బడ్జెట్‌కు సుస్తీ ఆరోగ్యానికి అంతంతే | Chandrababu govt has imposed huge cuts in the medical and health department budget | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌కు సుస్తీ ఆరోగ్యానికి అంతంతే

Feb 15 2026 4:12 AM | Updated on Feb 15 2026 4:12 AM

Chandrababu govt has imposed huge cuts in the medical and health department budget

ఆరోగ్య ఆసరాకు పైసా కూడా విదల్చని బాబు సర్కారు

ఆసరా సాయానికి రూ.450 కోట్లపైనే అవసరం  

ఇప్పటికే రూ.900 కోట్లు ఎగ్గొట్టిన ప్రభుత్వం  

మందులకు రూ.820 కోట్లకు పైగా అవసరం కాగా.. కేటాయించింది రూ.600 కోట్లే 

సర్జికల్స్‌ కోసం అడిగిన మొత్తంలో రూ.100 కోట్లకు పైనే కోత 

సాక్షి, అమరావతి: ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ బడ్జెట్‌లో చంద్రబాబు ప్రభుత్వం భారీగా కోతలు విధించింది. 2025–26 బడ్జెట్‌లో రూ.19,264 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించినట్టు చూపిన టీడీపీ కూటమి సర్కారు.. ఖర్చుల్లో రూ.1,626 కోట్ల మేర కోత పెట్టింది. ఈ విషయాన్ని సవరించిన గత ఏడాది బడ్జెట్‌ స్పష్టం చేసింది. 2026–27 బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లకు పైగా బడ్జెట్‌ కేటాయింపులు అవసరమని వైద్య శాఖ ప్రతిపాదించగా.. ప్రభుత్వం భారీగా కోత పెట్టింది. 

ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.19,306 కోట్లు కేటాయిస్తున్నట్టు చూపింది. గత ఏడాది కేటాయించిన మొత్తంలో రూ.1,626 కోట్లు కోత పెట్టిన దృష్ట్యా.. ఈ ఏడాది బడ్జెట్‌లో మరింత ఎక్కువ మొత్తం కోత పెడతారనే భయాందోళన వ్యక్తమవుతోంది. మందుల కొనుగోళ్లకు రూ.820 కోట్లకు పైగా అవసరమని.. సర్జికల్స్‌కు రూ.320 కోట్లు కావాలని ప్రతిపాదించగా.. మందుల బడ్జెట్‌లో రూ.220 కోట్లు, సర్జికల్స్‌కు రూ.100 కోట్ల పైగానే కోత విధించి అరకొర నిధులనే విదిల్చింది. 

ఆసరా సాయానికి ‘సున్నా’   
వైఎస్‌ జగన్‌ ప్రభు­త్వంలో ప్రవేశపెట్టిన ఆరోగ్య ఆసరా సాయా­నికి ఈ బడ్జెట్‌లో కేటాయింపులే లేకుండా చేశారు. అనారోగ్యం బారినపడి ఆరోగ్య­శ్రీ కింద చికిత్స పొందిన రోగులకు కోలుకునే సమయంలో ఆరి్థకంగా చేదోడుగా నిలిచేలా ‘ఆరోగ్య ఆసరా’ పథకాన్ని గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రవే­శపెట్టింది. చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే ఆరో­గ్యశ్రీ స్థానంలో బీమాను ప్రవేశపెడతామని ప్రకటించారు. అప్పుడే ఆరో­గ్య ఆసరాకు ఉద్వాసన పలకాలని నిర్ణయించారు. 

ఈ నేపథ్యంలో 2024 నుంచే ఆరోగ్యశ్రీలో చికిత్స పొందిన రోగులకు ఆసరా చెల్లింపులను నిలిపివేశారు. ఈ పథకానికి 2025–26 బడ్జెట్‌లో కేవలం రూ.లక్ష మాత్రమే కేటాయించారు. ప్రస్తుత బడ్జెట్‌లో ఏకంగా కేటాయింపులే లేకుండా ఇకపై ఆసరా అమలు చేసే ఉద్దేశమే లేదని, తాను పేదల వ్యతిరేకినని మరోమారు చంద్రబాబు రుజువు చేసుకున్నారు. వాస్తవానికి ఈ పథకం కోసం ప్రభుత్వం ఏటా రూ.450 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. పథకానికి ఉద్వాసన పలికి పేదలకు రెండేళ్లలో రూ.900 కోట్లకు పైగా సాయాన్ని చంద్రబాబు ఎగ్గొట్టారు. 

