మార్కెట్‌కు వృద్ధి రేటు ఊతమిచ్చే ఛాన్స్
ఈ వారం ఆర్‌బీఐ సమీక్షలో వడ్డీ రేట్లపై నిర్ణయం
తగ్గించే అవకాశాలే ఎక్కువ;
ఇది కూడా జోష్ పెంచేదే
మరింత గరిష్ఠ స్థాయిలకు వెళ్లవచ్చని అంచనాలు
మార్కెట్లు ఆల్‌టైమ్ రికార్డులకు అత్యంత చేరువలో ఉన్నాయి. గతంలో రెండుసార్లు మార్కెట్ ఈ స్థాయిలకు వచ్చి... అక్కడి నుంచి ముందుకు వెళ్లలేక కొంత కరెక్షన్‌కు గురయ్యింది. ఈ సారి మాత్రం మార్కెట్లు ముందుకెళ్ళి, కొత్త ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిలను నమోదు చేసే అవకాశం ఉందనేది నిపుణుల మాట. గత వారం చివర్లో... అది కూడా మార్కెట్లు ముగిశాక విడుదలైన క్యూ2 జీడీపీ వృద్ధి గణాంకాలు మార్కెట్‌ను ముందుకు నడిపించడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నది వారి అభిప్రాయం.
ఎందుకంటే వృద్ధి రేటు అంచనాలను మించింది. తయారీ, సర్వీసు రంగాలు 9 శాతం వృద్ధిని దాటి పరుగు తీయడంతో ఆరి్థక వ్యవస్థ 8.2 శాతం ఎగసింది. ఇది ఆరు త్రైమాసికాలలోనే అత్యధికం. కాబట్టి ఈ ప్రభావం సోమవారం మార్కెట్లలో ప్రతిఫలించనునున్న విశ్లేషకులు చెబుతున్నారు. యూఎస్ టారిఫ్‌ల నేపథ్యంలో జీఎస్‌టీ రేట్లను సవరించటమనేది దేశ ఆరి్థక వ్యవస్థ బలపడటానికి ఉపకరించినట్లు వారు అభిప్రాయపడుతున్నారు.
దేశీ కీలకాంశాలివే...
→ ఈ వారం మార్కెట్లను ప్రభావితం చేయబోయే దేశీయ అంశాల్లో ప్రధానమైనది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి విధానంపై జరిపే సమీక్షా సమావేశం. ఈ నెల 5న (వారాంతాన) ఈ సమావేశం ముగుస్తుంది. మరింతగా రేట్లను తగ్గించటమా... లేదా యథాతథ పరిస్థితిని కొనసాగించటమా అన్నది మార్కెట్లను ప్రభావితం చేయనుంది. వృద్ధి రేటు పెరిగింది కనక రేట్ల కోత ఉండొచ్చన్నదే ఎక్కువ మంది అభిప్రాయంగా కనిపిస్తోంది.
→ డిసెంబరు 1న (సోమవారం) అక్టోబర్ నెలకు సంబంధించిన దేశ పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు విడుదలవుతాయి. సెపె్టంబర్‌లో ఐఐపీ 4 శాతం వద్ద నిలకడగా నమోదైంది. తయారీ రంగం 4.8 శాతం పుంజుకోవడం ఇందుకు సహకరించింది.
→ నవంబర్ నెలకు ఆటో రంగ విక్రయ గణాంకాలు సైతం 1న వెలువడనున్నాయి. దీంతో పాటు హెచ్‌ఎస్‌బీసీ తయారీ, సర్వీసులు, కాంపోజిట్ పీఎంఐ గణాంకాలు ఈ వారం విడుదలకానున్నాయి.
సాంకేతికంగా స్పీడ్..
→ గత వారం మొదట్లో దేశీ స్టాక్ మార్కెట్లు బలహీనపడినప్పటికీ చివర్లో బౌన్స్ బ్యాక్ అయ్యాయి. దీంతో సరికొత్త గరిష్టాలను తాకాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 85707 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 26,203 పాయింట్ల వద్ద ముగిశాయి. సాంకేతికంగా చూస్తే ఈ వారం సైతం మార్కెట్లు మరింత పుంజుకునే వీలుంది. నిఫ్టీ 26,300 పాయింట్లను దాటితే.. 26,800– 26,850 వరకూ బలపడవచ్చు. ఇలాకాకుండా ఈ స్థాయిలో బలహీనపడితే.. తొలుత 26,000 పాయింట్లకు నీరసించవచ్చు. తదుపరి 25,850–25,800 పాయింట్ల స్థాయిలో సపోర్ట్ లభించే వీలుంది.
గమనించాల్సిన ప్రధాన షేర్లు...
అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, భారత్ ఎల్రక్టానిక్స్, ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్, గెయిల్ ఇండియా కంపెనీల షేర్లను గతవారం పలు బ్రోకరేజీ సంస్థలు రికమెండ్ చేశాయి.
వీటి టార్గెట్ ధరను అప్‌గ్రేడ్ చేశాయి కూడా. దీంతో ఈ వారం ఇన్వెస్టర్లు ఈ షేర్లలో కదలికలను గమనించవచ్చు.


