అఖిలపక్ష భేటీలో కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి
36 పార్టీలకు చెందిన 50 మంది సభ్యులు హాజరు
ఎస్‌ఐఆర్ సహా ముఖ్యమైన అంశాలపై చర్చించాలని డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేలా ప్రతిపక్షాలు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. 36 రాజకీయ పార్టీలకు చెందిన 50 మంది సభ్యులు హాజరయ్యారు. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, అర్జున్‌రామ్ మేఘ్వాల్, ఎల్.మురుగన్‌తోపాటు కాంగ్రెస్ తరఫున జైరాం రమేశ్, గౌరవ్ గొగోయ్, ప్రమోద్ తివారీ, వైఎస్సార్‌సీపీ తరఫున పి.మిథున్‌రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్జేడీ తరఫున మనోజ్ ఝా, డీఎంకే నుంచి టీఆర్ బాలు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి డెరెక్ ఓబ్రియన్, కల్యాణ్ బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాంగోపాల్ యాదవ్ పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్, జాతీయ భద్రత, వాయు కాలుష్యం, ఢిల్లీ బాంబు పేలుళ్లు వంటి అంశాలపై పార్లమెంట్‌లో చర్చించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రాష్ట్ర విభజన వ్యవహారాలు, విశాఖ సీŠట్ల్ ప్లాంట్, ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం వంటి అంశాలపై చర్చ చేపట్టాలని వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తి చేసింది. ఎస్‌ఐఆర్ అంశానికి అన్నింటికంటే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రత్యేకంగా చర్చించాలని తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు పట్టుబట్టాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎలాంటి అలజడి లేకుండా నిర్మాణాత్మక చర్చలు జరగాలని కోరుకుంటున్నామని, ఇందుకోసం అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతామని ప్రభుత్వం వెల్లడించింది.
అంతరాయం కలిగించవద్దు: కిరణ్ రిజిజు
పార్లమెంట్ సమావేశాలకు అంతరాయం కలిగించకూడదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. సభ సక్రమంగా జరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. ఇందుకోసం అందరి సహకారాన్ని అర్థిస్తున్నామని తెలిపారు. ఎస్‌ఐఆర్‌పై పార్లమెంట్‌లో చర్చిస్తారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఈ అంశంపై బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు బదులిచ్చారు. ప్రతిపక్షాలు చక్కటి సలహాలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తామని అన్నారు. విపక్షాలు లెవనెత్తే అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వివరించారు.
ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే కుట్రలు: గౌరవ్ గొగోయ్
ప్రధాని మోదీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మండిపడ్డారు. పార్లమెంటరీ సంప్రదాయాలను అంతం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అఖిలపక్ష భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై పార్లమెంట్‌లో చర్చించకుండా దాటవేలయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోందని అన్నారు. శీతాకాల సమావేశాల్లో కీలక అంశాలపై చర్చించాల్సిందేనని, లేకపోతే సభను స్తంభింపజేస్తామని హెచ్చరించారు.
సమావేశాలు 15 రోజులేనా?: జైరాం రమేశ్
శీతాకాల సమావేశాలను కేవలం 15 రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. తక్కువ సమయంలో ముఖ్యమైన అంశాలపై, బిల్లులపై చర్చించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. దీన్నిబట్టి మోదీ సర్కార్ ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవచ్చని వెల్లడించారు.


