అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అత్యంత వైభవంగా ప్రారంభమైన అంతర్జాతీయ గాలిపటాల పండుగలో ప్రధాని నరేంద్ర మోదీ, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నేడు (సోమవారం) జరిగిన ఈ వేడుకలో ఇరువురు నేతలు ఉత్సాహంగా గాలిపటాలు ఎగురవేస్తూ, సందడి చేశారు. దేశ విదేశాల నుండి వచ్చిన గాలిపటాల ప్రేమికులతో ప్రధాని మోదీ ముచ్చటించారు.
మకర సంక్రాంతి సందర్భంగా మూడు రోజుల పాటు అంతర్జాతీయ గాలిపటాల పండుగ జరగనుంది. దీనిలో 50 దేశాలకు చెందిన 135 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్లతో పాటు, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 871 మంది పాల్గొంటున్నారు. అంతకుముందు జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ భారత్‌కు చేరుకోగా, అహ్మదాబాద్‌లోని చారిత్రాత్మక సబర్మతి ఆశ్రమంలో ప్రధాని మోదీ ఆయనకు సాదర స్వాగతం పలికారు. మహాత్మా గాంధీ మందిర్‌లో ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
భారత్-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, రక్షణ తదితర కీలక రంగాలలో సహకారాన్ని పటిష్టం చేసుకోవడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా మోదీ, మెర్జ్ తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఇరు దేశాల వ్యాపార, పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమై భవిష్యత్తు భాగస్వామ్యానికి బాటలు వేయనున్నారు. గతంలో కెనడాలో జరిగిన జీ7 సమ్మిట్ వేదికగా ఇరువురు నేతలు చర్చలు జరిపారు. రక్షణ, భద్రతా రంగాల్లో ఇరు దేశాల మధ్య బంధం బలపడుతూ వస్తోంది.
#WATCH | Ahmedabad, Gujarat: Prime Minister Narendra Modi and German Chancellor Friedrich Merz fly a kite at the International Kite Festival 2026 at Sabarmati Riverfront.
(Source: DD News) pic.twitter.com/P7emVdTHv1— ANI (@ANI) January 12, 2026


