ఉచిత గ్యాస్ సిలిండర్లకు బడ్జెట్‌లో భారీగా నిధుల కోత
అందరికీ ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామని ఎన్నికల వేళ చంద్రబాబు హామీ
రాష్ట్రంలో మొత్తం 1.59 కోట్ల గ్యాస్ కనెక్షన్లు
అందరికీ ఏడాదికి మూడేసి సిలిండర్లు ఇవ్వాలంటే రూ.4,083.48 కోట్లు అవసరం
రెండేళ్లలో మహిళలకు రూ.4,700.96 కోట్ల బకాయి
తాజాగా మరో రూ.1,482 కోట్లు తగ్గించి కేటాయింపులు
మొత్తంగా రూ.6,183 కోట్లకు టోకరా పెట్టేందుకు బాబు ఎత్తుగడ
సాక్షి, అమరావతి: ప్రతి ఇంటికీ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఎన్నికల వేళ ఊదరగొట్టిన చంద్రబాబు ఆ హామీనీ మెల్లగా అటకెక్కించేస్తున్నారు. మహిళలకు కుచ్చుటోపీ పెట్టేందుకు టక్కుటమార విద్యలు ప్రదర్శిస్తూ బడ్జెట్‌లో తూతూమంత్రంగా నిధులు కేటాయించారు. ఎన్నికలప్పుడు అక్కచెల్లె్లమ్మల ఓట్ల కోసం ఇష్టారాజ్యంగా హామీలిచ్చి... అధికారంలోకి వచ్చాక వాటికి అడ్డగోలుగా కోతలు పెడుతున్నారు. లబ్దిదారులను ఏరిపారేస్తున్నారు.
వాస్తవానికి ఏపీలో 1.59 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే సుమారు రూ.4,083 కోట్లు అవసరం. కానీ, చంద్రబాబు 2026–27 బడ్జెట్‌లో మాత్రం దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్‌కు కేటాయించింది కేవలం రూ.2601 కోట్లు మాత్రమే!. ఈ బడ్జెట్ కేటాయింపులను బట్టి 98 లక్షల సిలిండర్లు మాత్రమే ఉచితంగా అందించడానికి వీలుంటుంది. మిగిలిన 60 లక్షల కనెక్షన్లకు ఉచిత గ్యాస్ సిలిండర్లు లేనట్టే. గడిచిన ఏడాదిన్నర కాలంలో దీపం 2.0 పథకం కొందరి ఇళ్లకే పరిమితమై ‘గుడ్డి దీపం’గా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రూ.6,183 కోట్లకు చంద్రబాబు ఎగనామం
2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత నవంబర్‌లో దీపం 2.0ను చంద్రబాబు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1.59 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తొలి ఏడాది ఒక్కో సిలిండర్ మాత్రమే ఉచితంగా ఇచ్చారు. ఇందుకు రూ.865 కోట్లు విడుదల చేశారు. మిగిలిన రెండు సిలిండర్లకు రూ.3218.48 కోట్లు ఎగ్గొట్టారు. ఆ తర్వాత ఏడాది (2025–26) మూడు సిలిండర్లకు రూ.2601 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇక్కడ కూడా 1,482.48 కోట్లు ఎగ్గొట్టారు. తాజాగా 2026–27 బడ్జెట్‌లోనూ రూ.2601 కోట్లు కేటాయించడంతో వచ్చే ఆర్థి క సంవత్సరానికి కూడా 1,482.48 కోట్లు ఎగ్గొట్టారు.
మొత్తంగా చూస్తే చంద్రబాబు రూ.6183 కోట్లు ఎగ్గొట్టి మహిళలకు టోకరా పెట్టారు. ప్రభుత్వ కేటాయింపులు సుమారు 90 లక్షల లబ్ధిదారులకే సరిపోగా... 60 లక్షలకుపైగా లబ్దిదారులకు మొండి చేయి చూపుతున్నారు. ఫలితంగా లక్షలాది మంది లబ్దిదారులు సబ్సిడీ కోసం గ్యాస్ ఏజెన్సీలు, గ్రామ–వార్డు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు.


