తల్లికి 'వంచన' | Chandrababu govt once again deceived the mothers of school students | Sakshi
Sakshi News home page

తల్లికి 'వంచన'

Feb 15 2026 4:17 AM | Updated on Feb 15 2026 4:17 AM

Chandrababu govt once again deceived the mothers of school students

మరోసారి మహిళలను మోసం చేసిన చంద్రబాబు సర్కారు 

తల్లికి వందనం కింద మూడేళ్లలో రూ.24,504.39 కోట్లు ఎగవేత

ఈ బడ్జెట్‌లో రూ.9,668 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి ప్రకటన

కానీ, బడ్జెట్‌ ప్రతుల్లో మాత్రం రూ.8,457.07 కోట్లకు  మాత్రమే ప్రతిపాదన 

ఒక్కొక్కరికీ రూ.15వేల చొప్పున చెల్లించాలంటే రూ.13,112.82 కోట్లు అవసరం 

గత బడ్జెట్‌లో రూ.9,407 కోట్లు కేటాయించినా.. ఇచ్చింది మాత్రం రూ.6,377 కోట్లే   

ఫలితంగా 67.27 లక్షల మందికే పథకం వర్తింపు 

అది కూడా రూ.8 వేల నుంచి రూ.10 వేల లోపు మాత్రమే చెల్లింపులు 

తాజా 2026–27 బడ్జెట్‌ కేటాయింపుల్లోనూతల్లికి వందనంలో కోత తప్పదు.. 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాల  విద్యార్థుల తల్లులను చంద్రబాబు సర్కారు మరోసారి మోసం చేసింది. బడ్జెట్‌లో ‘తల్లికి వందనం’ అంటూనే వారిని వంచన చేస్తూ అంకెల గారడీని ప్రదర్శించింది. ఎన్నికల్లో అధికారం కోసం అడ్డగోలుగా అబద్ధపు హామీలిచ్చిన చంద్రబాబు ఇలా ఏటా బడ్జెట్‌లో మోసాన్ని పునరావృతం చేస్తుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది 87,41,885 మంది పిల్లలు పాఠశాలల్లో చదువుతుంటే కేవలం 67.27 లక్షల మందికి మాత్రమే ‘తల్లికి వందనం’ అమలుచేసి నిస్సిగ్గుగా గొప్పలు చెప్పుకున్నారు. 

మరోవైపు శనివారం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ బడ్జెట్‌ ప్రసంగంలోనూ ‘తల్లికి వంచన’ ప్రస్ఫుటంగా బయటపడింది. 2026–27 బడ్జెట్‌లోనూ ఎంతమంది పిల్లలకు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నారో చెప్పకుండా రూ.9,668 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే.. మంత్రి ప్రకటనకు, బడ్జెట్‌లో కేటాయింపులకు మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. ఆర్థిక మంత్రి రూ.9,668 కోట్లు పలికితే.. బడ్జెట్‌ ప్రతుల్లో రూ.8,457.07 కోట్లని పేర్కొన్నారు. 

మళ్లీ కొందరికే ‘వందనం’.. 
తల్లికి వందనం పథకంపై చంద్రబాబు సర్కారు కాకిలెక్కలు చెబుతోంది. ఎన్నికలప్పుడు అధికారమే పరమావధిగా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే వాళ్లందరికీ ఏటా రూ.15 వేలు ఇస్తామని విస్తృతంగా ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచి్చన తొలి ఏడాది ముఖం చాటేశారు. 2024–25లో రూ.5,387 కోట్లు కేటాయిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అలాగే, 2025–26 బడ్జెట్‌లో రూ.9,407 కోట్లు కేటాయించింది. ఇచ్చింది మాత్రం కేవలం రూ.6,377 కోట్లే. 

అంటే.. ఒకటి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లులకు రూ.8 వేలు, రూ.9 వేలు, రూ.10 వేలు చొప్పున మాత్రమే ఇష్టానుసారం ఖాతాల్లో వేసి మమ అనిపించింది. ఈ అరకొర సొమ్మును కూడా దాదాపు 21 లక్షల మందికి ఎగ్గొట్టింది. ఇప్పుడు కూడా మళ్లీ పాత సీన్‌నే పునరావృతం చేస్తూ తాజా బడ్జెట్‌లో రూ.9,668 కోట్లను కేటాయించింది.  

వాస్తవ వ్యయానికి దూరంగా.. 
నిజానికి.. 87.41 లక్షల మంది విద్యార్థుల తల్లులకు ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలంటే రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. కానీ, చంద్రబాబు సర్కారు ఎప్పటిలాగే అరకొరగా కేటాయించడం చూస్తుంటే ఈసారి కూడా తల్లులకు వంచన తప్పదని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే.. ఇప్పుడు కేటాయించిన బడ్జెట్‌ను ఉన్నది ఉన్నట్లు అమలుచేస్తే 65 లక్షల మంది పిల్లలకు మాత్రమే సరిపోతుంది. మిగిలిన విద్యార్థులకు కోత ఖాయం. 

