మెట్రో వేగంతో ప్రాణ రక్షణ
సాక్షి, చైన్నె: మెట్రో రైలు వేగంతో చైన్నెలో ఒకే రోజు ముగ్గురికి పునర్జన్మ ఇచ్చారు. తమిళనాడు వైద్య చరిత్రలో నిలిచిపోయేలా, మానవతా దృక్పథం, ప్రభుత్వ విభాగాల అద్భుత సమన్వయంతో చైన్నెలో ఒకే రోజు మూడు ప్రాణాలు రక్షించారు. అపోలో ఆస్పత్రి వైద్యులు, తమిళనాడు పోలీసులు, చైన్నె మెట్రో రైల్ సంయుక్తంగా చేపట్టిన ఈ ‘మిషన్ లైఫ్’ విజయవంతమైంది.
తిరుచ్చి నుంచి చైన్నెకి ‘గీన్ కారిడార్’
శుక్రవారం తెల్లవారుజామున తిరుచ్చిలోని మహాత్మా గాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి సేకరించిన ఊపిరితిత్తులను చైన్నెకి తరలించేందుకు తమిళనాడు పోలీసులు ప్రత్యేక శ్రీగ్రీన్ కారిడార్‌శ్రీ ఏర్పాటు చేశారు. జిల్లాల సరిహద్దుల గుండా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అత్యంత వేగంగా ఈ అవయవాలను అపోలో ఆస్పత్రికి చేరవేశారు. ఇందులో మరో అద్భుతం ఏమిటంటే మదురైకి చెందిన 17 ఏళ్ల బాలుడు బ్రెయిన్ డెడ్ కావడంతో అతని కుటుంబసభ్యులు అవయవ దానానికి ముందుకొచ్చారు. బాలుడి గుండె, ఊపిరితిత్తులను మదురై విమానాశ్రయం నుంచి చైన్నెకి విమానంలో తరలించారు. చైన్నె విమానాశ్రయం నుంచి ఆస్పత్రికి వెళ్లే దారిలో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు చైన్నె మెట్రో రైల్ చరిత్రలో మొదటిసారిగా ఒక ప్రత్యేక రైలును కేటాయించారు. విమానాశ్రయం నుంచి డీఎంఎస్ స్ట్షేన్ వరకు కేవలం 9 నిమిషాల్లో రైలు ప్రయాణం పూర్తిచేసింది. విమానాశ్రయం నుంచి ఆస్పత్రికి చేరడానికి కేవలం 16 నిమిషాలు మాత్రమే పట్టింది.
ముగ్గురు రోగులకు కొత్త జీవితం
ఈ సమన్వయ ప్రయత్నం వలన ముగ్గురు వ్యక్తులు మృత్యువు నుంచి బయటపడ్డారు. 69 ఏళ్ల వృద్ధుడికి ఊపిరితిత్తుల మార్పిడి, 34 ఏళ్ల యువకుడికి రెండు ఊపిరితిత్తుల మార్పిడి ,43 ఏళ్ల వ్యక్తికి అత్యవసర గుండె మార్పిడి జరిగింది. మదురై, చైన్నె ఎయిర్‌పోర్ట్ అధికారులు, గ్రేటర్ చైన్నె ట్రాఫిక్ పోలీస్, అపోలో ట్రాన్‌న్స్‌ప్లాంట్ బృందం చేసిన ఈ సాహసోపేతమైన కృషిని వైద్య వర్గాలు కొనియాడాయి. 17 ఏళ్ల బాలుడి కుటుంబం తీసుకున్న నిర్ణయం అందరినీ కదిలించింది.
మెట్రో వేగంతో ప్రాణ రక్షణ


