క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Feb 28 2026 7:32 AM | Updated on Feb 28 2026 7:32 AM

క్లుప

క్లుప్తంగా

అంబేడ్కర్‌ను

మార్గదర్శిగా తీసుకోండి

కొరుక్కుపేట: డాక్టర్‌ అంబేడ్కర్‌ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని తమిళనాడు ఐడల్‌ వింగ్‌ ఏడీజీపీ డి.కల్పనా నాయక్‌ అన్నారు. మద్రాస్‌ ఆది ఆంధ్ర అరుంధతీయ ఆదివాసి సంక్షేమ సంఘం (మాస్‌) ఆధ్వర్యంలో 31వ ఆవిర్భావ దినోత్సవం గురువారం రాత్రి ఎగ్మూరులోని మద్రాస్‌ స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌, ట్యాగ్‌ ఆడిటోరియంలో జరిగింది. మాస్‌ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత కేజీ గోపాలకృష్ణ స్మారకార్థం ఏర్పాటైన కార్యక్రమానికి కల్పనా నాయక్‌ జ్యోతి ప్రజ్వలన చేసి అంబేడ్కర్‌, గోపాలకృష్ణ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ అంబేడ్కర్‌ను మార్గదర్శిగా తీసుకుని విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు పోటీ పరీక్షల ఉచిత కోచింగ్‌ మెటీరియల్‌లను మాస్‌ అధ్యక్షుడు కొల్లిరాజు ఉచితంగా పంపిణీ చేశారు. టామ్స్‌ అధ్యక్షుడు డా.గొల్లపల్లి ఇజ్రాయేల్‌, తమిళనాడు న్యాయశాఖ అడిషనల్‌ సెక్రటరీ చిన్న నాగూర్‌, జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య, సంస్థ ప్రధాన కార్యదర్శి నూనె శ్రీనివాసులు, సంస్థ ఉపాధ్యక్షుడు పి.పాలకొండయ్య పాల్గొన్నారు.

టీఎంటీకే నేత ఆత్మహత్య

అన్నానగర్‌: కళ్లకురిచ్చి జిల్లా ఉలుందూర్‌పేట సమీపంలోని తూర్పు మరుదూర్‌ గ్రామానికి చెందిన రామరాజన్‌(50) రైతు. మాజీ టీఎంటీకే కార్యనిర్వాహకుడు. రామరాజన్‌ ఇతని అన్నయ్య మధ్య వారి పూర్వీకుల భూమి, బావిని విభజించే విషయంలో వివాదం జరిగింది. ఈ స్థితిలో శుక్రవారం ఇద్దరి మద్య భూమి సమస్యకు సంబంధించి వాదన జరిగినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రామరాజన్‌ తన ఇంటి వరండాలో ధోతీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

తప్పులుంటే తెలియజేయండి

కొరుక్కుపేట: ప్లస్‌ 2, 10వ తరగతి పబ్లిక్‌ పరీక్ష ప్రశ్నపత్రంలో ఏవైనా తప్పులు, వ్యత్యాసాలుంటే విద్యార్థులు, ఉపాధ్యాయుల నుండి అభిప్రాయాన్ని తీసుకొని ఈమెయిల్‌ ద్వారా తెలియజేయాలని పరీక్షా విభాగం ప్రధాన విద్యా అధికారులను ఆదేశించింది. దీనికి సంబంధించి, ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ కె.శశికళ అన్ని జిల్లా ప్రాథమిక విద్యా అధికారులు, జాయింట్‌ డైరెక్టర్లకు పంపిన సర్క్యులర్‌లో ఇలా పేర్కొన్నారు... తమిళనాడులో మార్చి 2 నుండి ఏప్రిల్‌ వరకు జరిగే ప్లస్‌ వన్‌, ప్లస్‌ టూ, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఉన్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రానికి సంబంధించి ఏవైనా వ్యాఖ్యలు ఉంటే, పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల నుండి వ్యాఖ్యలను పొందాలన్నారు. అందించిన ఈ మెయిల్‌ చిరునామాకు తెలియజేయాలని కోరారు. ఒక ప్రశ్న తప్పు అని సాధారణంగా చెప్పే బదులు, ఏ ప్రశ్న తప్పు అని స్పష్టంగా పేర్కొనాలన్నారు. ఇచ్చిన సబ్జెక్టు ఆధారంగా పరీక్ష రోజున వ్యాఖ్యలను సమర్పించాలని, ఇది లేకుండా, ప్రశ్నాపత్రంలో అసమానతలు, లోపాలు ఉన్నాయని సాధారణ ప్రకటనలు చేయకూడదని తెలిపారు. ఈమెయిల్‌ ద్వారా అందని ఏదైనా అభ్యర్థన దరఖాస్తు అంగీకరించబడదని తెలిపారు. ఉన్నత పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయాలని కోరారు.

రెండు టన్నుల రేషన్‌

బియ్యం స్వాధీనం

తిరుత్తణి: ఆంధ్రాకు రైలులో తరలించేందుకు నిల్వ ఉంచిన రెండు టన్నుల రేషన్‌ బియ్యంను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ ద్వారా రేషన్‌ కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రా సరిహద్దులోని పళ్లిపట్టు, తిరుత్తణి, ఆర్కేపేట ప్రాంతాల్లోని గ్రామీణుల నుంచి రేషన్‌ బియ్యంను దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఆటోలు, బస్సులతో పాటు రైళ్లలో ఆంధ్రాకు తరలించి పాలిష్‌ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా తిరుత్తణి రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫాం, పరిసర ప్రాంతాల్లో గురువారం రాత్రి దాచివుంచి రైలులో ఆంధ్రాకు తరలించేందుకు ఉంచిన రేషన్‌ బియ్యం రైల్వే పోలీసులు పట్టుకున్నారు. 90 బస్తాల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తనిఖీలతో బియ్యం తరలించే దళారులు అక్కడ నుంచి పరారయ్యారు. ఈ బియ్యంను తిరుత్తణిలోని రేషన్‌ గిడ్డంగికి తరలించారు. పోలీసులు పరారైన వ్యక్తుల కోసం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

క్లుప్తంగా1
1/1

క్లుప్తంగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement