‘గ్రామీణాభివృద్ధి’ అంతంతమాత్రం | Huge cuts in revised budget for Panchayati Raj and Rural Development Department | Sakshi
Sakshi News home page

‘గ్రామీణాభివృద్ధి’ అంతంతమాత్రం

Feb 15 2026 3:51 AM | Updated on Feb 15 2026 3:51 AM

Huge cuts in revised budget for Panchayati Raj and Rural Development Department

ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖకు బడ్జెట్‌లో రూ.21,624 కోట్లు కేటాయింపు 

గత బడ్జెట్‌లో రూ.18,890 కోట్లు కేటాయించి.. రివైజ్డ్‌ బడ్జెట్‌లో రూ.15,244 కోట్లకే పరిమితం 

ఈసారైనా కేటాయించిన నిధులను మొత్తం వినియోగిస్తారా ? 

సాక్షి, అమరావతి: బడ్జెట్‌ రోజున కేటాయింపులు ఘనంగా ఉన్నా అమలుకు వచ్చేసరికి అథమం అన్నట్టు ఉంది ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ పరిస్థితి. 2026–27 బడ్జెట్‌లో పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.21,624 కోట్లు కేటాయింపులు చేసినా.. అవి కార్యరూపం దాల్చుతాయా లేదా అనేదానిపై అధికారులే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

గత 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ పెట్టిన రోజున పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.18,890 కోట్లు కేటాయింపులు చేసినట్టు ప్రకటించి.. వెంటనే రూ.15,244 కోట్లకు పరిమితం చేస్తూ రివైజ్డు కేటాయింపులను ప్రకటించడం ఆ అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయి.  

రివైజ్డు బడ్జెట్‌లో భారీ కోత 
గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్మాణంతో పాటు ఇంటింటికీ కొళాయిల ఏర్పాటుకు ఉద్దేశించిన జలజీవన్‌ మిషన్‌ కార్యక్రమానికి 2025–26 బడ్జెట్‌లో మొదట ఘనంగా రూ.2,800 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించి, తీరా రివైజ్డ్‌ బడ్జెట్‌లో ఆ కేటాయింపులు రూ.524.41 కోట్లకు పరిమితం చేస్తున్నట్టు ప్రకటించారు. అంటే బడ్జెట్‌కూ, రివైజ్డు బడ్జెట్‌కూ మధ్యనే భారీ కోతలు పెట్టిన ఆ జలజీవన్‌ మిషన్‌ పథకానికే 2026–27 బడ్జెట్‌లో ఏకంగా రూ.4,000 కోట్లు కేటాయించారు.  

గ్రామీణ రోడ్లకు గతం కన్నా తక్కువే 
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి సంబంధించి పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి గత 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ.2,239 కోట్లు కేటాయించి.. రివైజ్డ్‌ బడ్జెట్‌లో ఆ మొత్తాలను రూ.2,076 కోట్లకు పరిమితం చేశారు. మరోవైపు 2026–27 బడ్జెట్‌లో ఆయా కార్యక్రమాల ద్వారా రోడ్ల నిర్మాణానికి కేవలం రూ.1,883.57 కోట్లే కేటాయించారు.  

కొత్త ‘ఉపాధి’ పథకానికీ రూ.8,365 కోట్లే 
ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకొచి్చన వీబీ జీ రామ్‌జీ పథకానికి 2026–27 బడ్జెట్‌లో రూ.8,365 కోట్లు కేటాయింపులు చేశారు. అయితే ఈ పథకంలో పని చేసే ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన అడ్మిన్‌ కేటగిరికి గత బడ్జెట్‌లో రూ.372 కోట్లు పెట్టి, రివైజ్డు బడ్జెట్‌లో రూ.357 కోట్లకు సవరించగా.. 2026–27 బడ్జెట్‌లో ఆ కేటాయింపుల మొత్తం రూ.100 కోట్లకే పరిమితం చేయడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement