జాతీయ భద్రత, ప్రజారోగ్య రంగాల కోసం అదనపు నిధులను సమీకరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ‘ఆరోగ్య భద్రత, జాతీయ భద్రతా సెస్ బిల్లు-2025’ను ప్రవేశపెట్టనుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కీలక బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది.
ఈ ప్రతిపాదిత సెస్ అనేది నిర్దిష్ట వస్తువుల ఉత్పత్తి, తయారీ యంత్రాలకు వర్తిస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. త్వరలో ముగియనున్న పొగాకు ఉత్పత్తులపై పరిహార సెస్‌ను ఈ కొత్త సెస్ భర్తీ చేయనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీని ద్వారా పొగాకు ఉత్పత్తులపై ఉన్నత స్థాయి జీఎస్టీ రేటును కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని సమాచారం.
ఈ సెస్‌ను అమల్లోకి తీసుకువచ్చేందుకు జాతీయ భద్రత, ప్రజారోగ్యం అనే రెండు ప్రధాన అంశాలు కారణంగా ఉన్నాయి. ఇటీవలి ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ఏడాది ప్రారంభంలో పార్లమెంటరీ స్థాయి ప్యానెల్ ‘ఫ్యూచర్ వార్‌ఫేర్ ఫండ్’ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. ఈ నిధిని సాయుధ దళాల్లో భవిష్యత్ యుద్ధ సాంకేతికతల అధ్యయనం కోసం ఉపయోగించాలని సూచించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రక్షణ కేటాయింపులు ఇప్పటికే రూ.6.18 లక్షల కోట్లు దాటాయి. ఈ సెస్ అమల్లోకి వస్తే మరింత నిధులు చేరే అవకాశం ఉంటుంది.
ప్రజారోగ్యం, పథకాల విస్తరణ
ఆయుష్మాన్ భారత్ వంటి కీలక ఆరోగ్య పథకాల విస్తరణకు అదనపు వనరుల అవసరం ఉంది. ప్రస్తుతం దేశ జనాభాలోని 40 శాతం ప్రజలకు చెందిన సుమారు 55 కోట్ల మంది లబ్ధిదారులకు అంటే దాదాపు 12.37 కోట్ల కుటుంబాలకు ఏటా రూ.5 లక్షల ఆరోగ్య బీమా లభిస్తోందని ప్రభుత్వ చెబుతుంది. 2025-26లో ఆరోగ్య రంగానికి సుమారు రూ.1 లక్ష కోట్ల వ్యయం అంచనా వేయగా, జాతీయ ఆరోగ్య విధానం ఆరోగ్య వ్యయాన్ని జీడీపీలో 2.5 శాతానికి పెంచాలని సిఫారసు చేస్తోంది. దాంతో ఈ సెస్ ఎంతో తోడ్పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
సెంట్రల్ ఎక్సైజ్ చట్టం సవరణ
ఈ కొత్త సెస్ బిల్లుతో పాటు, 1944కి చెందిన వలస పాలన కాలం సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్‌ను కూడా ప్రభుత్వం సవరించనుంది. సవరణ అనంతరం ఎక్సైజ్ సుంకం కేవలం ముడి పెట్రోలియం, పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్, సహజ వాయువు, పొగాకు ఉత్పత్తులకు మాత్రమే వర్తిస్తుందనే అంచనాలున్నాయి. దీనికి సంబంధించి ఇంకా సమగ్ర వివరాలు తెలియాల్సి ఉంది. పన్ను పరిధిని విస్తరించే ఉద్దేశం లేకపోయినా సమకాలీన ఆర్థిక అవసరాలకు అనుగుణంగా పాత చట్టాన్ని ఆధునీకరించడమే ఈ సవరణ లక్ష్యం అని ప్రభుత్వం పేర్కొంది.
ఇప్పటికే అమలవుతున్న సెస్‌లు
ఆదాయపు పన్నుపై 4% హెల్త్, ఎడ్యుకేషన్ సెస్.
పెట్రోల్, డీజిల్‌పై వ్యవసాయ మౌలిక సదుపాయాల సెస్, రోడ్లు, మౌలిక సదుపాయాల సెస్.
పొగాకు ఉత్పత్తులపై పరిహార సెస్.
సాధారణంగా ఈ సెస్‌ల నుంచి వచ్చే ఆదాయాన్ని కేంద్రం రాష్ట్రాలతో పంచుకోదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తరచూ విమర్శలు వస్తున్నాయి.
సరిహద్దు ఉద్రిక్తతలు, పెరుగుతున్న ఆరోగ్య డిమాండ్ల నేపథ్యంలో కేంద్రం ఈ రెండు కీలక రంగాలను సమానంగా బలోపేతం చేయాలని చూస్తోంది. అయితే సెస్‌లపై అధికంగా ఆధారపడటం వల్ల కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సంబంధాలు, వినియోగదారులపై అదనపు భారం వంటి అంశాలపై మరోసారి చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు బిల్లులు ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో ప్రధాన చర్చాంశంగా మారనున్నాయి.
ఇదీ చదవండి: ఉద్యోగాలు మట్టి కొట్టుకుపోతాయి!.. మస్క్ ఇంటర్వ్యూ


