అగ్రనటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ సీబీఐ విచారణ కొనసాగుతోంది. తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటన కేసులో ఆయన్ని దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది. ర్యాలీ అనుమతులు, టైమింగ్, విజయ్ హాజరైన టైం.. ఆ టైంలో ఏం జరిగింది?.. నిర్వహణలో లోపాలు తదితర అంశాలపై ఆయన నుంచి వివరాలు రాబడుతన్నట్లు సమాచారం.
విజయ్ సీబీఐ విచారణ నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఆయన అరెస్ట్ కావొచ్చంటూ నిన్నటి నుంచి ప్రచారం నడుస్తోంది. అయితే విచారణకు విజయ్ పూర్తిగా సహకరిస్తారని.. అలాంటిదేం ఉండకపోవచ్చని టీవీకే కీలక నేతలు అంటున్నారు. మరోవైపు ఢిల్లీ సీబీఐ కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.
కిందటి ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన కరూర్‌లో జరిగిన టీవీకే ర్యాలీలో 41 మంది మరణించిన సంగతి తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఈ ఘటన.. ఆ రాష్ట్ర రాజకీయాల్లోనే పెను విషాదాన్ని మిగిల్చింది. అదే సమయంలో ర్యాలీ నిర్వహణలో టీవీకే విఫలం కావడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విజయ్ ఎన్నికల ర్యాలీ వాహనాన్ని సీబీఐ సీజ్ చేసింది. పలువురు నేతలను సైతం ప్రశ్నించింది. ఇక సీబీఐ విచారణను చెన్నైలో కాకుండా ఢిల్లీలో నిర్వహించడంపై రాజకీయ పరమైన చర్చ నడుస్తోంది. ప్రత్యేక విమానంలో ఈ ఉదయం చెన్నై నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్లారాయన. ఆయన వెంట పార్టీ కీలక నేతలు కొందరు ఉన్నారు. సీబీఐ దర్యాప్తు దరిమిలా విజయ్ నల్ల దుస్తులతో రావడంతో.. నిరసనకు ప్రతీక అనే అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఇదీ చదవండి: అటు సెన్సార్‌బోర్డు.. ఇటు సీబీఐ!


