సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు సర్కార్ తీరు
వెలిగొండ, చింతలపూడి తొలి దశ, వంశధార స్టేజ్–2 ఈ ఏడాదే పూర్తి చేస్తామంటూ బీరాలు
హంద్రీ–నీవా ఆయకట్టుకూ ఈ ఏడాదే నీళ్లందిస్తామంటూ పదే పదే ప్రకటనలు
గోదావరి పుష్కరాలకు ముందే 2027 జూన్‌కే పోలవరం పూర్తి చేస్తామంటూ ప్రచారం
కానీ.. వాటిని పూర్తి చేసేలా బడ్జెట్‌లో సరిపడా నిధులు కేటాయించడంలో విఫలం
జల వనరుల శాఖకు ఈ బడ్జెట్‌లో రూ.18,223.67 కోట్లు కేటాయింపు
ఇందులో భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు రూ.17,352 కోట్లు.. చిన్న నీటి వనరులకు రూ.870.76 కోట్లు
కేంద్రం నుంచి పోలవరానికి రూ.5,139.35 కోట్లు వస్తాయని అంచనా
కానీ.. కేంద్ర బడ్జెట్‌లో పోలవరానికి కేటాయించింది రూ.3,320.49 కోట్లే
కాడ్వామ్, స్పర్శ్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి నిధులు రాబడతామని బడ్జెట్‌లో పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం
గత 2025–26 బడ్జెట్లో జల వనరుల శాఖకు రూ.18,019.66 కోట్లు కేటాయింపు
కానీ.. వాటిని సవరిస్తూ రూ.14,751.67 కోట్లకు పరిమితం చేసిన వైనం
ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని సర్కారు
సాక్షి, అమరావతి : సాగు నీటి ప్రాజెక్టులపై చంద్రబాబు సర్కార్ చెబుతున్న మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతనే ఉండదన్నది మరోసారి నిరూపితమైంది. ఈ ఏడాదే వెలిగొండ, చింతలపూడి ఎత్తిపోతల తొలి దశ, వంశధార స్టేజ్–2 ప్రాజెక్టులను పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తామని.. హంద్రీ–నీవా ఆయకట్టులో ప్రతి ఎకరాకూ నీళ్లందిస్తామని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతూ వస్తున్నారు. గోదావరి పుష్కరాలకు ముందే అంటే 2027 జూన్ నాటికే పోలవరాన్ని పూర్తి చేస్తామని చెబుతున్నారు.
కానీ.. ఆ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి బడ్జెట్‌లో సరిపడా నిధులు కేటాయించడాన్ని మాత్రం విస్మరించారు. దీన్ని బట్టి ఆ ప్రాజెక్టులను పూర్తి చేయడంపై చంద్రబాబు సర్కార్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జల వనరుల శాఖకు 2024–25 బడ్జెట్‌లో 16,705.32 కోట్లు కేటాయించి.. రూ.11,197.17 కోట్లు ఖర్చు చేశారు. అంటే.. తొలి ఏడాది బడ్జెట్‌లో కేటాయించిన నిధుల కంటే రూ.5,508.15 కోట్లను తక్కువగా ఖర్చు చేసినట్లు స్పష్టమవుతోంది.
2025–26 బడ్జెట్‌లో రూ.18,019.66 కోట్లు కేటాయించి, తర్వాత రూ.14,751.67 కోట్లకు సవరించారు. అంటే.. గతేడాది బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో రూ.3,267.99 కోట్లను కోత వేసినట్లు స్పష్టమవుతోంది. సవరించిన కేటాయింపుల్లో ఏమాత్రం ఖర్చు చేశారన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుత (2026–27) బడ్జెట్‌లో జల వనరుల శాఖకు రూ.18,223.67 కోట్లు కేటాయించారు.
ఇందులో భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు రూ.17,352.91 కోట్లు, చిన్న నీటి పారుదలకు రూ.870.76 కోట్లు కేటాయించారు. 2024–25, 2025–26 బడ్జెట్‌లలో కేటాయింపులు, చేసిన వ్యయాన్ని బట్టి చూస్తే.. ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించిన మేరకు సాగు నీటి ప్రాజెక్టులకు నిధులు ఖర్చు చేయడం అనుమానమేననే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.
అంతా అంకెల గారడీయే.. చిత్తశుద్ధి ఏదీ?
» పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికే పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. కానీ.. 2024–25లో కేంద్రం అడ్వాన్సుగా ఇచ్చిన రూ.5,052.71 కోట్లను సది్వనియోగం చేసుకుని పోలవరం పనులను పరుగులెత్తించడంలో సర్కార్ విఫలమైంది. ఆ నిధులకు సంబంధించిన యూసీలను పంపక పోవడంతో 2025–26 బడ్జెట్‌లో పోలవరానికి కేటాయించిన రూ.5,936 కోట్లలో కేంద్రం కోత వేసి రూ.3,017.20 కోట్లను మాత్రమే కేటాయిస్తూ సవరించింది.
» ఆ నిధులను ఇప్పటిదాకా విడుదల చేయలేదు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం 45 రోజుల సమయం మాత్రమే మిగిలింది. కానీ.. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రూ.3,745.95 కోట్లను ఖర్చు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం.
» 2026–27 బడ్జెట్‌లో పోలవరానికి కేంద్రం రూ.3,320.39 కోట్లు కేటాయిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వాటిని రూ.5,139.35 కోట్లుగా చూపడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే పోలవరానికి నిధుల కేటాయింపులో అంకెల గారడీ చేసినట్లు స్పష్టమవుతోంది. ఆ ప్రాజెక్టులో గరిష్ఠ నీటి మట్టం 45.72 మీటర్ల (194.6 టీఎంసీల నిల్వ)తో కాకుండా 41.15 మీటర్ల (119.4 టీఎంసీలు) ఎత్తుతోనే నిల్వ చేసేలా పూర్తి చేస్తామని కేంద్ర కేబినెట్ తీర్మానం చేస్తే.. దాన్ని చంద్రబాబు సర్కార్ ఆమోదించడం గమనార్హం.
» తద్వారా పోలవరం రిజర్వాయర్‌ను బ్యారేజ్‌గా మార్చేయడమే కాదు.. ఆ ప్రాజెక్టును కేంద్రం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించక పోవడంపై సాగు నీటి రంగ నిపుణులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరాంధ్రపై శీత కన్ను
» వెనుకబడిన ఉత్తరాంధ్రపై చంద్రబాబు సర్కార్ యధా ప్రకారం శీత కన్ను వేసింది. వంశధార స్టేజ్–2 ప్రాజెక్టే కాదు.. మహేంద్ర తనయ, తారకరామ తీర్థ సాగరం ప్రాజెక్టులను పూర్తి చేసేలా నిధులను కేటాయించలేదు. తోటపల్లి ప్రాజెక్టు, మడ్డువలస, జంఝావతి ప్రాజెక్టుల కింద మిగిలిన ఆయకట్టుకు నీళ్లందించడానికి అవసరమైన పనులు చేపట్టేందుకు సరిపడా నిధులు కేటాయించలేదు. వాటికి కేటాయించిన అరకొర నిధులు కూడా కాడ్వామ్, స్పర్శ్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి వస్తాయని చెప్పి చేతులు దులిపేసుకుంది.
» ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు గత బడ్జెట్‌లో రూ.605.75 కోట్లు కేటాయించి, వాటిని రూ.99.66 కోట్లకు సవరించింది. కానీ.. ఆ కాస్త నిధులను కూడా ఖర్చు చేసిన దాఖలాలు లేవు. ఈ బడ్జెట్‌లోనూ గత బడ్జెట్‌లో కేటాయించినట్లే రూ.605.75 కోట్లే ఆ ప్రాజెక్టుకు కేటాయించడం గమనార్హం. దీన్ని బట్టి ఆ ప్రాజెక్టుకు ఈ ఏడాదీ నిధులను ఖర్చు చేసే ఉద్దేశం లేదని స్పష్టమవుతోంది.
కాగితాల్లోనే ప్రాధాన్యత
» ప్రాధాన్యత క్రమంలో సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని.. ఈ ఏడాది వెలిగొండ, చింతలపూడి తొలి దశ, వంశధార స్టేజ్–2, హంద్రీ–నీవాను పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తామని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయితే అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి.
» వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి రూ.992 కోట్లు, ఫీడర్ ఛానల్ లైనింగ్ పనులకు రూ.456 కోట్లు (మొత్తం రూ.1,448) అవసరం. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు కేవలం రూ.492.90 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం.
» తద్వారా ఈ ఏడాది జూన్‌లోనూ వెలిగొండ ప్రాజెక్టుకు నీటి విడుదల జరగదని స్పష్టమవుతోంది. ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయాలనే లక్ష్యంతో వెలిగొండ ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన టన్నెళ్ల పనులను 2023 నాటికే వైఎస్ జగన్ సర్కార్ పూర్తి చేసింది.
