అగ్రనటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇవాళ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ముందు హాజరు కానున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటన కేసులో ఆయన్ని దర్యాప్తు సంస్థ ప్రశ్నించనుంది. సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. అయితే విచారణ వేళ.. ఆయన్ని అరెస్ట్ చేస్తారంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది.
తమిళనాడు చరిత్రలోనే కరూర్ తొక్కిసలాట ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. సెప్టెంబర్ 27వ తేదీన టీవీకే(Tamilaga Vettri Kazhagam) ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. ఇరుకు సందులో ర్యాలీ నిర్వహించడం, ఆ ర్యాలీకి విజయ్ చాలా ఆలస్యంగా రావడం, అప్పటికే అక్కడికి జనం తండోప తండాలుగా చేరుకోవడం, ఎండలో తిండి, నీళ్ల లేకపోవడంతో సొమ్మసిల్లి పడిపోవడం.. వాళ్లకు సాయంగా విజయ్ వాటర్ బాటిళ్లు విసరడం.. ఆ గందరగోళంలోనే ఆంబులెన్స్ రాకతో జనం మధ్య తొక్కిసలాట జరిగిందని పోలీసుల దర్యాప్తులో ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. అయితే..
ఈ ఘటనపై అధికార డీఎంకే, టీవీకే పరస్పరం నిందించుకున్నాయి. కరూర్ ఘటన వెనుక కుట్ర దాగి ఉందని స్టాలిన్ సర్కార్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తోంది టీవీకే. దీని వెనుక కుట్ర దాగి ఉందని అంటోంది. అయితే విజయ్ నిర్లక్ష్య వైఖరి వల్లే ఘటన జరిగిందని డీఎంకే కౌంటర్ ఇస్తోంది కూడా. ఈ ఆరోపణ ప్రత్యారోపణల నడుమ.. దర్యాప్తు కూడా కీలక మలుపులు తిరిగింది.
కరూర్ తొక్కిసలాటకు కారణాలు తేల్చాలని ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు సిట్‌ను ఏర్పాటు చేసింది. అయితే దీనిని టీవీకే సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో.. కేసు సీబీఐని చేరింది. అదే సమయంలో తమిళనాడు ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్‌ను సైతం సర్వోన్నత న్యాయస్థానం కొట్టిపారేసింది.
విజయ్ సీబీఐ విచారణకు హాజరవుతున్న వేళ.. అటు సెన్సార్‌బోర్డుతో మరో వివాదం నడుస్తోంది. పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో ఆయన చివరి చిత్రంగా ప్రచారం జరుగుతున్న జన నాయగన్‌పై రాజకీయ దుమారం రేగింది. పొంగల్ బరిలో ఉన్న ఈ చిత్రం.. చివరి నిమిషంలో అనూహ్యంగా సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరణకు గురై సినీ ప్రియులకు పెద్ద షాకే ఇచ్చింది. ఆపై ఈ పంచాయితీ న్యాయస్థానాలకు చేరి.. అక్కడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వెరసి.. సినిమా విడుదల తేదీగా సంగ్దిగ్దం నెలకొంది. అయితే ఈ అంశంపై ఇటు విజయ్‌గానీ, అటు టీవీకేగానీ ఎక్కడా అధికారికంగా స్పందించడం లేదు.
మరో మూడు, నాలుగు నెలలలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో టీవీకే పోటీ చేయబోతోంది. ఇప్పటికే డీఎంకేను తన రాజకీయ శత్రువు.. బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా విజయ్ ప్రకటించుకున్నారు. ఎవరితోనూ పొత్తులుండబోవని.. సింహం సింగిల్‌గానే వస్తుందంటూ పంచ్ లైన్లు విసిరారు. అయితే..
అధికార డీఎంకేను ఓట్లను చీల్చగలిగే సత్తా అన్నాడీఎంకే కంటే విజయ్ టీవీకే పార్టీకే ఎక్కువగా ఉందని జాతీయ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే కరూర్ ఘటన తర్వాత పోటాపోటీగా విజయ్‌కు సంఘీభావం ప్రకటించాయి. ఓవైపు హద్దులు దాటకుండా విజయ్‌పై విమర్శలు గప్పిస్తున్నాయి రెండు పార్టీలు. అదే సమయంలో రాహుల్ గాంధీకి విజయ్‌తో మంచి స్నేహం ఉందని కాంగ్రెస్, అమిత్ షాతోనూ విజయ్ టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ, టీవీకే మాత్రం పొత్తులు ఉండవ్ అని లైన్ మీదే ప్రస్తుతానికి నిలబడింది.
ఈ క్రమంలో.. సెన్సార్‌బోర్డు, సీబీఐలను బూచిగా చూపించి విజయ్‌ను తమ వైపు లాక్కునే కుట్ర జరుగుతోందనే ప్రచారం ఊపందుకుంది. ఈ విషయంలో బీజేపీపై కాంగ్రెస్ నేరుగానే విమర్శల గుప్పిస్తోంది. సీబీఐ, ఈడీ, ఐటీ తరహాలోనే సెన్సార్‌బోర్డును అడ్డుపెట్టుకుని కేంద్రం రాజకీయాలు నడుపుతోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరోక్షంగా జన నాయగన్ వివాదంపై స్పందించడం కొసమెరుపు. అయితే.. బీజేపీ, తమిళనాడు మిత్రపక్షం అన్నాడీఎంకే ఆ ఆరోపణలను ఖండిస్తున్నాయి.
తమిళనాడు బీజేపీ సీనియర్ నేత ఒకరు ఈ అంశంపై ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. సీబీఐ, సెన్సార్‌బోర్డు రెండూ ప్రొఫెషనల్ సంస్థలు. ఆయన మా పార్టీతో పొత్తుకు రాడని తెలిశాక.. మేం ఆయనపై ఎందుకు దృష్టి పెడతాం?.. అది ఆయనకు ప్రచారం కల్పించడమే అవుతుంది కదా’’ అంటూ వ్యాఖ్యానించారు. ఇంకోవైపు..
‘‘కరూర్ ఘటనలో మేం మొదటి నుంచి నిష్పపక్షపాత దర్యాప్తు డిమాండ్ చేస్తున్నాం. మా నాయకుడు సీబీఐకి సహకరిస్తారు. నిజాన్ని ఈ దర్యాప్తు వెలికితీస్తుందని మేము ఆశిస్తున్నాం. ఒకవేళ దర్యాప్తు సంస్థల నుంచి ఏదైనా ఒత్తిళ్లు ఎదురైనట్లు అనిపిస్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం’’ అని టీవీకే ముఖ్యనేత ఒకరు ఓ జాతీయ మీడియా సంస్థ వద్ద పేర్కొన్నారు.



