ఈసీని ప్రశ్నించిన టీఎంసీ ఎంపీ
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం ఉపయోగించనున్న ఏఐ అప్లికేషన్ అనుమానం కలుగుతోందని టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే అన్నారు. యాప్, దాని కార్యాచరణగురించి ఎటువంటి వివరాలు అందుబాటులో లేవన్నారు. ‘బెంగాల్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ సమయంలో ఏఐ యాప్‌ను ఉపయోగిస్తున్నామని ఎన్నికల సంఘం చెబుతోంది.
ఈ యాప్‌ను ఎవరు తయారు చేశారు? దాని కార్యాచరణకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఎందుకు లేవు’అని గోఖలే ప్రశ్నించారు. యాప్ డెవలపర్, అమ్మిన సంస్థ వివరాల గురించి తాను ప్రయత్నించానని, ఇప్పటికే ఉన్న సాఫ్ట్‌వేర్‌లు బాగా పనిచేయగలిగినప్పుడు, నకిలీలను గుర్తించడానికి ఏఐ అవసరమేంటని ఆయన ప్రశ్నించారు. 2019లో మహారాష్ట్రలోనూ బీజేపీ ఐటీ సెల్‌తో అనుబంధం ఉన్న ఓ ఏజెన్సీని ఈసీఐ నియమించుకున్న విషయాన్ని తాను బయటపెట్టానని చెప్పారు. బయటినుంచి వెయ్యిమంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 50 మంది సాఫ్ట్‌వేర్ డెవలపర్లను నియమించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈసీఐకి రాసిన లేఖను ఆయన ప్రస్తావించారు.