2024 జూన్‌లోగా నల్లమలసాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించి, 2024 ఆగస్టులో శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను వెలిగొండ ప్రాజెక్టు ద్వారా దుర్భిక్ష ప్రాంతాలకు అందించడానికి ప్రణాళిక రూపొందించింది. కానీ.. వైఎస్ జగన్‌కు మంచి పేరొస్తుందనే దుర్బుద్ధితో ఆ ప్రణాళికను చంద్రబాబు సర్కార్ తుంగలో తొక్కి, వెలిగొండ ఆయకట్టు రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని సాగు నీటి రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
» ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించేలా చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను జలయజ్ఞంలో భాగంగా అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. కానీ.. 2016లో ఎలాంటి పర్యావరణ, అటవీ అనుమతులు తీసుకోకుండానే ఆ ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచి.. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద 2.80 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేలా చంద్రబాబు సర్కార్ పనులు చేపట్టింది.
పర్యావరణ అనుమతి లేకుండా చేపట్టిన చింతలపూడి పనులను ఆపేయాలని ఎన్జీటీ ఆదేశించింది. రూ.73.63 కోట్లు జరిమానా విధించింది. 2024లో సుప్రీంకోర్టు ఇచ్చిన వెసులుబాటుతో పర్యావరణ అనుమతి తీసుకుని చింతలపూడి పనులు ప్రారంభించవచ్చు. కానీ.. ఇప్పటిదాకా పర్యావరణ అనుమతిపై చంద్రబాబు సర్కార్ దృష్టి సారించకపోవడం గమనార్హం. ఈ ఎత్తిపోతలకు కేటాయించిన రూ.430 కోట్లు తొలి దశ పనులు పూర్తి చేయడానికి ఏమూలకు సరిపోవు. పర్యావరణ అనుమతి వచ్చేదెన్నడు.. ఎత్తిపోతల పూర్తయ్యేదెన్నడు?.. తొలి దశ కింద రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించేదెన్నడు? అని రైతాంగం ప్రశ్నిస్తోంది.
» వంశధార స్టేజ్–2 పనులను జలయజ్ఞంలో భాగంగా అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. వెనుకబడి ఉత్తరాంధ్రలో 2.50 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీళ్లందించేలా పనులు చేపట్టారు. 2009 నాటికే సింహభాగం పనులు పూర్తయ్యాయి. కాట్రగడ్డ సైడ్ వియర్‌తో ప్రాజెక్టు పూర్తి ఫలాలు అందవు. వంశధార ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చినా నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా సర్కార్ ససేమిరా అంటోంది.
ఆ వివాదం సుప్రీంకోర్టులో ఉండటంతో వంశధార ట్రిబ్యునల్ అవార్డును కేంద్రం ఇప్పటిదాకా అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో గొట్టా బ్యారేజీ జల విస్తరణ ప్రాంతం నుంచి హీరమండలం రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసి.. వంశధార ఆయకట్టులో రెండు పంటలకు నీళ్లందించేలా హీర మండలం ఎత్తిపోతలను 2023లో వైఎస్ జగన్ చేపట్టారు. అప్పట్లోనే సింహభాగం పనులు పూర్తయ్యాయి.
మిగిలిన పనులు పూర్తి చేయడంలో చంద్రబాబు సర్కార్ 20 నెలలుగా విఫలమైంది. గత బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.182.52 కోట్లు కేటాయించి.. ఆ తర్వాత రూ.వంద కోట్లకు సవరించింది. వాటిని కూడా ఖర్చు చేయలేదు. ప్రస్తుత బడ్జెట్‌లో 182.14 కోట్లు కేటాయించింది. వాటిని ఏమాత్రం ఖర్చు చేస్తుందన్నది వేచి చూడాల్సిందే.
» హంద్రీ–నీవాకు ప్రస్తుత బడ్జెట్‌లో రూ.2,621.70 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.900 కోట్లు విద్యుత్ చార్జీలకు కేటాయించారు. అంటే.. పనులు, భూ సేకరణకు కేటాయించింది రూ.1,721.7 కోట్లే. హంద్రీ–నీవాలో అంతర్భాగంగా జీడిపల్లి–భైరవానితిప్ప ఎత్తిపోతల, అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల, నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కళ్యాణి డ్యాంకు నీటిని తరలించేలా ఎత్తిపోతలకు ఎన్ని నిధులు ఇస్తారు.. 6.02 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డి్రస్టిబ్యూటరీల (పిల్ల కాలువలు) పనులకు ఏమాత్రం నిధులు కేటాయిస్తారు.. అన్నది స్పష్టంగా లేదు.
దీన్ని బట్టి, ఆయకట్టుకు నీళ్లందించడంపై ఈ సర్కార్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నది స్పష్టమవుతోంది. రాయలసీమను హార్టి కల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.300 కోట్ల విదేశీ రుణంతో ప్రాజెక్టులను చేపడతామని ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది. అయితే ఆ రుణం ఏ అంతర్జాతీయ ఆర్థిక సంస్థ నుంచి తెస్తుందన్నది స్పష్టత లేదు.


