స్పేస్‌ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్‌తో జెరోధా సహ-వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ జరిపిన ‘పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్’ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ చర్చనీయాంశమైంది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ ఇంటర్వ్యూలో ఏఐ, రోబోటిక్స్ కారణంగా భవిష్యత్తులో పని ఐచ్ఛికం(ఆప్షనల్)గా మారుతుందని మస్క్ అంచనా వేశారు. ఈ ఇంటర్వ్యూలోని కొన్ని అంశాలను కింద చూద్దాం.
ఏఐ, రోబోటిక్స్ వేగంగా అభివృద్ధి చెందుతుండడంతో మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాబోయే 10 నుంచి 15 సంవత్సరాల్లో ప్రజలు పని చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు’ అన్నారు. గరిష్ఠంగా ఈ పరివర్తన 20 సంవత్సరాల్లోపు జరుగుతుంది. ప్రజలు ఇకపై ఉద్యోగం కోసం నగరాల్లో నివసించాల్సిన అవసరం లేదన్నారు. పాశ్చాత్య దేశాల్లో మూడు లేదా నాలుగు రోజుల పని వారాల ట్రయల్స్ గురించి చర్చించినప్పుడు స్టార్టప్‌లు లేదా సంస్థల్లో క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి అధిక పని గంటలు అవసరమని మస్క్ అన్నారు.
మస్క్ ఈ అంశాలను ఉదాహరణతో వివరించారు. ‘కూరగాయలు మీరు దుకాణంలో నుంచి కొనవచ్చు లేదా తోటలో పండించవచ్చు. పని కూడా అలాంటిదే ఆప్షనల్’ అన్నారు. రోబోట్లు మరింత సమర్థంగా ఉత్పాదకతను పెంచుతూ పని చేస్తాయన్నారు. ఈ సందర్భంలో ప్రజలు తమ ఆసక్తి ఆధారంగా పని చేయాల్సి ఉంటుందన్నారు.
H-1B వీసాపై..
భారతీయుల్లో చాలా ప్రతిభ ఉందన్నారు. ‘అమెరికా భారతీయ ప్రతిభావంతుల నుంచి అపారంగా ప్రయోజనం పొందింది’ అని ఆయన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చైలను ఉదాహరణగా పేర్కొన్నారు. H-1B వీసా వివాదంపై మాట్లాడిన మస్క్ ‘అవుట్‌సోర్సింగ్ కంపెనీలు వ్యవస్థను నిర్ణయిస్తున్నాయి. నిజమైన, అద్భుతమైన ప్రతిభావంతులకు అమెరికా మద్దతు ఇవ్వాలి’ అని చెప్పారు.
వ్యక్తిగతం..
మస్క్ భాగస్వామి షివాన్ జిలిస్ గురించి మాట్లాడుతూ.. భారత్‌పై మక్కువతో నా భార్య మా కుమారుడి మధ్య పేరు ‘సేఖర్’ (భారతీయ-అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త చంద్రశేఖర్ పేరు) అని పెట్టిందన్నారు. ఇన్వెస్టింగ్ దృక్పథంలో మౌలిక సమస్యలను పరిష్కరించే కంపెనీలపై పెట్టుబడి పెట్టండన్నారు. యూఎస్ ఆర్థిక ఋణాన్ని తగ్గించడానికి ఫ్రీట్రేడ్ మాత్రమే మార్గమని చెప్పారు. ఈ పాడ్‌కాస్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీగా స్పందన లభించింది. యూట్యూబ్‌లో 1.5 మిలియన్ వ్యూస్, ఎక్స్‌లో 6 మిలియన్‌కు పైగా రీచ్ వచ్చింది.
Interview with Nikhil https://t.co/4mmIo9rcKw
— Elon Musk (@elonmusk) November 30, 2025