ఇప్పటికే చంద్రబాబు తొలి ఏడాది తల్లికి వందనం పథకం ఎగ్గొట్టిన విషయం తెలిసిందే. రెండో ఏడాది అరకొరగా పంపిణీ చేశారు. ఇక ఈ సంవత్సరం బడ్జెట్‌లో కేటాయించిన మేరకు పూర్తిస్థాయిలో ఇచ్చినా రూ.3,444.82 కోట్లు ఎగ్గొట్టినట్లు అవుతుంది. మొత్తం మీద మూడేళ్లకు కలిపి రూ.24,504.39 కోట్లు తల్లికి వందనం రూపంలో తల్లులకు ఎగ్గొట్టారు. 

పాఠశాల విద్యకు వ్యయంలోనూ వెనకడుగే.. 
2026–27 బడ్జెట్‌లో పాఠశాల విద్యా రంగానికి కూటమి ప్రభుత్వం రూ.32,308.31 కోట్లు కేటాయించింది. ఇవన్నీ నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలకు సరిపోతాయి. అయితే, 2025–26 బడ్జెట్‌లో రూ.31,805.65 కోట్లు ప్రతిపాదించగా... సవరించిన అంచనా తర్వాత ఖర్చు దగ్గరకు వచ్చేసరికి ఆ మొత్తం రూ.30,175.13 కోట్లకు తగ్గిపోయింది. అంటే.. పాఠశాల విద్యకు కేటాయింపులే తక్కువ అనుకుంటే ఈ ప్రభుత్వం అందులో  చేస్తున్న ఖర్చు ఇంకా తక్కువగా ఉండటం విస్తుగొలుపుతోంది.

‘మనబడి–మన భవిష్యత్తు’ గాలికి.. 
‘నాడు–నేడు’ వంటి బృహత్తర కార్యక్రమంతో గత ప్రభుత్వంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చేశారు. రెండు విడతల్లో దాదాపు రూ.8 వేల కోట్ల బడ్జెట్‌తో 23 వేల ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలను  అత్యాధునిక విద్యాలయాలుగా తీర్చిదిద్దేందుకు సంకల్పించారు. గత ప్రభుత్వంలోనే రూ.4 వేల కోట్ల పనులు పూర్తి చేశారు. మిగిలిన పనులు పూర్తవ్వాలంటే మరో రూ.4 వేల కోట్లు అవసరం. 

కానీ, చంద్రబాబు ప్రభుత్వం అక్కసుతో ఆ పథకం పేరును ‘మనబడి–మన భవిష్యత్తు’గా మార్చింది తప్ప పైసా ఖర్చు చేయలేదు. 2024–25 బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించింది గానీ ఆ డబ్బులతో ఒక్క ఇటుక కూడా వేయలేదు. అలాగే, 2025–26 బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు చూపించినా ఆ తర్వాత దానిని రూ.772 కోట్లకు కుదించింది. ఇప్పుడు మళ్లీ రూ.1,500 కోట్లు కేటాయించినా దానితో పాఠశాలల రూపరేఖలు పెద్దగా మారే పరిస్థితిలేదు. 

మరోవైపు.. గతంలో పూర్తయిన పనులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులే సుమారు రూ.1,200 కోట్లు ఉన్నట్లు అంచనా. ఇక ప్రభుత్వ బడులకు ‘స్టార్‌ రేటింగ్‌’ పేరుతో చంద్రబాబు హడావుడి చేయడం తప్ప అక్కడ మౌలిక వసతులు క్షీణిస్తున్నాయి. చంద్రబాబు తీసుకొచి్చన స్టార్‌ నిబంధనల ప్రకారం పాఠశాలలు ఉండాలంటే సుమారు రూ.12 వేల కోట్ల బడ్జెట్‌ అవసరమని తెలుస్తోంది.   

బడ్జెట్‌ తగ్గిపోతోంది.. 
ఇదిలా ఉంటే.. గత మూడు బడ్జెట్‌లు చూస్తే చంద్రబాబు పాలనలో పాఠశాల విద్య కేటాయింపులు కుచించికుపోతున్నాయి. 2024–25 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ రూ.2.94 లక్షల కోట్లతో ఉంటే.. ఇందులో పాఠశాల విద్యకు రూ.29,909.31 (10.15 శాతం) నిధులు కేటాయించారు. ఖర్చు పెట్టింది మాత్రం రూ.28,560.64 కోట్లే. అలాగే, 2025–26లో రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రకటించినా పాఠశాల విద్యకు రూ.31,805 కోట్లు (9.86 శాతం) కేటాయించారు. ఇక 2026–27కి వచ్చేసరికి 3.32 లక్షల కోట్ల బడ్జెట్‌లో పాఠశాల విద్య వాటా రూ.32,308.31 (9.75 శాతం) కోట్లకు పరిమితమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement