న్యూఢిల్లీ: నేటి(సోమవారం) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజున కేంద్ర ప్రభుత్వం దేశ ఇంధన రంగాన్ని సమూలంగా మార్చగల కీలక చట్టాన్ని ప్రవేశపెట్టనుంది. అదే అణుశక్తి బిల్లు- 2025. ఈ చారిత్రక బిల్లు ముఖ్య ఉద్దేశ్యం అణుశక్తి రంగాన్ని మొదటిసారిగా ప్రైవేట్ కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో తెరవడం. తద్వారా దేశంలో క్లీన్ ఎనర్జీ సామర్థ్యం పెంపొందుతుందని, శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
విధానపరమైన అంతరానికి చెక్
ఈ బిల్లులోని అత్యంత కీలక అంశం.. అణు విద్యుత్ ప్లాంట్లకు టారిఫ్‌ల (సుంకాల)పై తగిన నిర్ణయం తీసుకోవడం. ఇప్పటివరకు అణు రంగంలో ప్రైవేట్ పెట్టుబడిని పరిమితం చేసేలా విధానపరమైన అంతరం ఎదురవుతోంది. సరైన టారిఫ్ రెగ్యులేషన్ విధానాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, ప్రభుత్వం దేశీయ ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆకర్షించాలని, వారికి లాభదాయకతను కల్పించాలని చూస్తోంది. అంతేకాకుండా ఈ బిల్లు ఆమోదం పొందితే ఇది విదేశీ టెక్నాలజీ ప్రొవైడర్లకు భారతదేశ అణు ప్రాజెక్టులలో ప్రవేశాన్ని సులభతరం చేస్తుంది. అలాగే ఫ్రాన్స్, రష్యా, అమెరికా తదితర దేశాల సాయంతో భారతదేశ అణు సామర్థ్యం బలోపేతం కానుంది.
బిల్లులోని ముఖ్యాంశాలు
ఇప్పటివరకు న్యూక్లియస్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) ఆధిపత్యంలో ఉన్న అణుశక్తి రంగాన్ని ప్రైవేటీకరించడం ద్వారా భారతదేశ అణు విద్యుత్ సామర్థ్యం మరింతగా పెరగనుంది.
ప్రైవేట్ రంగ ప్రవేశం: ఈ బిల్లు దేశంలోని ప్రైవేట్ కంపెనీలు నేరుగా అణు విద్యుత్ ఉత్పత్తిలో పెట్టుబడి పెట్టడానికి మొదటిసారిగా అనుమతినిస్తుంది.
టారిఫ్ రెగ్యులేషన్: అణు విద్యుత్ ప్లాంట్లకు సుంకాల (టారిఫ్) నిర్ణయాన్ని పరిష్కరించడానికి ఈ బిల్లు ఒక విధానాన్ని ప్రవేశపెడుతుంది. ఇది పెట్టుబడిదారుల లాభదాయకతను, వినియోగదారుల స్థోమతను సమతుల్యం చేయడానికి దోహదపడుతుంది.
టెక్నాలజీ యాక్సెస్: బిల్లు ఆమోదం పొందిన తర్వాత విదేశీ టెక్నాలజీ ప్రొవైడర్లు భారతదేశ అణు ప్రాజెక్టులలో ప్రవేశించడం మరింత సులభం అవుతుంది.
వికసిత భారత్ : భారత ప్రభుత్వం ఈ సంస్కరణను ‘వికసిత భారత్’ దార్శనికతలో భాగంగా చూస్తున్నది. క్లీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని పెంచడం, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా ఈ బిల్లు ప్రవేశపెడుతున్నారు.
ఎదురయ్యే సవాళ్లు
అయితే ఈ సంస్కరణ పలు సవాళ్లను లేవనెత్తనుంది. విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి ఈ బిల్లు దోహదపడనున్నటప్పటికీ భద్రత, ప్రమాద బాధ్యతల ఆందోళనలు కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే అణు కార్యకలాపాలలో కఠిన నియంత్రణ, పర్యవేక్షణ అత్యవసరం. మరోవైపు కొన్ని ప్రాంతాలలో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతను ప్రభుత్వం చల్లార్చాల్సి ఉంటుంది.కాగా
ప్రస్తుత శీతాకాల సమావేశాలు డిసెంబర్ ఒకటి నుంచి 19వరకూ జరగనున్నాయి. అణు బిల్లుతో పాటు, చండీగఢ్ కోసం రాజ్యాంగ సవరణ, ఉన్నత విద్యలో సంస్కరణలు సహా 10 ప్రతిపాదిత చట్టాలను ప్రభుత్వం జాబితా చేసింది. అయితే ప్రతిపక్షం ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (సర్), జాతీయ భద్రత, పర్యావరణ ఆందోళనలు తదితర అంశాలపై చర్చను లేవనెత్తాలని భావిస్తున్నాయి. ఏదిఏమైనప్పటికీ అణుశక్తి బిల్లు- 2025 భారతదేశ ఇంధన భవిష్యత్తుకు ఒక చారిత్రక మలుపు కానుంది.
ఇది కూడా చదవండి: AIDS Day: హెచ్‌ఐవీ నయం అవుతుందా? తాజా పరిశోధనల్లో..


