హైకమాండ్‌ నిర్ణయమే.. మా నిర్ణయం | Karnataka CM Row: Siddaramaiah Shivakumar Says This After Break Fast | Sakshi
Sakshi News home page

హైకమాండ్‌ నిర్ణయమే.. మా నిర్ణయం

Nov 29 2025 2:44 PM | Updated on Nov 29 2025 3:27 PM

Karnataka CM Row: Siddaramaiah Shivakumar Says This After Break Fast

కర్ణాటక అధికార పార్టీలో నెలకొన్న కాంగ్రెస్‌ సంక్షోభం దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ ఉదయం స్పెషల్‌ బ్రేక్‌ఫాస్ట్‌తో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ భేటీ కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. అనంతరం ఇద్దరూ ప్రెస్‌మీట్‌ నిర్వహించి.. నాయకత్వ విషయంలో హైకమాండ్‌ నిర్ణయమే మా నిర్ణయం అంటూ ప్రకటించారు. 

కర్ణాటక ప్రజల మద్దతుతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. వారికిచ్చిన వాగ్దానం ప్రకారం తాను సిద్ధరామయ్యతో కలిసి పని చేస్తానని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ (DK Shivakumar) పేర్కొన్నారు.  అయితే బ్రేక్‌ఫాస్ట్‌ భేటీలో ఏం చర్చించారనే అంశంపై మాత్రం ఇద్దరూ ఐక్య ప్రకటన చేయకపోవడం గమనార్హం.

ఎలాంటి గందరగోళం లేదు. మా ఇద్దరి మధ్యా ఎలాంటి విభేదాలు లేవు. ఇక ముందు కూడా ఉండబోవు. ఏఐసీసీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సూచనల మేరకు తాము బ్రేక్‌ఫాస్ట్‌ భేటీలో పాల్గొన్నాం. నెల రోజుల ముందు నుంచి అందరిలో ఉన్న గందరగోళానికి తెరదించేందుకే ఈ భేటీ. బీజేపీ జేడీఎస్‌లు అసత్య ప్రచారానికి దిగుతున్నాయి. వాటిని మేం ఉమ్మడిగా ఎదుర్కొంటాం. 2028లో కాంగ్రెస్‌ గెలవడమే మా లక్ష్యం. అందుకోసం హైకమాండ్‌ ఏం చెప్పినా వింటాం.. అని సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) అన్నారు. 

 

 పార్టీకి విశ్వాసపాత్రులైన సైనికుల్లా పని చేస్తున్నాం. నాయకత్వం విషయంలోనూ హైకమాండ్‌ నిర్ణయమే ఫైనల్‌. ఇంతకాలం పార్టీ పెద్దలు తనను వేచి ఉండాలని సూచించారు. ఇంకొంతకాలం కూడా వేచి ఉండడానికి సిద్ధం. హైకమాండ్ ఏం చెప్పినా.. దానిని అందరం అనుసరిస్తాం. ప్రస్తుతం పార్టీ పలు సమస్యలు ఎదుర్కొంటోంది. అసెంబ్లీలో సమావేశాల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై చర్చించాం. 2028లో రానున్న కర్ణాటక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం అని డిప్యూటీ సీఎం శివకుమార్‌ అన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు గురించి గత పది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల టైంలో(2023).. రెండున్నరేళ్ల తర్వాత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సీఎం బాధ్యతలు అప్పగించేలా పవర్‌ షేరింగ్‌ ఒప్పందం కుదిరిందని ప్రచారం జరిగింది. అయితే మధ్యలో ఇద్దరూ దానిని ఖండిస్తూ వచ్చారు. తాజాగా ఈ గడువు రావడం.. డీకే వర్గం అధిష్టానంపై ఒత్తిడికి ప్రయత్నించడం.. ఇటు సిద్ధూ వర్గం కూడా కౌంటర్‌ క్యాంపెయిన్‌ నడపడం, అటుపై ఇద్దరి మద్య ఎక్స్‌ వేదికగా వార్‌ వర్డ్‌తో కర్ణాటక రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ తరుణంలో రంగంలోకి దిగిన కాంగ్రెస్‌ పెద్దలు చర్చలు జరిపి పరిస్థితిని ఓ కొలిక్కి తెచ్చినట్లు స్పష్టమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement