు చేసి రైతులకు దాదాపు రూ.21 వేల కోట్ల మేర ఎగ్గొట్టారు.
తుస్సుమన్న గ్యాస్..
దీపం పథకం కింద రాష్ట్రంలో 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సిలిండర్ ధర రూ.855. ఈ లెక్కన ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే రూ.4,083.48 కోట్లు అవసరం. కానీ.. తొలి ఏడాది ఒక సిలిండర్‌కు మాత్రమే రూ.865 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే.. రూ.3,218.48 కోట్లు ఎగ్గొట్టారు.
గత బడ్జెట్‌లో ఆ పథకానికి రూ.2,601 కోట్లు కేటాయించారు. అంటే.. రెండో ఏటా రూ.1,482.48 కోట్లు బకాయిపడ్డారు. దీపం పథకం కింద రెండేళ్లలో మహిళలకు రూ.4,700.96 కోట్లను సీఎం చంద్రబాబు ఎగ్గొట్టారు. బకాయిలతో కలిపి తాజాగా రూ.6,183 కోట్లు ఎగనామం పెట్టారు.
మహిళలకు మరో మోసం..
రాష్ట్రమంతటా మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాలి. 2024–25లో ఆ హామీని అమలు చేయలేదు. అంటే.. తొలి ఏడాది ఉచిత బస్సు హామీ కింద రూ.3,200 కోట్ల మేర సీఎం చంద్రబాబు మహిళలకు బకాయిపడ్డారు.
2025–26 ఆగస్టు 15 నుంచి పథకాన్ని అమలు చేసినట్లు ప్రకటించారు. ఆర్టీసీలో 16 రకాల సర్వీసులు ఉండగా ఐదు సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సును అమలు చేస్తున్నారు. తొమ్మిది రకాల సర్వీసులకు ఉచిత బస్సు పథకాన్ని వర్తింపజేయడం లేదు.