వాస్తవానికి ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన రోగులకు వైద్యులు సూచించిన విశ్రాంత సమయానికి నెలకు గరిష్టంగా రూ.5 వేల చొప్పున ఆసరా సాయం అందించాల్సి ఉంది. ఇప్పుడు ఆసరాతో పాటు ఆరోగ్య­శ్రీకి కూడా చంద్ర గ్రహణం పట్టుకుంది. గతంలో రోగి/బంధువు ఖాతాల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 24 గంటల్లో ఆసరా సాయాన్ని జమ చేసేవారు. 

ఇలా 2019–24 మధ్య వైఎస్‌ జగన్‌ పాలన ఐదేళ్లలో 24,59,090 మందికి రూ.1,465.67 కోట్ల మేర ఆర్థిక సాయం అందించారు. కానీ బీమా రాగం అందుకున్న బాబు నెట్‌­వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేశారు. ఆరోగ్యశ్రీ చికిత్స అందించిన ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.3 వేల కోట్లకు పైగా బకాయి పడింది. బకాయిలను చెల్లించేలా బడ్జెట్‌లో అదనపు నిధులను కేటాయించకపోవడం గమనార్హం.  

కొత్త వైద్య కళాశాలల ఊసేదీ..? 
2026–27 బడ్జెట్‌లో కొత్త వైద్య కళాశాలల ఊసే లేకుండా చేశారు. గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టిన 10 వైద్య కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెట్టాలని చంద్రబాబు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే 4 కళాశాలలకు టెండర్లు పిలవగా సరైన స్పందన రాలేదు. కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టాలన్న ప్రభుత్వ కుట్రలతో 2024–25లో 700 ఎంబీబీఎస్‌ సీట్లు, 2025–26లో 1,450 చొప్పున రెండేళ్లలో 2450 ఎంబీబీఎస్‌ సీట్లను రాష్ట్ర విద్యార్థులు కోల్పోయారు. 

ఈ పరిస్థితుల్లో 10 వైద్య కళాశాలల ప్రారంభంపై ఈ బడ్జెట్‌లోనైనా స్పష్టత వస్తుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూశారు. అయితే.. బడ్జెట్‌లో కొత్త వైద్య కళాశాలల ప్రస్తావనే లేకుండాపోయింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో రూ.8,480 కోట్ల అంచనాలతో 17 వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2024 ఎన్నికల నాటికి వైద్య కళాశాలల్లో రూ.3 వేల కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. 

అప్పటికే కొన్ని కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఏడాదికి రూ.వెయ్యి కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే ప్రభుత్వ రంగంలోనే కళాశాలలన్నీ అందుబాటులోకి వస్తాయి. ఈవెంట్లు, మంత్రులు, సీఎం విలాసాలు, ఇతర కార్యక్రమాలకు రూ.కోట్ల ప్రజాధనాన్ని దురి్వనియోగం చేస్తున్న ప్రభుత్వం వైద్య కళాశాలలకు మాత్రం నిధులు లేవంటూ ప్రైవేట్‌కు కట్టబెడుతోంది. 

పేదలను వంచించడమే.. 
దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగానికి నిధులు 10 శాతానికి పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం నిధులు తగ్గిస్తోంది. ప్రస్తుత బడ్జెట్‌లో కేవలం 5.8 శాతం నిధులు మాత్రమే ఆరోగ్య రంగానికి కేటాయించారు. ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తోందనడానికి ఈ కేటాయింపులే నిదర్శనం. వైద్య రంగానికి నిధులు తగ్గించడం పేద ప్రజలను వంచించడమే. – డాక్టర్‌ అంబటి నాగరాధాకృష్ణ యాదవ్, విజయవాడ

ఆరోగ్యశ్రీ బకాయిల మాటేమిటి?
ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన బకాయిలే రూ.3 వేల కోట్లు ఉంటే.. ప్రస్తుత బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.4 వేల కోట్లు కేటాయించడంపై ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌(ఏపీ ఆశా) ఆందోళన వ్యక్తం చేసింది. తమ బకాయిలు చెల్లించడానికి ఎటువంటి నిర్దిష్ట, దిద్దుబాటు చర్యలు ప్రభుత్వం చేపట్టడం లేదని శనివారం ఒక ప్రకటనలో మండిపడింది. 

దీనివల్ల రాష్ట్రంలోని స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని తెలిపింది. బకాయిల చెల్లింపుపై స్పష్టమైన రోడ్‌ మ్యాప్‌ ఇవ్వాలని ఇటీవలే హైకోర్టు సైతం ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయాన్ని గుర్తు చేసింది. ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ప్రజలకు సేవలు అందించడం అసాధ్యమని పేర్కొంది. బకాయిలను దశల వారీగా, నిర్ణీత సమయంలో విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement