ఇంటర్నెట్‌లో బూతు సినిమాలు, సోషల్ మీడియా ప్రభావంతో ఓ టీనేజర్ ఘాతుకానికి పాల్పడ్డాడు. చాలారోజులుగా ఆమెపై ఓ కన్నేసి ఉంచిన ఆ కామాంధుడు.. అదను చూసి ఆమెపై విరుచుకుపడ్డాడు. ప్రతిఘటించడంతో ఆ కోపంలో ఆమెను అత్యంత కిరాతకంగా చంపాడు. వారం కిందట ఫైర్ యాక్సిడెంట్‌లో చనిపోయిందని భావిస్తున్న టెక్కీ షర్మిల(36) కేసులో ఈ షాకింగ్ ట్విస్ట్ బయటపడింది.
రామమూర్తి నగర్‌లోని సుబ్రమణి లే అవుట్‌లోని ఓ అపార్ట్‌మెంట్ ప్లాట్‌లో జనవరి 3న అగ్నిప్రమాదం జరిగింది. ఆ ఘటనలో షర్మిల(36) అనే యువతి చనిపోయింది. షార్ట్ సర్క్యూట్‌తో ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చని.. మంటలు చెలరేగడంతో ఊపిరాడకే ఆమె మరణించినట్లు తొలుత అంతా భావించారు. అయితే.. పోలీసులకు మాత్రం అనుమానం వచ్చింది. అందుకే బీఎన్ఎస్ (BNSS) సెక్షన్ 194(3)(iv) కింద అసహజ మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే..

ఆ ఎవిడెన్స్‌తో..
దర్యాప్తులో భాగంగా సైంటిఫిక్ మెథడ్స్, టెక్నాలజీని ఉపయోగించి కీలక ఆధారాలు సేకరించారు. ఎలాంటి షార్ట్ సర్క్యూట్ జరిగిన ఆనవాళ్లు లేవని.. ఆమె ఊపిరి ఆడకే చనిపోయిందని.. అయితే అది హత్యే అని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో ఆమె పక్కింట్లోనే ఉండే కర్నాల్ కురై(18) కదలికలపై నిఘా వేశారు. చివరకు.. అతనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు.
ఆరోజు ఏం జరిగిందంటే..
కొడగు జిల్లా విరాజ్‌పేట్‌కు చెందిన కర్నాల్ తన తల్లితో కలిసి సుబ్రమణి లే అవుట్‌లోని సంకల్ప నిలయలో అద్దెకు ఉంటున్నాడు. ఇంటర్ చదివే ఈ కుర్రాడు.. నీలి చిత్రాలకు, సోషల్ మీడియాకు బానిస అయ్యాడు. ఈ క్రమంలో పక్క ఇంట్లోనే ఉంటున్న షర్మిల, ఆమె రూమ్‌మేట్‌లపై కన్నేశాడు. తన తల్లి ద్వారా వాళ్లతో పరిచయం చేసుకునే ప్రయత్నాలు చేశాడు. దక్షిణ కన్నడకు చెందిన షర్మిలకు ఇంకా పెళ్లి కాలేదు. ఓ ప్రముఖ కంపెనీలో జాబ్ చేస్తూ కొలీగ్‌తో ఉంటోంది. ఆమె రూమ్‌మేట్ రెండు నెలల కిందట స్వస్థలం అసోంకి వెళ్లింది. దీంతో షర్మిల ఒక్కతే ఉంటుందని గుర్తించాడు.
ఘటన జరిగిన రోజు రాత్రి.. స్లైడింగ్ కిటికీ(పక్కకు జరిగే కిటికీ) గుండా లోపలికి చొరబడ్డాడు కర్నాల్. తన కోరిక తీర్చాలని బతిమిలాడాడు. ఆమె తిరస్కరించడంతో బలాత్కారం చేయబోయాడు. అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. అరుస్తుందేమోనన్న భయంతో.. నోరు, ముక్కు మూసి స్పృహ కోల్పోయేలా చేశాడు. ఆ పెనుగులాటలో ఆమెకు గాయాలై.. తీవ్ర రక్తస్రావం అయ్యింది కూడా. ఆపై భయంతో పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ షాక్ నుంచి తేరుకుని ఆమె బట్టలు, నేరానికి కారణమైన వస్తువులను బెడ్‌పై ఉంచి వాటికి నిప్పంటించి, ఆమె మొబైల్ ను తీసుకుని పారిపోయాడు. చేసిన నేరాన్ని కర్నాల్ ఒప్పుకోవడంతో అతనిపై బీఎన్ఎస్ 103(1), 64 (2), 66, 238 కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.


