అన్నదాత సుఖీభవకు అడ్డగోలు కోతలు
ఏటా ప్రతి రైతుకు రూ.20 వేల పెట్టుబడి సాయం చేస్తామని హామీ
ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయించాల్సిన మొత్తం రూ.10,717 కోట్లు
వాస్తవంగా కేటాయించింది రూ.6,600 కోట్లు మాత్రమే
పాత బకాయిలన్నీ కలిపి మొత్తం చెల్లించాల్సింది రూ.27,465 కోట్లు
2024–25లో 53.58 లక్షల మంది రైతులకు ఎగవేత
రెండో ఏడాది రూ.10 వేల చొప్పున 46.85 లక్షల మందికి రూ.4,685.84 కోట్లే..
కానీ బడ్జెట్‌లో మాత్రం రూ.6,309.44 కోట్లు చెల్లించేశామని వెల్లడి
కౌలు రైతులకు తొలి రెండేళ్లూ పైసా పెట్టుబడి సాయం అందించని వైనం
ఈ ఏడాది వారి ఊసెత్తకుండానే వ్యవసాయ బడ్జెట్ ప్రసంగం
ఇదీ హామీ
వైఎస్ జగన్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఏటా రూ.13,500 మాత్రమే ఇస్తోంది. ఇందులో రూ.6 వేలు కేంద్రమే ఇస్తోంది. అదే మాకు అధికారం ఇస్తే కేంద్రం ఇచ్చేది కాకుండా ఏటా రూ.20 వేలు అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తాం. – ఎన్నికల మేనిఫెస్టోలో, ఊరూరా చంద్రబాబు అండ్ కో ప్రచారం
ఆచరణలో వాస్తవం
అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా పూర్తిగా రూ.20 వేలు ఎగ్గొట్టారు. రెండో ఏడాది కేంద్రం ఇచ్చే సాయంతో కలుపుకుని రూ.10 వేలు మాత్రమే అందించారు. అదీ కొంత మంది రైతులకే. కౌలు రైతులకైతే పైసా ఇవ్వలేదు. కానీ రైతులకు రూ.20 వేలు సాయం అందించామని బడ్జెట్ సాక్షిగా నిస్సిగ్గుగా ప్రచారం. మొత్తంగా రూ.30 వేలు బకాయి.
సాక్షి, అమరావతి : తమకు అధికారం ఇస్తే అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి ఏడాది నుంచే ప్రతీ రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామంటూ ఎన్నికల సభల్లో హామీలు గుప్పించిన చంద్రబాబు.. తీరా అందలం ఎక్కాక అన్నదాతలకు పంగనామాలు పెడుతున్నారు. తొలి ఏడాది నిస్సిగ్గుగా పెట్టుబడి సాయానికి పూర్తిగా ఎగనామం పెట్టిందేకాక, రెండో ఏడాది అరకొరగా విదిల్చారు. కనీసం 2026–27లో అయినా పూర్తిగా ఇస్తారనుకుంటే అదీ లేదు.
ఈ బడ్జెట్‌లో కూడా ఈ పథకానికి అరకొర కేటాయింపులతోనే సరిపెట్టి అన్నదాత నోట్లో మట్టికొట్టారు. కౌలు రైతుల ఊసే ఎత్తలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందిన 53,58,366 మంది రైతుల వరకు లెక్కలోకి తీసుకున్నా.. ఏటా రూ.20 వేల చొప్పున తొలి రెండేళ్లలో ఒక్కో రైతుకు రూ.40 వేల పెట్టుబడి సాయం ఇవ్వాలి. ఈ లెక్కన రైతుల ఖాతాలకు రూ.21,433.46 కోట్లు జమ చేయాలి.
తొలి ఏడాది (2024–25) బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.1,000 కోట్లు కేటాయించి, పైసా ఖర్చు చేయలేదు. నిస్సిగ్గుగా 53.58 లక్షల మందికి రూ.10,717 కోట్లు ఎగ్గొట్టారు. రెండో ఏడాది (2025–26) బడ్జెట్‌లో రూ.6,300 కోట్లు కేటాయించి, రెండు విడతల్లో కలిపి రూ.10 వేల చొప్పున మాత్రమే 46,85,838 మంది రైతులకు రూ.4,685.54 కోట్లు జమ చేసి చేతులు దులుపుకున్నారు. అంటే దాదాపు 7 లక్షల మందికి ఎగనామం పెట్టారు.
రూ.16,746 కోట్లు ఎగవేత
పీఎం కిసాన్ కింద కేంద్రం ఇస్తున్న సాయాన్ని తన ఖాతాలో వేసుకొని, రెండు విడతల్లో రూ.14 వేలు జమ చేశామని చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. అంటే రెండేళ్లలో రైతులకు ఎగ్గొట్టిన మొత్తం రూ.16,746 కోట్లు. పైగా అర్హుల్లోనే లక్షలాది మంది రైతులు ఇంకా తమకు జమ కాలేదంటూ అర్జీలు ఇస్తున్నా పట్టించుకోవడం లేదు. కానీ బడ్జెట్ ప్రసంగంలో మాత్రం 46.86 లక్షల మంది రైతులకు రూ.6,309.44 కోట్లు జమ చేసేశామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం విస్మయ పరుస్తోంది.
2026–27 ఆర్థిక సంవత్సరంలోనైనా బకాయిలతో సహా పూర్తి స్థాయిలో కేటాయింపులు జరుపుతారనుకుంటే ఈసారీ అరకొరగానే విదిల్చారు. సూపర్ సిక్స్ హామీ మేరకు చూస్తేæ వాస్తవానికి ప్రతీ రైతుకు రూ.20 వేల చొప్పున 53.58 లక్షల మందికి ఏటా రూ.10,717 కోట్ల చొప్పున మూడేళ్లలో రూ.32,151 కోట్లు కేటాయింపులు జరపాలి.
కానీ తొలి ఏడాది బడ్జెట్‌లో వెయ్యి కోట్లు, రెండో ఏడాది బడ్జెట్‌లో రూ.6,300 కోట్లు కేటాయించగా.. రెండో ఏడాది జమ చేసిన రూ.4,685.84 కోట్లు మినహాయిస్తే అన్నదాతలకు చెల్లించాల్సిన పెట్టుబడి సాయం ఇంకా రూ.27,465 కోట్లకు పైమాటే. కానీ బడ్జెట్‌లో కేటాయించింది కేవలం రూ.6,600 కోట్లు మాత్రమే.
కౌలు రైతుల ఊసెత్తని ప్రభుత్వం
రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలుదారులు ఉంటారని అంచనా. పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా భూ యజమానులతో పాటు ప్రతి కౌలు రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని సూపర్ సిక్స్‌లో చంద్రబాబు అండ్ కో హామీ ఇచ్చింది. అయితే 2024–25లో భూ యజమానులతో పాటు కౌలు రైతులకూ ఎగ్గొట్టారు. రెండో ఏడాది 2025–26లో రెండు విడతల్లో రూ.10 వేలు అదీ భూ యజమానులకు మాత్రమే జమ చేశారు.
రెండో విడత సాయం ఇచ్చేటప్పుడు కౌలు రైతులకు ఒకేసారి రెండు విడతల సాయం అందిస్తామని నమ్మబలికారు. ఆ తర్వాత సీసీఆర్సీ కార్డుల జారీ ప్రక్రియ పూర్తికాగానే నవంబర్‌లో జమ చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ రబీ సీజన్ చివరి దశకు చేరుకున్నా, ఒక్క విడత సాయం కూడా కౌలు రైతులకు జమ చేసిన పాపాన పోలేదు.
జారీ చేసిన సీసీఆర్సీ కార్డుల ప్రకారం చూసుకున్నా 2024–25లో 9.13 లక్షల మందికి, 2025–26లో 8.24 లక్షల మందికి ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున.. మొత్తంగా రూ.40 వేలు పెట్టుబడి సాయం అందించాలి. అంటే రెండేళ్లలో కలిపి కౌలు రైతులకు రూ.3,474 కోట్లు జమ చేయాల్సి ఉంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026–27లో చెల్లించాల్సింది కూడా కలుపుకుంటే రూ.6 వేల కోట్లకు పైమాటే. కానీ బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా మంత్రి అచ్చెన్నాయుడు కౌలు రైతుల ఊసే ఎత్తకపోవడం గమనార్హం.


