ఢిల్లీ కాలుష్యంపై పార్లమెంట్‌లో చర్చించాలి | Rahul Gandhi calls for a debate on air pollution in Parliament | Sakshi
Sakshi News home page

ఢిల్లీ కాలుష్యంపై పార్లమెంట్‌లో చర్చించాలి

Nov 29 2025 6:42 AM | Updated on Nov 29 2025 6:42 AM

Rahul Gandhi calls for a debate on air pollution in Parliament

ప్రధాని మోదీ మౌనం అనుమానాస్పదం 

కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు 

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రరూపం దాల్చిన వాయు కాలుష్యంపై పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో చర్చకు పెట్టాలని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించకుండా ప్రధాని మోదీ మౌనంగా ఉండటం అనుమానాలకు తావిస్తోందన్నారు. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు వెంటనే కఠినమైన, ఆచరణ సాధ్యమైన ప్రణాళికను పక్కాగా అమలు చేయాలన్నారు. 

ఇంత తీవ్రమైన సమస్యపై మోదీ ప్రభుత్వం స్పందించకపోవడమేంటని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం తన నివాసంలో తనను కలిసేందుకు వచి్చన మహిళలతో మాట్లాడారు. అనంతరం ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్‌ విడుదల చేశారు. ‘కాలుష్యం ప్రభావం చిన్నారుల ఆరోగ్యంపై తీవ్రంగా పడుతోంది. నా వద్దకు వచి్చన ప్రతి మహిళా కాలుష్యం గురించే ఆందోళన వ్యక్తం చేశారు. ఎదిగే చిన్నారులు విష వాయువులను పీల్చుతున్నారంటూ వారు ఆగ్రహం, ఆందోళన చెందుతున్నారు. 

మీరెందుకు ఇది అత్యవసర సమస్య అని భావించడం లేదు? బాధ్యతగా ఎందుకు తీసుకోవడం లేదు?’అంటూ ఆయన ప్రధాని మోదీని ప్రశ్నించారు. ‘మన చిన్నారులకు కావాల్సింది స్వచ్ఛమైన గాలి.. సాకులు గానీ, పక్కదారి పట్టించే చర్యలు గానీ కాదు’అని రాహుల్‌ పేర్కొన్నారు. ఢిల్లీలో జీవించే అత్యంత నిరుపేదల నుంచి అత్యంత ధనికుల వరకు కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. కాలుష్యంతో లాభాలను ఆర్జిస్తున్న వారు బాధితుల కంటే శక్తివంతైన వారు కావడం వల్లే ఈ సమస్య తీవ్ర రూపం దాలుస్తోందంటూ రాహుల్‌ వ్యాఖ్యానించారు.

 కలుషిత గాలిని పీల్చుతూ దేశంలో రోజుకు 500 మంది వరకు చిన్నారులు చనిపోతున్నారని రాహుల్‌ చెప్పారు. అయినప్పటికీ దీనినో అత్యవసర అంశంగా ప్రభుత్వం భావించడం లేదని నిప్పులు చెరిగారు. బాధితులుగా ఉన్న సామాన్యులకు సంఘటితమైన రాజకీయ శక్తి లేకపోవడం వల్లే సమస్య తీవ్ర రూపం దాలుస్తోందని ఆయన తెలిపారు. శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో దీనిపై చర్చ జరపాల్సిందేనన్నారు. ‘గడిచిన 15 ఏళ్లుగా ఢిల్లీలో వాయు నాణ్యత అత్యంత తీవ్ర స్థాయికి పడిపోయింది. వచ్చే పదేళ్లలో మరింత అధ్వానంగా మారనుంది. ఇప్పటికీ స్పందించకుంటే ఇదో విస్ఫోటంలా మారుతుంది’అని ఈ సందర్భంగా ఓ మహిళ రాహుల్‌తో అన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement